పట్టణ ప్రాంత ఆవాసాలలో పోషక పదార్థాలనిచ్చే కూరగాయల పెంపకం ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ కలుషిత ప్రపంచంలో విషాహారం తింటూ ఆరోగ్యం గురించి ఆలోచించడం అత్యవసరమే. విటమిన్లు, ఖనిజలవణాలు, పీచు, పిండిపదార్ధాలున్న కూరగాయలు సగటున మనిషికి రోజుకు 300 గ్రాములు మరియు పండ్లు 92గా, ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ 300 గ్రాములు కూరగాయలలో 125గ్రా, ఆకుకూరలు – 100గ్రా., వేరుతో కూడిన కూరగాయలు- 75 గ్రా, ఇతర కూరగాయలను తీసుకోవాలి. కాని తీసుకుంటున్నది …… పండ్లు 92గ్రా, ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కాని తీసుకుంటున్నది చాలా తక్కువగా ఉంది. ఇది ఆహార, ఆరోగ్య భద్రతకు సవాలుగా మారింది. ఈ నేపధ్యంలో పెరుగుతున్న జనాభాను, పోషకాహార లోపాన్ని, పట్టణాల్లో స్థలాభావాన్ని మరియు కూరగాయల ధరలను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన తాజా కూరగాయల్ని, ఆకుకూరల్ని, పండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటి పంట దివ్యవరం. ఇంటి పరిసరాలలో, డాబాపైన సేంద్రీయ పద్ధతిలో ఎలాంటి రసాయన ఎరువులు, సస్యరక్షణ మందులు, కలుపునాశినులు వాడకుండా కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల, పూలపంటలను పెంచుకుంటే విషతుల్యం కాని తాజా ఆహారాన్ని కొంతవరకు పొందవచ్చు.
పెరటితోటల పెంపకం

మొక్కల పెంపకం ఆరోగ్యకరమైన అలవాటు. ఈ పనిలో నిమగ్నమయినప్పుడు మనస్సుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మొదట్లో కొంచెం శ్రమపడితే, పిన్న వయస్కులకు, పెద్దలకు కూడా అర్ధవంతమైన అలవాటుగా.. మారుతుంది. గట్టిగా ప్రయత్నిస్తే అన్నీ ఇంట్లోనే సమకూరుతాయి. పెరటితోటల పెంపకం, డాబాపై మొక్కల పెంపకం వలన పల్లెల నుండి పట్టణాలకు వలస వచ్చిన జనాభాకు సరిపడే పండ్లు, కూరగాయలు పెంచవచ్చు.
పట్టణప్రాంత అవసరాలకు కుండీలలో కూరగాయల సాగు

పట్టణ ప్రాంతాలలో, జనాభా పెరుగుదలతో ఎక్కువ భూమి ఇంటి నిర్మాణానికి వినియోగించబడుతుంది. అందువలన కూరగాయలను పెంచడానికి భూమి దొరకదు. ప్రత్యేకంగా కుండీలను, కంటైనర్లను ఉపయోగించి పండ్ల మొక్కలను, కూరగాయలను మన ఇంటి ఖాళీస్థలంలో లేదా డాబాపై పెంచుకోవడం ఒక్కటే మార్గం. నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడే కూరగాయలను పండించడానికి 40-50 చ.మీ స్థలం కావాలి. కంటైనర్లలో మట్టిని సంవత్సరానికొకసారి మార్చాలి. పాంటింగ్ మిశ్రమంలో మట్టి, ఇసుక, వేపపిండి, జీవన ఎరువులు సమపాళ్ళలో ఉండాలి. మట్టిలో ఉదజని సూచిక 6-7.5 మధ్య ఉండాలి.
ఇంటి తోటల మొక్కల పెంపకము వల్ల లాభాలు

