కోవిడ్‌-19 కరోనా వైరస్‌ డిసీజ్‌ అనేది కొత్తరకం సార్స్‌ కరోనావైరస్‌-2 అను వైరస్‌ వల్ల కలుగు వ్యాధి. ఈ వ్యాధి ప్రపంచం అంతటా వ్యాపించటమే కాకుండా, కొన్ని చోట్ల జంతువులలో కూడా ఈ వైరస్‌ గుర్తించటం వలన యాజమాన్యంలో చాలా సందేహాలు కలుగుతున్నాయి. మరీ ముఖ్యంగా పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు కరోనా వ్యాధి బారిన పడే అవకాశం ఉన్నందున వాటి యజమానులలో చాలా సందేహాలు కలుగుతున్నాయి. కరోనావైరస్‌ యొక్క కుటుంబంలో అనేక రకాలైన కరోనా వైరస్‌లు ఉన్నాయి. వివిధ జంతుజాతులు ఈ వైరస్‌ల బారిన పడే అవకాశం ఉంది. కానీ ఒక్కో వైరస్‌ ఒక్కో రకమైన వ్యాధిని కలుగజేస్తుంది. ఈ కరోనా వైరస్‌ కుటుంబంలో నాలుగు జాతులు ఉన్నాయి. ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టా కరోనా వైరస్‌. సార్స్‌ కరోనావైరస్‌-2 బీటా కరోనా వైరస్‌ జాతికి చెందుతుంది. కుక్కలకు మరియు పిల్లులకు సోకు కరోనా వైరస్‌ ఆల్ఫా కరోనా వైరస్‌ జాతికి చెందుతుంది. సార్స్‌ కరోనా వైరస్‌-1 2002-2004 సంవత్సరంలో చైనాలో అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ అను వ్యాధి అకస్మాత్తుగా వ్యాపించి చాలామంది చనిపోవడం జరిగింది. అంతేకాకుండా 2012వ సంవత్సరంలో మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ వల్ల కూడా పలు దేశాలలో మరీ ముఖ్యంగా సౌదీ అరేబియాలో చాలామంది చనిపోవడం జరిగింది. ఈ రెండు వ్యాధిగ్రస్తులలో గుర్తించబడిన సార్స్‌ మరియు మెర్స్‌ కరోనా వైరస్‌లు బీటా జాతికి చెందినది. ఇవి కేవలం మనుష్యులలో మాత్రమే గుర్తించబడ్డాయి. చాలామంది ఈ వ్యాధుల బారిన పడినప్పటికీ జంతువులలో మాత్రం ఈ వ్యాధికారక వైరస్‌లు గుర్తించబడలేదు.

కుక్కల కరోనా వ్యాధి: కుక్కలలో కరోనా వైరస్‌ వల్ల జీర్ణవ్యవస్థకు సోకటం వల్ల విరేచనాలు అవుతాయి. ముఖ్యంగా కుక్కపిల్లలు ఎక్కువగా/బాగా బాధపడతాయి. కానీ కుక్కలకు ఈ వ్యాధి నివారణ కోసం టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం కుక్కలలో మాత్రమే పనిచేస్తాయి. కుక్కలలో కరోనావ్యాధి ముఖ్యంగా కుక్క పిల్లలలో ప్రేగులకు సంక్రమించు అంటువ్యాధి. వ్యాధి సోకిన కుక్క పిల్లలు స్వల్పకాలం పాటు ఉదర సంబంధమైన అసౌకర్యాలతో బాధపడతాయి. ఈ వైరస్‌ కేవలం జీర్ణాశయాంతర సమస్యలను మాత్రమే కలుగజేసి, మలం ద్వారా విసర్జించబడుతుంది. దీనివల్ల ఆహార పదార్థాలు, నీరు, పాత్రలు కలుషితమవుతాయి. కలుషితమైన ఆహార గిన్నెల నుండి తినడం లేదా సోకిన కుక్కలతో దగ్గరగా ఉండటం వలన ఆరోగ్యవంతమైన కుక్కలు వ్యాధిబారిన పడవచ్చు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలు మరియు అపరిశుభ్రమైన పరిసరాలు కరోనావైరస్‌ వ్యాప్తికి దోహదపడతాయి. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన దగ్గరి నుండి వ్యాధి లక్షణాలు కనపడడానికి 1 నుండి 4 రోజులు పడుతుంది. చాలా కుక్కలలో వ్యాధి లక్షణాలు 2-10 రోజుల వరకు ఉంటాయ. ఇతర వైరస్‌లు, బ్యాక్టీరియా మరియు పరాన్నజీవుల వల్ల అనారోగ్య తీవ్రత ఎక్కువ అవడమే కాకుండా అవి తొందరగా కోలుకోలేవు. ఒకసారి వ్యాధి సోకిన తర్వాత దాదాపు ఆరు నెలల పాటు వ్యాధికారక వైరస్‌లు శరీరం నుండి విడుదల అవుతూ ఉంటాయి.

వ్యాధి లక్షణాలు: చాలా కుక్కలలో వ్యాధి లక్షణాలు బయటకు కనిపించవు. కొన్నింటిలో మాత్రమే వ్యాధి లక్షణాలు బహిర్గతం అవుతాయి. అప్పుడప్పుడు వ్యాధి లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వ్యాధిసోకిన కుక్కలు ముఖ్యంగా చిన్న కుక్కపిల్లలలో అకస్మాత్తుగా విరేచనాలు అవడం ప్రారంభమవడమే కాకుండా అతిసారంలాగా మారే అవకాశం ఉంది. బద్ధకంగా ఉంటూ ఆకలి మందగిస్తుంది. మలం వదులుగా ఉండి, నారింజ రంగులో దుర్వాసన కూడి ఉంటుంది. అప్పుడప్పుడు రక్తం లేదా శ్లేష్మం కలిగి ఉండవచ్చు. ఒకవేళ అది మిశ్రమ సంక్రమణ అయి ఉంటే ఉదాహరణకు కరోనా వ్యాధి, పార్యోవైరస్‌ రెండు ఉన్నట్లయితే అనారోగ్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

చికిత్స: కరోనా వైరస్‌ సంక్రమణకు నిర్ధిష్టమైన చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీబయాటిక్‌ మందులు వైరస్‌ సంక్రమణలకు పనిచేయవు. కానీ ఇవి ఇతర బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను నియంత్రించడానికి ఉపయోగపడవచ్చు. తీవ్రమైన అతిసారం వల్ల శరీరంలోని నీటిశాతం బాగా తగ్గిపోతుంది. కాబట్టి కుక్కపిల్లలకు వెంటనే గ్లూకోజ్‌ సీసాలను ఎక్కించాలి. అతిసారం ఆగిపోయిన తర్వాత 24 గంటల పాటు ఆహారం ఇవ్వకుండా క్రమక్రమంగా కొద్దిమొత్తంలో ఆహారం ఇస్తూ మొదలుపెట్టాలి. 

వ్యాధి నియంత్రణ: కుక్కల కరోనావ్యాధికి టీకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అన్ని కుక్కలకు ఈ టీకా మందును ఇవ్వకూడదు. అది దాని యొక్క జీవనశైలి మరియు టీకాలతో వచ్చు దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని సలహా ఇవ్వాలి. ఈ టీకా కేవలం కుక్కలకు మాత్రమే పనిచేస్తుంది. మనుష్యులలో సంక్రమించే కోవిడ్‌-19 నివారణకు ఈ టీకా పనిచేయదు.   

కళ్యాణి పుట్టి, 9550862090, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్‌, వెటర్నరీ బయోటెక్నాలజీ విభాగం