కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచంతో పాటు మన దేశంలో కూడా అనేకమంది కరోనాతో అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారు. కరోనా బారినపడి ఆరోగ్యాలను చెడగొట్టుకున్నవారు, మరణించిన వారి విషయాలను పక్కన పెడితే చాలామంది కరోనా వలన ఉపాధి కోల్పోయారు. తాము చేస్తున్న ఉద్యోగ, వ్యాపార సమస్యల వలన ఉపాధిని కోల్పోయి వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల వైపు అడుగులు వేశారు. కరోనా సమయంలో అన్ని రంగాలు ఆగినా కాని వ్యవసాయ రంగం ఆగలేదు కాబట్టి ఎలాంటి విపత్తులు సంభవించినా కాని ఆగని రంగం వ్యవసాయం అని పరోక్షంగా అర్థం అయ్యింది. అందువలననే చాలామంది వ్యవసాయ రంగంవైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. ఇదేకోవకు చెందుతాడు నల్లగొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండలం, ఎర్ర చెరువు తండాకు చెందిన రామావతు బాలకృష్ణ.

బాలకృష్ణది వ్యవసాయ నేపథ్యం. వారి పెద్దలు వివిధ రకాల పంటలు సాగు చేస్తూ, పశువుల పెంపకం, గొర్రెల పెంపకం, కోళ్ళ పెంపకం లాంటివి కొనసాగిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. బాలకృష్ణ వ్యవసాయ రంగానికి దూరం జరిగి ఎంటెక్ పూర్తి చేసి 2015వ సంవత్సరంలో విప్రో సంస్థలో రేడియో ఫ్రీక్వెన్సీ విభాగంలో ఇంజనీరుగా ఉద్యోగం సంపాయించి అందులో కొనసాగుతున్నాడు. ఉద్యోగంలో సరైన తృప్తి లేకపోవడముతో పాటు సమయ పాలన కూడా సక్రమంగా లేకపోవడం, ఎక్కువ పని గంటలు, రాత్రి పూట కూడా పని చేయవలసిన పరిస్థితులను ఎదుర్కోలేక ఉద్యోగం నుంచి బయటపడాలని ఆలోచించే సమములో కరోనా రావడము జరిగింది. కరోనా వలన ఇంటి వద్దనే కొన్ని రోజులు గడపవలసి వచ్చింది. ఆ సమయములో సొంత పొలంలో పంటల సాగుపై శ్రద్ధ పెట్టి తన స్వయం ఉపాధిగా ఉద్యోగం కంటే వ్యవసాయమే సరైన దారి అని నిర్ణయించుకుని వ్యవసాయంలో అడుగుపెట్టాడు. తన చదువుకు న్యాయం చేకూరాలంటే తోటి రైతులకు భిన్నంగా పంటల సాగు చేయాలనే తలంపుతో సేంద్రియ సాగుపై అవగాహన తెచ్చుకొని తాను పండించే పంటలలో సేంద్రియ సాగు పద్ధతులు అమలు పరచాలని నిర్ణయం తీసుకున్నాడు. సేంద్రియ సాగులో అత్యంత ముఖ్యమైన వనరు అయినటువంటి మన దేశీయ జాతి ఆవులను వేరే వారి నుండి దానంగా పొంది వాటి వ్యర్థాలను తన పంటల సాగులో వినియోగిస్తున్నాడు. ప్రస్తుతం మూడు ఆవులు మరియు మూడు ఎద్దులు కలిపి మొత్తం 6 పశువులను బాలకృష్ణ పోషిస్తున్నాడు.

