తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షలకు పైబడి ఉన్న కౌలు రైతుకు రైతు భరోసా కోసం.. సబ్ కమిటీలో విధివిధానాలు ఖరారు చేసి, కౌలు రైతుల గుర్తింపుకు సంబంధించిన చర్చ జరుగుతుంది.
ఈ సీజన్ నుంచే కౌలు రైతులకు కూడా రైతుభరోసా (రైతుబంధు) అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై క్యాబినెట్ సబ్‌కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు ఏడాదికి రూ. 15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. అయితే, కౌలు రైతులను ఏ విధంగా గుర్తిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉండగా, కౌలు రైతులు 25 లక్షల పైబడి ఉంటారని కౌలురైతు సంఘాల నేతలు చెప్తున్నారు.
- 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన కౌలు రైతు చట్టంలో పొందుపరచిన విధివిధానాల ప్రకారం కౌలు రైతులను గుర్తిస్తారు. కౌలు రైతుకు ఇచ్చిన భూమి విస్తీర్ణంకు సంబంధించి కౌలుదారు మరియు యజమాని ఇద్దరూ ఒప్పంద పత్రంపై సంతకాలు చేయాలి. ఆ ఒప్పందం గ్రామసభ ఆమోదం పొందాలి.
- ఇప్పటి వరకు భూమి కౌలు అనేది కేవలం నమ్మకాల మీదనే ఉంటుంది. కాని రైతు భరోసా పొందాలంటే నమ్మకం కంటే చట్టబద్ధం ముఖ్యం కాబట్టి కౌలుదారు యజమాని నుంచి చట్టపరంగా భూమిని కౌలుకు తీసుకుని ఒప్పంద పత్రంపై ఇరువురూ సంతకాలు చేసి ఒప్పందపత్రానికి చట్టభద్రత కల్పించాలి.
- ఇందుకు సంబంధించిన విధివిధానాల కొరకు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. జూలై 15 లోపు పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని సబ్ కమిటీని ఆదేశించింది. కాబట్టి త్వరలో సబ్ కమిటీ పని మొదలు పెట్టబోతుంది.