మొంథా తుపాను, అకాల వర్షాలు, అనిశ్చిత వాతావరణం కారణంగా తెలంగాణలో పత్తి, సోయా బీన్‌, మొక్కజొన్న కొనుగోళ్లలో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించాలని, తీవ్రంగా దెబ్బతిన్న మూడు పంటల కొనుగోళ్లపై ప్రత్యేక సడలింపులివ్వాలని, లక్షల మంది రైతులకు ఆదుకునేలా నిర్ణయాలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆయన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌లకు గురువారం లేఖలు రాశారు. ”మొంథా తుపాను వల్ల పత్తి పంట దెబ్బతింది. రైతులు నష్టపోకుండా సీసీఐ తేమ శాతం 20కి పెంచి కొనేలా ఆదేశాలివ్వాలి. ఎకరానికి 11.74 క్వింటాళ్ల మేరకు పత్తి రాష్ట్రంలో పండగా.. సీసీఐ 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసే నిబంధన తేవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 3.66 లక్షల ఎకరాల్లో సోయాబీన్‌ వేయగా.. వర్షాల వల్ల పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. నాఫెడ్‌ ద్వారా నాణ్యత ప్రమాణాలు సడలించి కొనుగోలు చేయాలి. రాష్ట్రంలో 6.74 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండించగా… మార్కెట్లో ధర క్వింటాకు రూ.1,959కి పడిపోయింది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.2,400 రావడంలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కొనుగోళ్లు చేపట్టింది. ఇప్పటివరకు 14,519 మంది రైతుల నుంచి 48,757 టన్నులను కొన్నది. మొత్తం పంట కొనేందుకు కేంద్రమే చొరవచూపాలి” అని తుమ్మల కోరారు.