కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
– 12,500 టన్నులతో బయల్దేరిన మొదటి నౌక-
ప్రపంచ మార్కెట్లలో విక్రయాల దిశగా ముందడుగు వేశామన్న మంత్రి
ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతి ప్రారంభమైంది. ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం లోడ్‌తో వెళ్లే నౌకను సోమవారం హోప్ ఐలాండ్ సమీపంలోని ఇన్నర్ యాంకర్ వద్ద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ జానయ్య, సీపోర్టు అధికారులు పాల్గొన్నారు. లోడింగ్ ప్రక్రియను పరిశీలించిన అనంతరం మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. ”తెలంగాణలోని మిగులు ధాన్యాన్ని ప్రపంచ మార్కెట్లలో విక్రయించే దిశగా ముందడుగు వేశాం. వచ్చే వర్షాకాలంలో 150 లక్షల టన్నులు, వేసవిలో 130 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కోటా కంటే అధికంగా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి అవుతోంది. మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలుకు రాష్ట్రం భారీగా నిధులను వెచ్చిస్తోంది. కస్టమ్ మిల్లింగ్‌కు అయ్యే వ్యయాన్ని చెల్లించడంలో ఎఫ్‌సీఐ తీవ్ర జాప్యం చేయడం వల్ల ప్రభుత్వంపై వడ్డీల భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవసరాలకుపోను మిగులు బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. నాణ్యత పరిశీలించి దిగుమతి చేసుకోవడానికి ఫిలిప్పీన్స్ ముందుకొచ్చింది. మొత్తం 8 లక్షల టన్నుల ఐఆర్ 64/1010 రకం బియ్యం ఎగుమతికి ఫిలిప్పీన్స్‌తో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు ఒప్పందం కుదిరింది. మొదటి విడతగా లక్ష టన్నులు ఎగుమతి చేస్తున్నాం. రూ.45 కోట్ల విలువైన 12,500 టన్నులతో మొదటి నౌక బయల్దేరింది. రైతులకు మేలు చేయడానికి ఆఫ్రికాతోపాటు ఆగ్నేయాసియాలోని పలు దేశాలతో మార్కెటింగ్ ఒప్పందాలు చేసుకుంటాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. తెలంగాణ బియ్యం త్వరలో అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన స్థానాన్ని పొందుతుందని విశ్వసిస్తున్నాం. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడంతో పాటు రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది” అని ఉత్తమ్ తెలిపారు.

