‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు’ అంటూ వేమన గాడిద పాలను తృణీకరించాడు గానీ, గాడిద పాలకు గ్లోబల్ మార్కెట్లో గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. వేమన గాడిద పాలను సరిగా విలువ కట్టలేకపోయాడు. ఇప్పటి పరిస్థితులను అంచనా వేసి ఉన్నట్లయితే, ‘గరిటెడైనను చాలు ఖరము పాలు’ అంటూ పద్యాన్ని తిరగ రాసేవాడేమో.
ఎందుకంటే, గరిటెడు గాడిద పాల ధర కడివెడు గంగిగోవు పాల ధర కంటే ఎక్కువే మరి. మన దేశంలో గాడిద పాల వినియోగం చాలాకాలం నుంచే ఉన్నా, పాల కోసం గాడిదల పెంపకం పారిశ్రామిక స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఆఫ్రికా, పశ్చిమాసియా, ఉపఖండ ప్రాంతాలను విడిచిపెడితే, ప్రపంచంలో మిగిలిన చాలా దేశాల్లో గాడిద పాల వినియోగం పారిశ్రామిక స్థాయికి చేరుకుంది. వయసు మళ్లే ప్రక్రియను గాడిద పాలు ఆలస్యం చేస్తాయనే నమ్మకం క్రీస్తుపూర్వం నాటి నుంచే ఉండేది. గాడిద పాల ఔషధ లక్షణాలపై తాజా వైద్య పరిశోధనల ఫలితాలు ఆ నమ్మకాన్ని బలపరుస్తున్నాయి.
సంచారజాతుల వారు గాడిదలను తోలుకుంటూ వీధుల్లో తిరుగుతూ, వాటి పాలను అమ్మడం భారత్‌లోనే కాదు, అర్జెంటీనా, చిలీ వంటి లాటిన్ అమెరికా దేశాల్లోనూ మామూలే. ఉబ్బసంతో బాధపడే చిన్న పిల్లలకు గాడిద పాలు పట్టడం మన దేశంలో చాలాకాలంగా కొనసాగుతున్న పద్ధతి. గాడిద పాలు తాగే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే నమ్మకం కూడా ఉంది.గాడిద పాల ఔషధ విలువలపై జనంలో బాగా నమ్మకం ఉండటంతో వీటి ధర చాలా ఎక్కువ. లీటరు గాడిద పాల ధర దాదాపు రెండువేల రూపాయల వరకు ఉంటుంది.

ఔషధప్రాయమైన వినియోగం కోసం సుమారు 25-30 మిల్లీలీటర్ల మోతాదుల చొప్పున అమ్ముతుంటారు. ఒక్కో మోతాదు ధర రెండువందల రూపాయలకు పైమాటే. మన ఇండ్ల దగ్గరకు వచ్చే వారు ఒక చిన్న జండు బాంబ్ ఖాళీ గా ఉంది దాని నిండుగా గాడిద పాలు ఇస్తే వంద రూపాయలు తీసుకుంటాడు. మన దేశంలో గాడిద పాలను ఔషధప్రాయంగా మాత్రమే వినియోగిస్తారు. లాటిన్ అమెరికన్ దేశాల్లోనైతే ఔషధంగా మాత్రమే కాదు, తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా కూడా పిల్లలకు పడతారు.
డాంకీ మిల్క్ బ్యూటీ’, ‘డాంకీస్ అండ్ కో’ వంటి కంపెనీలు గాడిదపాలతో సౌందర్య సాధనాలు మొదలుకొని, నవయవ్వన ఔషధాల వరకు నానా ఉత్పత్తులను తయారు చేస్తూ మార్కెట్‌ను విస్తృతం చేసుకుంటున్నాయి.
మిల్క్‌సౌడర్, సబ్బులు, ఫేస్‌క్రీములు, కాన్సంట్రేటెడ్ యాంటీ ఆక్సిడెంట్ క్యాప్సూల్స్, ‘నేచురల్ వయాగ్రా’వంటి ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. యూరోపియన్ దేశాలతో పాటు చైనా, జపాన్, కొరియా వంటి ప్రాచ్య దేశాలు కూడా గాడిద పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి.
తాజా పరిశోధనల్లో తేలిన విశేషాలు

