కోడి గ్రుడ్లు మరియు మాంసములో నాణ్యమైన ప్రోటీన్తోపాటు మానవశారీరక విధులకు, ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు నిక్షిప్తమై ఉంటాయి. ఇంతటి పోషకాహార ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, కొన్ని నిరంతర అపోహలు చాలా మంది వినియోగదారులను తమ ఆహారంలో గ్రుడ్లు మరియు మాంసాన్ని చేర్చకుండా అడ్డుకుంటున్నాయి.
అపోహ: గ్రుడ్లు మాంసాహారము. శాఖాహారులు తినకూడదు?
వాస్తవము: కోడి గ్రుడ్లు రెండు రకాలు. ఫలధీకరణం చెందిన గ్రుడ్లు (పిండం కలిగి ఉంటాయి) మరియు వంధ్య గ్రుడ్లు (పిండము లేని గ్రుడ్లు). మార్కెట్లు, రెస్టారెంట్లు మొదలైన వాటిలో వంధ్య గ్రుడ్లు మాత్రమే వినియోగదారులకి లభిస్తాయి. ఈ గ్రుడ్లను టేబుల్ గ్రుడ్లు అని పిలుస్తారు. వీటిలో ఎటువంటి పిండము లేదా ప్రాణము ఉండదు కావున వీటిని పాలతో సమానమైన ఆహారంగా పరిగణించవచ్చు. ఫలధీకరణం చెందిన గ్రుడ్లును ప్రదానంగా పొదిగించి (హాచింగ్) కోడిపిల్లలను చేయడానికి ఉపయోగిస్తారు, ఇవి వినియోగం కోసం మార్కెట్లో అందుబాటులో ఉండవు.
అపోహ: మగ మరియు ఆడ కోళ్ళ మధ్య సంభోగం జరిగిన తర్వాత మాత్రమే గ్రుడ్లు ఉత్పత్తి చేయబడతాయి.
వాస్తవము: స్త్రీలలో మాదిరిగానే, ఓవా లేదా గ్రుడ్ల విడుదలకు కారణమయ్యే సాధారణ ఋతుచక్రాలు, కోళ్లలో కూడా లైంగిక పరిపక్వత వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా ఓవా లేదా గ్రుడ్లను ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఇదొక సహజ ప్రక్రియ దీనికి మగ కోడి యొక్క అవసరము ఉండదు. కావున మగ మరియు ఆడ కోళ్ళ మధ్య సంభోగం తో సంబంధం లేకుండా కోళ్ళు గ్రుడ్లను ఉత్పత్తి చేస్తాయి.
అపోహ: ప్లాస్టిక్ గ్రుడ్లు మార్కెట్లో ఉన్నాయి మరియు అవి మానవ ఆరోగ్యానికి హాని చేస్తాయి.
వాస్తవము: సాధారణంగా వేసవి కాలంలో కోళ్ళు దాణా తీసుకోవడం తగ్గిస్తాయి (సుమారు రోజుకు 110 గ్రాముల నుండి 70 గ్రాములకు) కావున కోడి గ్రుడ్డు లోని పెంకు తయారీకి కావాల్సిన కాల్షియమ్ తగినంత మోతాదులో లభించదు. వేసవి ఒత్తిడి వలన గుడ్డు పెంకు తయారీలో కీలక పాత్ర వహించే బైకార్బొనేట్ ఆయాన్లను కూడా కోడి తన శరీరం నుండి కోల్పోతుంది, అందువలన వేసవి కాలం లో గ్రుడ్ల యొక్క పెంకు భాగము బలహీనంగా మరియు పల్చగా ఉండి గ్రుడ్లకు సాగే గుణాన్ని కలిగి త్వరగా పాడవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ సాగే గుణం వలన అనేకమంది వీటిని ప్లాస్టిక్ గ్రుడ్లు అని అపోహపడుతున్నారు కానీ వాస్తవానికి ఒక ప్లాస్టిక్ గ్రుడ్డు తయారీకి అయ్యే ఖర్చు, ఒక కోడి సాధారణంగా గ్రుడ్లు పెట్టడానికి అయ్యే ఖర్చు కంటే చాలా ఎక్కువ. అంతే కాకుండా సహజ గ్రుడ్డుతో సమానమైన కూర్పు కలిగిన నకిలీ గ్రుడ్లను తయారు చేయగలిగే నైపుణ్యత, దానికి కావలిసిన సమర్ధత లేవనటంలో ఎలాంటి సందేహమూ లేదు.
