పంట కోతానంతరం పండ్లు, కూరగాయలను ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే కోత పద్ధతుల ప్రాముఖ్యత చాలా ఉంటుంది. పంట పక్వతను అర్థం చేసుకోవాలి. పంటను కోసే విధానం మీద కూడా పంట నిల్వ సామర్థ్యం, నాణ్యత ఆధారపడి ఉంటుంది. పంటను సరైన సమయంలో వాటి పక్వథను సరిగా అర్థం చేసుకోవడం మీద దృష్టిసారిస్తే అధిక మొత్తంలో పంట ఉత్పత్తులను అమ్ముకునే అవకాశాన్ని కల్పించుకున్న వారవుతారు. సాధారణంగా పక్వత అనేది పండ్లు, కూరగాయలు, ఇతర ధాన్యాలను వినియోగదారుడు ప్రత్యక్షంగా ఉపయోగించగలిగే స్థితికి లేదా ఏదైనా ప్రాసెసింగ్ ఉత్పత్తుల తయారీకి కావాల్సిన పక్వథకు పంట చేరుకోవడం. పంటను బట్టి ఇవి రెండు ఒకే థలో లేదా వేరువేరు థల్లో చేయవచ్చు.
పక్వత సూచిక ఆధారంగా కోతలు
పక్వత సూచిక అంటే ఏదైనా పంట దాని పక్వ థకు చేరుకుందా లేదా అని తెలిపేది. సాధారణంగా రైతులు కొన్నిఅంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని పంట పక్వతను నిర్ధారించుకొని కోతలు కోస్తారు. తద్వారా పంటను మార్కెట్‌లో గ్రేడింగ్ చేయడం ద్వారా సరైన పక్వథలో లేని పండ్లు, కూరగాయలు అతి తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, పక్వానికి ముందుగానే లేదా చాలా ఆలస్యంగా కోస్తే పంటకోత తర్వాత వ్యాధుల బారిన పడతాయి. సరైన సమయంలో పండ్లను కోసుకుంటే హానికరమైన రసాయన మందులతో పండ్లను పండించే పరిస్థితులు కూడా ఏర్పడవు. తద్వారా ప్రజల ఆరోగ్యాలకు ఎలాంటి ముప్పు సంభవించకుండా నివారించవచ్చు. పక్వత సూచికలు నిర్ధారించే అంశాలను ప్రధానంగా క్యాలెండరు తేదిని బట్టి లేదా పూత లేదా పిందె కాసినప్పటి నుంచి రోజుల లెక్కింపును బట్టి భౌతిక, రసాయన పరీక్షలపై ఆధారపడి నిర్ణయిస్తారు.
పక్వతను నిర్ధారించే అంశాలు:
- పంట పూత థ నుంచి రోజుల లెక్కింపు ఉదా: ఆపిల్, మామిడి, బత్తాయి, నారింజ, నిమ్మ.
- పిందె కాసినప్పటి నుంచి రోజుల లెక్కింపు ఉదా: అరటి, మామిడి
- పండు గట్టిదనం ఆధారంగా ఉదా: ఆపిల్, కర్బూజ మొదలైనవి.
- పిండి పదార్థాల శాతం ఆధారంగా ఉదా: అరటి, ఆపిల్
- పండ్లలోని రసం శాతం ఆధారంగా ఉదా: బత్తాయి, నారింజ, నిమ్మ
- పండ్లలోని ఆమ్లశాతం లేదా చక్కెర, ఆమ్ల నిష్పత్తి ఉదా: బత్తాయి, నారింజ, నిమ్మ, పైనాపిల్
- చక్కెర శాతం ఆధారంగా ఉదా: పుచ్చకాయ, కర్బూజ, ద్రాక్ష
- పండు లోపలి రంగు, నిర్మాణ క్రమం ఉదా: పుచ్చకాయ, కర్బూజ
- పండు దృఢత్వం
- కాడ లేదా తీగ నుంచి కాయ వదులుకొనేలా తయారవ్వడం ఆధారంగా ఉదా: కర్బూజ
రైతులు మరిన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని వారికి కావాల్సిన పక్వత సూచిక ప్రకారం పండ్లు, కూరగాయలను కోస్తే మరింత ఆదాయం చేకూరుతుంది. పండ్లు, కూరగాయలను ఉపయోగించే వివిధ రకాల అవసరాల దృష్ట్యా వాటి పక్వత సూచికలను శారీరక, వాణిజ్య, కోతకు అనువైన పక్వతలుగా నిర్ణయిస్తారు.