పోషక విలువల ప్రకారం తల్లిపాలకు దగ్గరగా ఉండేవి గాడిద పాలేనని ఆధునిక పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా గాడిద పాలలో లాక్టోజ్ దాదాపు తల్లిపాలకు సమానంగా ఉంటుందని, కొవ్వుశాతం చాలా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. స్థూలకాయం నుంచి బయటపడేందుకు కూడా గాడిదపాల వినియోగం శ్రేయస్కరమని వారు సూచిస్తున్నారు.
జనాభాలో దాదాపు 2-6 శాతం ప్రజలకు ఆవుపాలు సరిపడవని, ఆవు పాల వల్ల వారు అలెర్జీలతో బాధపడుతున్నారని, అలాంటి వారికి గాడిద పాలు మేలు చేస్తాయని ఐక్యరాజ్య సమితి అధ్యయనం తేల్చింది. గాడిద పాలలో విటమిన్-సి, బి, డి-12, ఇ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆవుపాలతో పోలిస్తే, గాడిద పాలలో విటమిన్-సి అరవై రెట్లు ఎక్కువగా ఉంటుంది.
కీలకమైన ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలింది. గాడిద పాల వినియోగం ఫలితంగా ఉబ్బసం, సొరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులు నయమైనట్లు ఇటీవల సైప్రస్ వర్సిటీ శాస్త్రవేత్త, డెయిరీ సైన్స్ లెక్చరర్ డాక్టర్ ఫోటిస్ పాపడెమాస్ నిర్వహించిన పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. సైప్రస్‌తోపాటు ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, స్పెయిన్, హాలండ్, సెర్బియా, బోస్నియా వంటి దేశాల్లో పాల కోసం గాడిదల పెంపకం పరిశ్రమ స్థాయిలో కొనసాగుతోంది.

యూరోప్‌లో సేకరించిన గాడిద పాలలో దాదాపు సగానికి సగం సౌందర్య పోషణకు ఉపయోగపడే ఉత్పత్తుల తయారీకే తరలిపోతోంది. ఈ దేశాల్లో గాడిద పాలను నేరుగా తాగడంతో పాటు వివిధ ఆహార ఉత్పత్తులనూ తయారు చేస్తున్నారు. సైప్రస్‌లోనైతే గాడిద పాలతో మధువును కూడా తయారు చేస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో గాడిద పాలతో తయారయ్యే చీజ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. దీని కిలో ధర 1350 డాలర్ల వరకు ఉంటుంది. గాడిద పాలతో చీజ్ తయారు చేయాలంటే, ఒక కిలో చీజ్ తయారీకి దాదాపు వంద కిలోల పాలు అవసరమవుతాయని స్విస్ షెఫ్ జీన్ మైకేల్ ఎవెక్వోజ్ చెబుతున్నారు.
వయసు మళ్లిన వారికి గాడిద పాలు బలవర్ధకమైన ఆహారంగా ఉపయోగపడతాయని ఒక పరిశోధనలో తేలిన విషయాన్ని ‘ఇంటర్నేషనల్ డెయిరీ జర్నల్’ వెల్లడించింది. అంత విస్తృతంగా కాకపోయినా, మన దేశంలోనూ గాడిద పాల గుణగణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. గాడిద పాలలో యాంటీ-కేన్సర్ లక్షణాలు, లైంగిక సామర్థ్యాన్ని పెంచే లక్షణాలు ఉన్నాయని లక్నో యూనివర్సిటీ పరిశోధకులు కొద్ది సంవత్సరాల కిందటే వెల్లడించినా, పెద్దగా ప్రచారం లభించలేదు.
కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహకారంతో డాక్టర్ అయినాక్షి ఖరే నేతృత్వంలో లక్నో వర్సిటీ బృందం గాడిద పాలపై పరిశోధనలు సాగిస్తోంది. గాడిద పాలు ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేయలేకపోయినా, రోగుల జీవితకాలాన్ని పొడిగించేందుకు గణనీయంగా దోహదపడగలవని లక్నో వర్సిటీ పరిశోధకుడు దేశ్ దీపక్ చెబుతున్నారు.