కావున, పైన తెలిపిన గ్రుడ్లు మరియు మాంసం గ్రురించి శాస్త్రీయ-ఆధారిత సత్యాలను గుర్తించి పాడి పశువుల నుండి లభించే పాల మాదిరిగానే, మార్కెట్లో లభించే కోడి గ్రుడ్లు (వంధ్య గ్రుడ్లు) కూడా శాఖాహారమే అన్న విషయాన్ని మనందరం గుర్తించి మన సమతుల ఆహారంలో అంతర్భాగంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా కొన్ని రకాల వ్యాధులు కోడి మాంసము మరియు గ్రుడ్లను తినడం వలన వ్యాపిస్తాయనే అపోహలకు తావివ్వకుండా అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడకబెట్టిన గ్రుడ్లను మరియు మాంసాన్ని ఆహారంలో చేర్చడం ద్వారా శరీర వృద్ధికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, మరియు ఆరోగ్యకరమైన కొవ్వుల సంపదను పొందవచ్చు.
అపోహ: మాంసపు కోళ్ళు (బ్రాయిలర్ కోళ్ళు) వేగంగా పెరగడం కోసం కోళ్లకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇవ్వబడతాయి, ఇది మానవ వినియోగానికి మంచిది కాదు.
వాస్తవము: వేగంగా పెరిగి అధిక మాంస ఉత్పత్తి చేసే బ్రాయిలర్ కోళ్ళ రకాలను అభివృద్ధిచేయడం కోసం గత 2 నుండి 3 థాబ్దాలుగా జంతుజన్యుశాస్త్రం మరియు పోషణలో కొనసాగించిన చాలా పరిశోధనలు విజయవంతమైనవి. సమతుల్య పెంపకం మరియు స్థిరమైన జన్యు పురోగతితో పాటు మేలైన యాజమాన్య పద్దతుల ద్వారా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాయిలర్ కోళ్ల రకాలు కేవలం 38-40 రోజుల వ్యవధిలో 2.5 కిలోల వరకు పెరుగుతున్నాయి. అంతేకాని, వేగంగా పెరగడానికి ఎటువంటి స్టెరాయిడ్లు లేదా గ్రోత్ హార్మోన్లు అవసరం లేదు, పైగా స్టెరాయిడ్ హార్మోన్ల వాడకం వల్ల రాబడి కంటే ఉత్పత్తి ఖర్చు ఎక్కువ అని శాస్త్రీయ పరిశోధనల ద్వారా నిరూపించబడినది. కాబట్టి, మెరుగైన ఉత్పత్తి కోసం హార్మోన్లను ఉపయోగించడం ఆర్థికంగా కూడా కోళ్ళ రైతులకు సాధ్యం కాని పని.
అపోహ: కోడి గ్రుడ్లు మరియు మాంసం తినడం వల్ల కరోనా, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు మనుషులకు వ్యాపిస్తాయి
వాస్తవము: మనదేశంలో, ఏ పక్షి కూడా కరోనావైరస్ బారిన పడినట్లు కనుగొనబడలేదు, అలాగే కోడి మాంసము లేదా గ్రుడ్డు ద్వారా కరోనావైరస్ లేదా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుంది అని అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. మన భారతీయ ఆహారపు అలవాట్లలో భాగంగా అధిక ఉష్ణోగ్రతలో ఉడకబెట్టిన/బాగావండిన కోడి మాంసము తీసుకోవడం జరుగుతుంది. ఈ అధిక ఉష్ణోగ్రతలో చాలా వ్యాధికారక క్రిములు మనుగడ సాగించలేవు. అంతేకాక మన దేశపు వంటకాల్లో మెరుగైన యాంటీమైక్రోబయల్, యాంటీ-ఆక్సిడేటివ్ గుణాలు కలిగిన అల్లం, వెల్లుల్లి, పసుపు మొదలైనవి వాడటం వలన క్రిమి రహిత ఆహారాన్ని (కోడి మరియు గ్రుడ్లు) తినడానికి వీలు పడుతుంది.
డా|| ఎన్. దీపక్, సహాయ ఆచార్యులు, కోళ్ళ శాస్త్ర విభాగము
డా|| వి. తేజస్విని, సహాయ ఆచార్యులు, పశు జన్యు శాస్త్ర విభాగము, శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయము, తిరుపతి.

