మనిషి జీవించాలి అంటే గాలి, నీరు, ఆహారం తప్పనిసరి. గాలి లేకుంటే కొన్ని నిమిషాలలో, నీరు లేకుంటే కొన్ని రోజులలో, ఆహారం లేకుంటే కొన్ని వారాలలో మనిషి జీవితం ముగుస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అంటే ఇవి మూడూ కూడా మనిషి జీవించాలి అంటే అత్యవసరాలు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కాని ప్రస్తుత పరిస్థితులలో మనిషి జీవించాలి అంటే ఈ మూడు కాకుండా ఇంకొకరి అవసరం తప్పనిసరి అని ప్రస్తుత సమాజాన్ని చూస్తే అర్థం అవుతుంది. అతనే డాక్టర్/వైద్యుడు. అంటే ప్రస్తుత సమాజంలో ఆరోగ్యంగా జీవించాలి అంటే డాక్టర్ అవసరం తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టే మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే గాలి, నీరు, ఆహారంతో పాటు డాక్టరు అవసరం తప్పనిసరి అవుతుంది. కానీ గతాన్ని బాగా పరిశీలించినట్లయితే కొంత మంది వారి జీవితకాలం మొత్తం డాక్టరు అవసరం లేకుండానే జీవించారనే విషయం తెలుసుకోవచ్చు. ఆవిధంగా డాక్టరు అవసరం లేకుండా ప్రస్తుత పరిస్థితులలో జీవించవచ్చా? అనే ప్రశ్నకు మన జీవన శైలిని మార్చుకుంటే తప్పనిసరిగా డాక్టరు అవసరం లేకుండా జీవితాన్ని కొనసాగించవచ్చు అని అంటున్నాడు నారాయణపేట జిల్లా, నారాయణపేటకు చెందిన డాక్టర్ జయచంద్ర మోహన్.

జయచంద్ర మోహన్ మరియు వీరి అర్థాంగి పద్మకళ ఇద్దరూ కూడా వైద్యంలో ఉన్నత చదువులు చదివారు. వీరిది వ్యవసాయ నేపథ్యానికి సంబంధించిన కుటుంబం కాదు. వైద్యంలో ఉన్నత చదువులు చదివిన వారు అందుకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి కొనసాగిస్తున్న సమయములో ప్రకృతి జీవన విధానం గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే తలంపుతో 2014వ సంవత్సరంలో పిడుగురాళ్ళలోని కీ||శే|| కుదరవల్లి విశ్వేశ్వరరావు గారి ప్రకృతి ఆశ్రమంలో 60 రోజులు గడపడం జరిగింది. ఆ సమయంలో విశ్వేశ్వరరావు గారి వయస్సు 94 సంవత్సరాలు. ఆ వయస్సులో కూడా వారికి చూపు తగ్గకపోవడం, వినికిడి లోపం లేకపోవడం అతి సమీపము నుంచి గమనించిన వీరు మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే ప్రకృతికి దగ్గరగా జీవితాన్ని కొనసాగిస్తూ, ప్రకృతికి అనుకూలమైన జీవనశైలిని అలవర్చుకోవడమే సరైన మార్గం అని తెలుసుకుని తాము తమ వృత్తిని కొనసాగిస్తూనే ప్రకృతి అనుకూలమైన ఆహారాన్ని తింటూ ప్రకృతికి దగ్గరగా జీవించటానికి అవసరమైన అవకాశాలవైపు అడుగులు వేశారు.