గాడిద పాలలోని పోషకాల ప్రాముఖ్యత
1. ఇందులో పెద్ద మొత్తంలో బి, బి12, సి విటమిన్లతోపాటు న్యూట్రిన్లు ఉంటాయి.

2. తల్లి పాలతో సమానమైన స్థాయిలో కాలరీలు, మినరల్స్ ఉంటాయి. ఈ పాలు గేదె పాలతో సమానమైన బలం ఉంటుందని భావిస్తారు.
3. అప్పుడే పుట్టిన పిల్లల్లోని ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నివారణకు గాడిద పాలతో పరిష్కారం అవుతుందని నమ్మకం ఉంది.
4. అప్పుడే పుట్టిన పిల్లలో క్షయ, ఆస్తమా, గొంతు సంబంధిత వ్యాధుల నివారణకు తయారుచేసే ఆయుర్వేద మందులలో గాడిద పాలను వినియోగిస్తారు.
5. గాడిద పాలలో ప్రొటీనులు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. కానీ మినరల్స్, విటమిన్లు అధిక పాళ్లలో ఉంటాయి.
6. ఆవుల వల్ల వచ్చే అలెర్జీ సంబంధిత వ్యాధులు గాడిద పాలతో నయమవుతాయి.
7. నవజాత శిశువులకు పూర్తి ఆహారాన్ని అందించడంతోపాటు వారిలోని చర్మవ్యాధులను నయం చేస్తుంది.
8. గాడిద పాలలో కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లల్లో ఎముకల పటిష్టత, విరిగిన ఎముకలను అతికించే స్వభావం అధికంగా ఉంటుంది.
9. తల్లిపాలతో పోల్చుకుంటే కనీసం 60 రెట్ల విటమిన్ సి ఉంటుంది. అందుకే గాడిద పాల కోసం ఎగబడుతున్నారు.
గాడిద పాలతో చేసిన ఛీజ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఛీజ్.. అని ప్రకటించింది సెర్బియాకు చెందిన ఒక సంస్థ. గాడిదల్లో అత్యంత శ్రేష్టమైన జాతి ‘బాల్కన్’. ఈ జాతి గాడిద పాల నుంచే చీజ్‌ను తయారు చేస్తారు. ముందస్తు ఆర్డరు ఇచ్చిన వాళ్లకే బాల్కన్ డాంకీ ఛీజ్ అందుతుంది.
నవయవ్వన సాధనం!

గాడిదపాలు నవయవ్వన సాధనం కాగలదా? అంటే, ఇప్పటి వరకు వెలువడిన తాజా పరిశోధనలు ఔననే అంటున్నాయి. అంతేకాదు, గాడిదపాలతో దీర్ఘాయువు కూడా సాధ్యమేనంటున్నారు. ఈక్వెడార్‌లో దాదాపు ఏడేళ్ల కిందట మారియా ఎస్తర్ డి కాపోవిల్లా అనే మహిళ తన 116 ఏళ్ల వయసులో మరణించింది. బాల్యం నుంచి ఆమె రోజూ గాడిద పాలే తాగేది. కాపోవిల్లా మృతి దరిమిలా శాస్త్రవేత్తలు గాడిద పాలలో దీర్ఘాయువు కలిగించే లక్షణాలపై సాగించిన పరిశోధనల్లోనూ ఆశాజనకమైన ఫలితాలే వచ్చాయి. గాడిద పాలలో ఇన్ని విశేషాలు ఉన్నా, మన దేశంలో గాడిద పాల ఉత్పత్తి పారిశ్రామిక స్థాయికి చేరుకోకపోవడం గమనార్హం.
డాక్టర్ జి. రాంబాబు, పశు వైద్యాధికారి, కడప. సెల్: 9618499184