ఇంటి తోటల మొక్కల పెంపకం ద్వారా ఏడాది పొడవునా విష అవశేషాలులేని తాజా ఉత్పత్తులు లభిస్తాయి. -ఆహార, ఆరోగ్య భద్రత, శుభ్రత పొందవచ్చు. పచ్చదనాన్ని పెంపొందించడంతో ప్రాణవాయువు పెరిగి, గాలిలో హానికర బొగ్గుపులుసు వాయువు తగ్గుతుంది. ఉత్పత్తులు నాణ్యంగా పోషకాలతో నిండి ఉంటాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఇంటి వంట వలన మంచి వ్యాయామం లభిస్తుంది. మన విత్తనాన్ని మనమే ఉత్పత్తి చేసుకొని బయటకు పోయే పని ఉండదు. మనసుకు ఉల్లాసంగా ఉండే ఈ పనిని రోజు చేయవచ్చు. పండ్లు, కూరగాయల ఖర్చు తగ్గుతుంది.
వార్షిక కూరగాయల, పండ్ల మొక్కల పెంపకంపై ప్రణాళిక

మొక్కలు పెంపకం చేపట్టే ముందు ప్రణాళిక తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ డాబాపై పెంచుతున్నదైతే ముందుగా ఇంజనీరు చేత డాబా పైకప్పు గట్టిదనాన్ని పరీక్షింపజేయాలి. అంటే మన ప్రణాళిక ప్రకారం కూరగాయలు, పండ్లు మొదలైనవి పెంచడానికి తట్టుకోగలదో లేదో పరీక్షించాలి. పైకప్పు కారకుండా ఉండాలి. మురుగు నీటి పారుదల సౌకర్యం తప్పని సరిగా ఉండాలి. ప్రణాళికబద్ధంగా మొక్కలను నాటాలి. కుండీల్లో నింపే మిశ్రమం తేలికపాటి బరువు కలిగి ఉండాలి. మొక్కలను పెంచడానికి ఎత్తైన మడులను ఏర్పాటు చేయాలి. ట్రెల్లీస్ ఏర్పాటుచేసి తీగలు పాకించాలి. దాబాలపైన, బాల్కానీలలోను పెరిగే మొక్కలు ఎక్కువ గాలికి, ఎక్కువ వేడికి గురవుతాయి. ఎత్తైన మడులు, ఎత్తులో అమర్చిన కుండీలు ఒకే వరుసలో ఉండాలి. వీటిని తేలికపాటి మట్టి మిశ్రమంతో నింపాలి. మట్టి మిశ్రమంతో నింపక ముందు సరైన మురుగునీటి పారుదల సౌకర్యం ఏర్పాటుచేయాలి. షేడ్నెట్గాని, పందిరికాని ఏర్పాటుచేసుకొని ఏడాది పొడవునా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పూలను కూడా పెంచుకోవచ్చు. ముందుగా తక్కువ ఖర్చుతో మొదలుపెట్టి అనుభవం గడించిన తర్వాత ఎక్కువ మొక్కలను ఎక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు.
అనువైన కూరగాయలు, పండ్ల జాతులు

ఆకుకూరలు: పాలకూర, మెంతికూర, కొత్తిమీర, గోంగూర, తోటకూర, పుదీన, చుక్కకూర, బచ్చలి మొదలైనవి..
దుంప కూరగాయలు: ముల్లంగి, క్యారెట్, ఉల్లి, ఆలుగడ్డ, అల్లం, బీట్రూట్ మొదలైనవి.
శీతాకాలపు కూరగాయలు: కాలిఫ్లవర్, క్యాబేజి, నూల్ కోల్, కాయకూరలు: టమాట, వంగ, బెండ, కూర మిరప, గోరుచిక్కుడు మొదలైనవి.
పండ్ల రకాలు: నిమ్మ, దానిమ్మ, అరటి, అత్తి, సపోట, జామ, ఉసిరి, మామిడి మొదలైనవి.
కె. మానస, యం.యస్.సి (హార్టికల్చర్), వెజిటేబుల్ సైన్స్ డిపార్ట్మెంట్, డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా.

