పాడి పరిశ్రమను కొత్తగా చేపట్టే వారికి, పాడి పశువుల ఎంపిక పెద్ద సమస్యగా కనిపిస్తుంది. ముఖ్యంగా, ఇటీవల తెలంగాణలో ‘దళితబంధు’లో భాగంగా, పాడి పరిశ్రమ పట్ల కొంతమంది ఆసక్తి చూపడం సంతోషించదగిన విషయం. కానీ, పూర్తి అవగాహన, పాడి ఉత్పత్తుల మార్కెటింగ్ పట్ల నిర్దిష్ట దృక్పథం లేకపోతే, పాడిపరిశ్రమ లేదా గేదెలతోనా పాడి పరిశ్రమ చేపట్టడం, దాని వలన లాభనష్టాలు సరైన రీతిలో లబ్దిదారులకు వివరించకపోవడం వలన, ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చు. వీలైనంత వరకు, పక్క రాష్ట్రాల నుండి పాడి పశువుల కొనుగోలు చేస్తే, వాతావరణపరంగా, అవి పాల దిగుబడి స్థిరంగా ఇస్తాయి. మంచి పాడిపశువుల ఎంపికలో పాడి పశువుల జాతి, వాటి వంశ చరిత్ర పాల ఉత్పత్తి వివరాలు, శరీర లక్షణాలు అనే నాలుగు ప్రధాన అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ఆవుల్లో మంచి దేశవాళీ ఆవులుగానీ, సంకరజాతి జెర్సీ, హెచ్.ఎఫ్. జాతులు, గేదెల్లో జాఫ్రాబాదీ, గ్రేడెడ్ ముర్రా జాతులు ఎంపిక చేయడం మంచిది. రోజుకు కనీసం 10 లీ. తక్కువగాకుండా పాల దిగుబడి ఉన్న పాడిపశువులు ఎంపిక చేయాలి. 2-6 పళ్ళు వేసిన పాడి పశువులను, దూడతో సహా కొనుగోలు చేయాలి. సాధారణ శరీర లక్షణాలకు 30 మార్కులు, పాడి లక్షణాలకు 20 మార్కులు, శరీర సామర్థ్యానికి 20 మార్కులు, పొదుగు ఆకారం, స్థితికి 30 మార్కుల స్కోర్ కార్డ్‌పై మార్కులు వేసుకుని అంచనా వేయాలి.
పాడి పశువు ఆరోగ్యంగా, చురుకుగా, ఆకర్షణీయంగా ఆడలక్షణాలు ఉండాలి. శాంత స్వభావం, వెనకనుండి త్రికోణాకారంలో ఉండి, పొదుగు, రోమాలు ఆరోగ్యంగా ఉండేలా చూడాలి. చర్మం శుభ్రంగా ఎలాంటి చర్మ వ్యాధులు లేకుండా, కాలిగిట్టలు మందమైన అరికాళ్ళతో, డొక్కలు నిండుగా ఉండేలా చూడాలి. పాలనరాలు పొదుగుకు ఇరువైపులా, స్పష్టంగా పైకి ఉబ్బి ఉండాలి.
వీలైనంతవరకు రైతువద్ద పశువుల కొనుగోలు చేయాలి. పాలను రెండు, మడు రోజులు పిండి, చూసి తీసుకోవాలి. టీకాలు వేయించినవి, పొదుగువాపు లాంటి వ్యాధులు లేని పాడి పశువులకు ఎంపిక చేయాలి. కొనేచోట, పాడిపశువుకు అలవాటైన ఆహారాన్ని తెలుసుకుని, పశువు కొనుగోలు, తర్వాత, 5-6 రోజులు అదే ఆహారాన్ని ఇస్తూ, స్థానికంగా దొరకే పశుగ్రాసాలు, దాణా అలవాటు చేయాలి. బీమా విషయంలో రవాణా బీమా పశువుకు బీమా తప్పకుండా చేయించాలి. పాడి పశువు కొనుగోలు చేయడానికి మూడు నెలల ముందు నుంచే పశుగ్రాసాల పెంపకం చేపట్టాలి.
ఏదిఏమైనా, దూడలు తెచ్చుకుని 1-2 సం|| మన ప్రాంతాల్లో మేపి, వాటితో పాడిపరిశ్రమ విస్తరించడం అనేది శ్రేయోదాయకం. అప్పుడే స్థిరమైన పాల దిగుబడి, పాడి విస్తరణ సాధ్యపడుతుంది.
మధుసూదనరావు, ఉపసంచాలకులు, విజయడెయిరీ, ఆదిలాబాదు.
ఫోన్ : 9121160553