సేంద్రియ సాగులో బాలకృష్ణకి 4 సంవత్సరాల అనుభవం ఉంది. తన అనుభవంలో మిరప, ప్రత్తి, కంది, పెసర, వేరుశనగ పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో పండించాడు. ఇంకా పండిస్తూనే ఉన్నాడు. తన సేంద్రియ సాగు అనుభవంలో ఎకరానికి మిరప 12 క్వింటాళ్లు, ప్రత్తి 8 క్వింటాళ్లు, వేరుశనగ 10 క్వింటాళ్లు, పెసలు 5 క్వింటాళ్లు అధిక దిగుబడిని సాధించాడు. ఈ సంవత్సరమే కంది పంట సాగు మొదలు పెట్టారు. ప్రస్తుతం మిరప ఎకరంన్నరలో, కంది రెండు ఎకరాలలో, ప్రత్తి మూడు ఎకరాలలో సాగులో ఉంది. వీరు సాగు చేసే పంటలకు రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి గొర్ల ఎరువు, ఆవుల ఎరువు మిశ్రమానికి వివిధ రకాల జీవన ఎరువులు, జీవశిలీంద్ర నాశినులు, వేపపిండి, ఆముదపు పిండి లాంటివి కలిపి దుక్కిలో అందిస్తుంటాడు. పంట మార్పిడి తప్పనిసరిగా చేస్తుంటాడు. ఈమెళకువలతో పాటు పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తూ, ఎలాంటి విష రసాయనాలు అందించకుండా తమ పంటల సాగుని కొనసాగిస్తున్నాడు.
మిరప: ఎకరంన్నరలో మిరప పంట సాగులో ఉంది. గత నాలుగు సంవత్సరాల నుంచి మిరప పంటను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఎకరంన్నరకు గాను 9093 మరియు సూరజ్ రకాలను ఎంపిక చేసుకుని విత్తనాన్ని బీజామృతంతో విత్తన శుద్ధి చేసికుని, నారు పోయించాడు. 45 రోజులు పెరిగిన నారుని బీజామృతంలో వేర్లను ముంచి ప్రధాన పొలంలో నాటించాడు. దుక్కిలో 4 ట్రక్కుల పైన పేర్కొన్న ఎరువును అందించాడు. మొక్క నాటిన 20 రోజుల నుంచి ప్రతి 15-20 రోజులకు ఎకరానికి 200 లీటర్లకు తగ్గకుండా ద్రవజీవామృతాన్ని నేలకు అందిస్తుంటాడు. అదేవిధంగా అవకాశాన్ని బట్టి వేస్ట్డికంపోజర్ ద్రావణాన్ని కూడా పైరుకు అందిస్తుంటాడు. చీడపీడల నివారణకు వేప గింజల కషాయం, అగ్నాస్త్రం, థపర్ణి కషాయం, ఎగ్ఎమైనో యాసిడ్, ఫిస్ ఎమైనోయాసిడ్ లాంటివి ఉపయోగిస్తుంటాడు. అవసరాన్ని బట్టి మొలకల ద్రావణాన్ని కూడా సొంతంగా తయారు చేసుకొని పంటపై పిచికారి చేస్తుంటాడు. పంచగవ్యను భూమికి అందించటంతో పాటు పంటపై కూడా పిచికారి చేస్తుంటాడు. ఈ పద్ధతులు పాటిస్తూ గత సంవత్సరం ఎకరానికి 1200 కిలోల దిగుబడి సాధించి అందులో 800 కిలోల వరకు కిలో ఎండుమిరప కాయలు 350 నుంచి 400 రూపాయలు, కారం 450 నుంచి 500 రూపాయల చొప్పున సుమారు 800 కిలోల వరకు నేరుగా వినియోగదారులకు అమ్మకం చేశాడు. 400 కిలోలు కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసి అవసరమైనపుడు అమ్మకం చేస్తున్నాడు.

మిరపతో పాటు ప్రత్తి, కంది పంటలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నాడు. అవకాశం ఉంటే రబీలో పెసర మరియు వేరుశనగ పంటలను సాగు చేయాలనే ఆలోచలో ఉన్నాడు. వేరే వారు దానంగా అందించిన పశువులను పోషిస్తూ వాటి ద్వారా వచ్చిన పాలను సొంతానికి ఉపయోగించుకుంటూ వాటి వ్యర్థాలను తన పంటల సాగులో ఉపయోగిస్తున్నాడు. శారీరకంగా శ్రమిస్తూ, ఆరోగ్యకరమయిన పంటలు పండిస్తూ, తెలివిగా మార్కెటింగ్ చేసుకుంటే సేంద్రియ సాగులో ఫలితం తప్పనిసరిగా ఉంటుందని బాలకృష్ణ ప్రత్యక్షంగా నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 99127 37380 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