తాము మాత్రమే ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, తమ దగ్గరకు వచ్చే రోగులకు కూడా ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి తెలియ చేయాలి. అవకాశం ఉంటే ప్రత్యక్షంగా చూపించాలి అని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పద్మకళ తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదలి, జయచంద్ర మోహన్ తన ఉద్యోగాన్ని కొనసాగిస్తూ నారాయణపేట్‌లో ఒక ఆసుపత్రిని నిర్మించుకుని పద్మకళ తన పూర్తి సమయాన్ని, జయచంద్ర మోహన్ తన ఖాళీ సమయాన్ని హాస్పిటల్ విధులకు కేటాయిస్తూ తమ వద్దకు వచ్చిన రోగులకు కూడా తప్పని పరిస్థితులలో మాత్రమే మందులను సిఫారసు చేస్తూ సాధ్యమయినంతవరకు జీవన శైలిని మార్చుకోమని సలహాలిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే ఎలాంటి రసాయనాలు లేని, మనకు హాని చేయని ఆహారాలను తినడముతో పాటు శారీరక శ్రమ తప్పనిసరిగా చేయాలి. ఈ రెండింటికి సరైన దారి వ్యవసాయమే, అదీను సేంద్రియ సాగే సరైన దారి అని గ్రహించి వ్యవసాయంలో ఎలాంటి అనుభవం లేకపోయినా కానీ ఆర్థికంగా ఇబ్బందులు లేవు కాబట్టి తాము ఆరోగ్యకరమన జీవన శైలిని పాటిస్తూ తోటి వారికి ప్రత్యక్షంగా చూపించాలనే లక్ష్యంతో నారాయణపేట సమీపంలో 2014వ సంవత్సరములో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సేంద్రియ సాగుని మొదలు పెట్టారు. ఆ తరువాత అదే ప్రాంతంలో ఇంకో 23 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందులో కూడా పంటల సాగుని కొనసాగిస్తున్నారు.
వరి: వ్యవసాయంలో దిగినప్పటి నుంచి వరిని సాగు చేస్తూ వస్తున్నారు. ఆధునిక వరి రకాలను కాకుండా మన పురాతన వరి రకాలను మాత్రమే సాగు చేస్తున్నారు. తమకు ఉన్న వరి సాగు అనుభవంలో ఎక్కువగా ఎకరానికి 22 బస్తాల వరకు దిగుబడి పొందారు. వచ్చిన వడ్లను అదేవిధంగా అమ్మకుండా వాటికి విలువ జోడించి బియ్యంగా మార్చి తాము సొంతానికి వినియోగిస్తూ మిగతా బియ్యాన్ని అమ్మకం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మైసూర్ మల్లిక వరి రకం నారు థలో ఉంది. వీరు సాగు చేసే వరికి తప్పనిసరిగా బీజామృతంతో విత్తనశుద్ధి చేయడంతో పాటు దుక్కిలో తప్పనిసరిగా ఘనజీవామృతం మరియు గోబర్ గ్యాస్ స్లర్రిని అందిస్తుంటారు. 25 నుంచి 30 రోజులు వయస్సు పెరిగిన నారుని ప్రధాన పొలంలో నాటిస్తుంటారు. కలుపు నివారణకు వీడరును ఉపయోగిస్తుంటారు. పై పాటుగా క్రమం తప్పకుండా జీవామృతం, గో-కృపామృతాలను భూమికి అందించడంతో పాటు అవసరమైతే పంటపై పిచికారి చేస్తుంటారు. వీరు సాగు చేసే వరి పైరులో చీడపీడల ప్రభావం పెద్దగా కనిపించడము లేదు. కాబట్టి చీడపీడల నివారణకు ఏలాంటి నివారణ చర్యల అవసరం పడటము లేదు. పురాతన వరి రకాలను సాగు చేస్తున్నారు కాబట్టి అవి బాగా ఎత్తు పెరుగుతున్నాయి. అయినా కానీ గాలులకు, వర్షాలకు పడిపోవడము లేదు. పశువులకు ఎండు పశుగ్రాసం కూడా ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది.

పశుగ్రాసాలు: సేంద్రియ సాగుకు అతిముఖ్య వనరు అయినటువంటి మన దేశీయ ఆవులను 30 వరకు పోషిస్తున్నారు. వీటికి అవసరమైన పశుగ్రాసాల కొరకు పలు రకాల పశుగ్రాసాలను పెంపకం చేస్తున్నారు. సూపర్ నేపియర్, రెడ్ నేపియర్, హీరామణి లాంటి బహువార్షిక గడ్డిజాతి పశుగ్రాసాలతో పాటు థరథగడ్డి, అవిశ, సుబాబుల్ లాంటి బహువార్షిక పప్పుజాతి పశుగ్రాసాలను కూడా సాగు చేస్తూ ఆవులకు పచ్చిమేతగా అందిస్తున్నారు. పచ్చి మేతలతో పాటు ఎండుగడ్డి, అజొల్లా మరియు దాణాలను కూడా ఆవులకు అందిస్తున్నారు.

గోబర్గ్యాసు: ఆవుల ద్వారా వచ్చిన కొంత పేడతో గోబర్ గ్యాసును ఉత్పత్తి చేస్తున్నారు. సుమారు12,000/-ల ఖర్చుతో గోబర్ గ్యాసు యూనిట్‌ను ఏర్పాటు చేసుకుని తమ పొలంలో పనిచేసే వారి వంట అవసరాలకు గోబర్ గ్యాస్‌ను ఉపయోగిస్తున్నారు. గోబర్ గ్యాస్ తీసిన తరువాత స్లర్రీలో మిథేన్ వాయువు ఉండదు కాబట్టి ఈ స్లర్రీ పంటల సాగుకు బాగా ఉపయోగపడుతుందని గ్రహించి ఆ స్లర్రీని ఒక పిట్లోకి పంపించి అందులో ఎండిన ఆకులను, వ్యవసాయ వ్యర్థాలను వేసి బాగా కుళ్ళిన తరువాత పంటల సాగులో వినియోగిస్తున్నారు.