పండ్ల శారీరక పక్వత: చెట్టుకు ఉన్న కాయ సహజసిద్ధంగా చెందాల్సిన అభివృద్ధి లేదా ఎదుగుదలను చెట్టుమీదనే పూర్తిగా ముగించుకుని ఒక నిర్ధిష్ట పక్వథకు చేరుకుంటుంది. తదుపరి కాయ చెట్టు నుంచి వేరు చేసిన తర్వాత కూడా ఈ కాయ చెట్టు మీదనే ఉన్న తీరులో పక్వతకు చేరుకుని దాని పక్వ ప్రక్రియను కొనసాగిస్తుంది. ఈ థలో పండును చెట్టు నుంచి వేరు చేసిన కావాల్సిన కనీస నాణ్యతలో పండు ఉపయోగపడుతుంది.
వాణిజ్య పక్వత: ఇది కాయ ఏదైనా అభివృద్ధి థ కావచ్చు. ఈ థలో పండును కోయడం జరుగుతుంది. ఈ థను వినియోగదారుని వాణిజ్య, ఇతర ప్రాసెసింగ్ అవసరాలకు అనుగుణంగా నిర్ణయిస్తారు. అనగా పండ్లను కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కోయవచ్చు లేదా బాగా మగ్గిన తర్వాత కూడా కోయవచ్చు. అది దానిని ఉపయోగించే విధానం మీద ఆధారపడుతుంది.
కోతకు అనువైన పక్వత: కాయ లేదా పండు సరైన అభివృద్ధి థలో వినియోగదారుని దగ్గరకు తీసుకొచ్చే విధంగా నిర్ణయిస్తారు. ఈ థలో పండ్లు సరైన పక్వథలో తినడానికి, ఇతర అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ సూచికలను రైతు ఏ అవసరం కోసం ఉపయోగిస్తున్నారనేది దృష్టిలో పెట్టుకొని కోసుకోవాల్సి ఉంటుంది.
పండ్ల తోటల్లో పక్వత: కొన్ని రకాల పండ్లు చెట్టు నుంచి వేరుచేశాక మరికొన్ని వేరుచేయకముందు వాటి పక్వతను కొనసాగిస్తాయి. మొక్క లేదా చెట్టు నుంచి కాయలు వేరు చేసిన తర్వాత కూడా దాని పక్వత కొనసాగే ఆపిల్, మామిడి, అరటి, బొప్పాయి, జామ, సపోటా మొదలైన వాటిని కొంచెం దృఢంగా ఉన్నప్పుడే రైతులు కోసుకొని రవాణా చేసుకోవాలి. తర్వాత సహజ పద్ధతుల్లో పండ్లను పక్వానికి పెట్టుకోవచ్చు. చెట్టు నుంచి కాయను వేరుచేసిన తర్వాత కాయలు పండటం ఆగిపోయే దానిమ్మ, పుచ్చ, ద్రాక్ష, నిమ్మ, బత్తాయి, నారింజ, పైనాపిల్ మొదలైన పండ్లను తప్పనిసరిగా చెట్టుకు ఉన్నప్పుడే మగ్గనిచ్చి లేదా పూర్తిగా వృద్ధి చెందనిచ్చిన తర్వాత కోయాలి. అరటి, మామిడి, బొప్పాయి, సపోట, జామ, దానిమ్మ, నిమ్మ, పుచ్చకాయ మొదలైనవి అధికంగా తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. వాటి పక్వథలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
మామిడి: సహజ సిద్ధంగా మామిడి చెట్టు నుంచి కాయలు రాలిపడుతుంటే పక్వథగా గుర్తించి రైతులు కాయలు కోస్తారు. దీనికి ఇంకా కొన్ని శాస్త్రీయ పద్ధతులు కూడా ఉన్నాయి.
మామిడి కాయ ఉపరితలం రంగు ముదురు ఆకుపచ్చ నుంచి లేత ఆకుపచ్చకు మారడం, లోపలి కండ భాగం గోధుమ తెలుపు వర్ణంలోకి మారడం, దాని రూపంలో లేదా ఆకృతిలో వృద్ధి, సాపేక్ష సాంద్రత 1 నుంచి 1.02 గా ఉండాలి. దీనిని పరీక్షించాలంటే ఒక బకెట్టులో నీళ్ళు తీసుకొని అందులో మామిడి పండ్లు వేయాలి. మునిగిన వాటిని పక్వథకు వచ్చినవిగా గుర్తించాలి. తేలినవి ఇంకా వృద్ధి చెందాల్సి ఉన్నట్లు గుర్తించాలి. కాయ గట్టిదనం 12 కి./చ.సెం.మీ. కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మొత్తం కరిగి ఉన్న ఘనపదార్థాల శాతం (టి.ఎస్.ఎస్) 8 నుంచి 11 శాతంగా ఉన్నప్పుడు, మామిడి పిందెలు కాసినప్పటి నుంచి 12 లేదా 16 వారాల సమయంలో పక్వథకు చేరుకుంటుందని గుర్తించాలి.

