పంటల సాగు లాభదాయకంగా ఉండాలంటే సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మంచి దిగుబడులు పొంది వచ్చిన దిగుబడులను ఆశాజనకమయిన ధరలకు అమ్ముకోగలగాలి. ఈ మూడింటిలో మార్కెట్‌ ధర అనేది రైతు చేతుల్లో ఉండదు అనే విషయం అందరికి తెలిసిందే. ఇంక మిగిలిన రెండు అంశాలు మాత్రమే రైతు చేతులలో ఉంటాయి. సాగు ఖర్చులు తగ్గించుకోవాలంటే సొంతంగా శ్రమించడముతో పాటు రసాయనిక వ్యవసాయం బదులుగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంభించినట్లయితే సాగు ఖర్చులు తగ్గుతున్నాయని అనేకమంది సేంద్రియ రైతుల అనుభవాలు చెబుతున్నాయి. పంట దిగుబడులు పెరగడము అనేది విత్తన నాణ్యత మరియు నేల సారం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నాణ్యమయిన విత్తనాలు వేసుకోవడం అనేది రైతు చేతులలో ఉంటుంది కాని నేల సారం మరియు నేల రకం రైతు చేతులలో ఉండదు. అందుబాటులో ఉన్న నేలలోనే పంటల సాగు చేపట్టవలసి ఉంటుంది. కాబట్టి మనం సాగు చేసే నేలను బట్టి సాగు చేసే పంటలను ఎంపిక చేసుకున్నట్లయితే కొంతలో కొంత ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన రైతు సురేష్‌ తన భూమిలో ధనియాల పంటను సాగు చేశారు.

సురేష్‌ది వ్యవసాయ నేపథ్యం. వారి ప్రాంతంలో శనగ పంటను ఎక్కువగా వేస్తుంటారు. అందరి రైతుల మాదిరిగానే చాలా సంవత్సరాలు పంట మార్పిడి చేయకుండా శనగ పంటను సాగు చేస్తూ రసాయన పద్ధతులు పాటిస్తూ వస్తున్నాడు. కాబట్టి తన పొలం చౌడు బారిపోయింది. దానికితోడు ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉంటాయని నిపుణులు తెలియచేయడంతో ఇలాంటి పరిస్థితులలో తన పొలంలో ధనియాల పంటను సాగు చేయడానికి సిద్ధం అయ్యాడు. అంతకుముందు రసాయనిక వ్యవసాయం చేసిన సురేష్‌ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల యొక్క ఉపయోగాలను ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా తెలుసుకుని 4 సంవత్సరాల క్రితం తన రసాయనిక వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయానికి మార్చాడు. గత రెండు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ విభాగంలో ICRPగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

దుక్కిలో PMDS పద్ధతి ప్రకారం 35 రకాల విత్తనాలను చల్లుకోవడం జరిగింది. వివిధ రకాల కారణాల వలన మొక్కలు సరిగ్గా పెరగకపోవడంతో పంట మొత్తాన్ని దున్ని మరలా 12 రకాల విత్తనాలను పచ్చిరొట్టగా వేసి పచ్చిరొట్ట పైరు రెండున్నర నుంచి మూడు అడుగులు పెరిగిన తరువాత ట్రాక్టరు సహాయంతో పచ్చిరొట్టను భూమిలో కలియదున్నాడు. పశువుల ఎరువుకు ట్రైకోడెర్మావిరిడే, సూడోమోనాస్‌, VAMలు కలిపి దుక్కిలో అందించడం జరిగింది. నేల చౌడుబారి పోవడం మరియు ఈ సంవత్సరం వర్షాలు సక్రమంగా ఉండకపోవచ్చని తెలుసుకుని ఈ పరిస్థితులలో తమ నేలకు ధనియాలు సరైన పంట అని తెలసుకుని 82 సెంట్ల భూమిలో 8 కిలోల ధనియాలు, 100 గ్రాముల పొద్దుతిరుగుడు, కిలోన్నర జొన్న, 50 ఆముదం విత్తనాలు, కొంచెం దోస, కొంచెం ఆవాలు విత్తనాలను బీజామృతంలో విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవడం జరిగింది. ధనియాలు విత్తనాలు విత్తిన 9 నుండి 11 రోజుల మధ్యలోనే మొలకలు వచ్చాయి. మొలక వచ్చిన 15 రోజులలో నీమాస్త్రం, మరలా తరువాత 10 రోజులకు జీవామృతం, తరువాత 10 రోజులకు థపర్ణి కషాయం, తరువాత బూడిద తెగులు నివారణకు ఆవుపేడ+మూత్రం+ఇంగువ ద్రావణంతో పాటు అవసరాన్ని బట్టి అగ్నాస్త్రం, థపర్ణి కషాయాలు పిచికారి చేసుకున్నాడు. వీటితో పాటు చీడపీడల ఉధృతి తగ్గటానికి గాను లింగాకర్షక బుట్టలు, పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయడంతో పాటు ఆకర్షిక పంటలుగా ఆముదం లాంటివి, సరిహద్దు పంటలుగా జొన్న పంట వేయడం జరిగింది.

చౌడుబారిపోతున్న తన భూమిని కాపాడుకుంటూ, అవశేషాలు లేని పంట దిగుబడుల కోసం సేంద్రియ వ్యవసాయం చేస్తూ నలుగురికి స్ఫూర్తినిస్తూ సాగుతున్నారు. మరిన్ని వివరాలు 9989481681కి ఫోను చేసి తెలుసుకోగలరు.

– వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