అజొల్లా: అజొల్లాలో అనేక పోషకాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అజొల్లాను పశువులకు దాణాగా అందించడముతో పాటు వరిలో అజొల్లాను పెంచినట్లయితే వరిలో కలుపు సమస్య తగ్గడముతో పాటు వరి పంటకు నత్రజని అందుబాటులోకి వస్తుంది కాబట్టి కొంత మొత్తంలో అజొల్లాను పెంచుతూ రెండింటికి వినియోగిస్తున్నారు.

నీటి నిర్వహణ: పంటల సాగులో నీటి నిర్వహణ అతి ముఖ్యం కాబట్టి తన పొలంలో పడిన వర్షం నీటిని బయటకి పోకుండా భూమిలో ఇంకేలా కందకాలు తవ్వించి ఆ కట్టలపై కొబ్బరి, టేకు లాంటి మొక్కలు నాటించారు. వీరి పొలంలో సుమారు 200 సంవత్సరాల పురాతన బావి ఉంది. ఆ బావిని శుభ్రం చేసి అందులో అందుబాటులోకి వచ్చిన నీటిని పంటల సాగులో వినియోగిస్తున్నారు. బావితో పాటు రెండు బోర్లు కూడా ఉన్నాయి. బావిలో కొన్ని చేపలను పెంచుతూ సొంతానికి ఉపయోగించడంతో పాటు మిగిలినవి అమ్మకం చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. వేసవి కాలంలో కుటుంబ సభ్యులు మరియు సందర్శకులు ఈత కొరకు కూడా ఈబావిని ఉపయోగిస్తున్నారు.

కట్టెగానుగ: ప్రస్తుతం మనం ఉపయోగించే నూనెలలో చాలా వరకు వివిధ రకాల పద్ధతులతో తయారు చేస్తున్నవి కాబట్టి అవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆరోగ్యానికి హానికలిగించని నూనెలు పొందటానికి సరైన దారి ఎద్దుగానుగ అని భావించిన జయచంద్రమోహన్ తన పొలంలో ఎద్దుగానుగను కూడా ఏర్పాటు చేశాడు. ఇందులో కోల్డ్ప్రాసెస్ పద్ధతిలో నూనెను తయారు చేయవచ్చు కాబట్టి ఈ నూనెలు ఆరోగ్యానికి హాని చేయవు అంటున్నాడు డా. జయచంద్రమోహన్. అంతేకాకుండా పంట ఉత్పత్తులను అదేవిధంగా అమ్మకుండా విలువ జోడించి అమ్మగలిగితే రైతులకు అధిక లాభం వస్తుంది. ఈ విషయాన్ని కూడా తోటి రైతులకు తెలియ చేయాలనే లక్ష్యంతో కట్టెగానుగను ఏర్పాటు చేశారు.

వృత్తిరీత్యా డాక్టరు అయ్యుండి ప్రజలు డాక్టరు అవసరం లేకుండా జీవించడానికి అవసరమైన జీవనశైలి మరియు పద్ధతులను ప్రత్యక్షంగా చూపించడమే లక్ష్యంగా డా|| జయచంద్రమోహన్, పద్మకళ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు 93965 84805కి ఫోను చేసి తెలుసుకోగలరు.
ఫ్రూట్ ఫారెస్ట్:

వివిధ రకాల పండ్ల మొక్కలతో ఫ్రూట్ ఫారెస్ట్ సాగు చేస్తున్నారు. ఈ ఫారెస్ట్‌లో జామ, మామిడి, సీతాఫలం, అరటి, బొప్పాయి, సపోటా, ఫ్యాషన్ ఫ్రూట్ మొదలగు పండ్ల మొక్కలతో పాటు మునగ, లెమన్ గ్రాస్ లాంటివి కూడా పెంపకం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా పంటల సాగు క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. కాబట్టి కుటుంబ సభ్యులు వచ్చిన సందర్భంలో తినటానికి పండ్లు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఫ్రూట్ ఫారెస్ట్‌ని ఏర్పాటు చేశారు కాబట్టి సంవత్సరం పొడవునా అంటే 365 రోజులు ఏదో ఒక పండు అందుబాటులో ఉండేలా పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు.
– డి. ప్రసాద్, రైతునేస్తం ప్రత్యేక ప్రతినిధి