నిమ్మలో: సహజంగా నిమ్మ పిందె కాసినప్పటి నుంచి 165-195 రోజులకు పక్వథకు చేరుకుంటుంది. నిమ్మకాయల కోతకు ప్రధానంగా రంగు, పరిమాణం గమనిస్తారు. కాయరంగు ఆకుపచ్చ నుంచి పసుపు పచ్చకు మారే సమయంలో కోసుకోవచ్చు. కాయ పరిమాణం 5 సెం.మీ. వ్యాసం తగ్గకుండా చూసుకోవాలి. దీని కోసం ఏదైనా ఇనుప లేదా అల్యూమినియం తీగను 5 సెం.మీ. వ్యాసంతో గుండ్రంగా తయారు చేసుకొని నిమ్మ పండును ఆ పరిమాణంకు సరిగా వృద్ధి చెందిందా లేదా అని పరీక్షించుకోవచ్చు. కాయలో 28%, ఆపైన రసం ఉన్నప్పుడు, ఆమ్ల శాతం 9గా ఉన్నప్పుడు సరైన పక్వథగా గుర్తించాలి.

జామ: జామకాయ రంగు ముదురు ఆకుపచ్చ నుంచి లేత ఆకుపచ్చ రంగుకు మారుతుంది. సాపేక్ష సాంద్రత 1గా ఉండాలి. పూత పూసినప్పటి నుంచి 120, 150 రోజుల మధ్యలో జామ పక్వథకు చేరుకుంటుంది. మొత్తం కరిగిన ఘనపదార్థాల శాతం 12 నుంచి 14 శాతం కలిగి ఉంటే పక్వథకు చేరినట్లు గుర్తించాలి.

సపోటాలో: సపోటాను పక్వథ దాటాక కోస్తే డాగుపడి త్వరగా చితికి, పాడైపోతాయి. కాబట్టి కొద్దిపాటి గట్టిదనం ఉన్నప్పుడే కాయలను కోయాలి. పూత పూసినపుడు మొదలుకొని 240 నుంచి 270 రోజుల్లో సపోటా పక్వథకు చేరుకుంటుంది. సపోటాలు తేలికపాటి గోధుమ రంగు నుంచి ముదురు గోధుమ రంగుకు మారతాయి. కాయను పట్టుకున్నప్పుడు పొడుంపొడుంగా చేతిలో రాలిపోతుంది. అంటే పండు పైన ఉంటే పొడుం తగ్గిపోతుంది. కాయ బరువు 65 నుంచి 70 గ్రా. మధ్య, సాపేక్ష సాంద్రత 1.025 నుంచి 1.057 మధ్య ఉన్నప్పుడు కోయాలి. కాయ భాగాల నుంచి తెల్లని రబ్బరులా ఉండే పాలు స్రవించడం తగ్గిపోతుంది. చేతివేలితో లేదా గోరుతో సపోటా తోలు తొలగించినపుడు లోపలి పండు భాగం పసుపు రంగులో కన్పిస్తుంది.

బొప్పాయిలో: పక్వథకు చేరిన బొప్పాయి రంగు ఆకుపచ్చ నుంచి పసుపుపచ్చకు మారడం అందరికీ తెలిసిందే. కాయ అడుగు భాగంలో మొదటగా పసుపుపచ్చగా మారడం గమనిస్తూ, కాయ మూడోవంతు వరకు రంగు వ్యాపిస్తే అప్పుడు కాయలను కోసుకోవచ్చు. అలాగే మొత్తం కరిగి ఉన్న ఘనపదార్థాల శాతం (టి.ఎస్.ఎస్.) 7 నుంచి 11 శాతంగా కోతకు తయారైనట్లు గుర్తించాలి.

పుచ్చకాయలో: పుచ్చకాయలను మొక్క కాడ లేదా తీగలకు ఉన్నప్పుడే పూర్తిగా వృద్ధి చెందనిచ్చి తర్వాత మొక్క నుంచి వేరు చేస్తారు. ఎందుకంటే వేరుపరచిన తర్వాత కాయలోపల రంగు, గుజ్జు, చక్కెర శాతం మొదలైన పదార్థాల అభివృద్ధి ఆగిపోతుంది. సహజంగా పుచ్చకాయ నేలను తాకి ఉన్న అడుగు ప్రాంతంలో కాయ తెల్లని ఊదారంగు నుంచి గోధుమ పసుపు రంగులోకి మారినట్లు గమనిస్తే అది పక్వానికి లేదా పూర్తి వృద్ధికి సంకేతం. అలాగే కాయకు ఉన్న కాడ లేదా తీగ వాడిపోవడం మొదలైతే అది కూడా పక్వథను తెలియజేస్తుంది. ముఖ్యంగా కాయను బాహ్యరంగును బట్టి నిర్ణయించలేము. కానీ, కాయ లోపలి భాగంలో గమనిస్తే గింజ చుట్టు గుజ్జు అతుక్కోవడం ఆగిపోయి, గింజ గట్టిగా తయారై, గుజ్జురంగు ఎరుపుగా, గుజ్జు పటుత్వంతో పెళుసుగా ఉండటం పక్వానికి సూచికలు, మొత్తం కరిగి ఉన్న ఘన పదార్థాలు (టి.ఎస్.ఎస్.) 10 శాతంగా ఉన్నప్పుడు పుచ్చకాయలను కోసుకోవాలి.

అరటిలో: అరటి కాయ తొక్క, గుజ్జు నిష్పత్తి 0.5 గా ఉండాలి. అరటికాయ పొట్టను గమనిస్తే బాగా సూటి కోణాలుగా కాకుండా గుండ్రంగా మారుతుంది. అడ్డుకోతలో అరటికాయ గుండ్రంగా ఉండాలి. ముప్పావు వంతు కాయ ఎదుగుదల లేదా మొదల్లో సులువుగా తెగిపోయే లేదా విరిగిపోయే స్థితికి అరటి చేరుకోవడం అనేవి పక్వతకు సంకేతాలుగా సూచిస్తారు.

దానిమ్మలో: పూత పూసినపుడు మొదలుకొని 130 నుంచి 140 రోజుల మధ్యలో పక్వథకు చేరుకుంటుంది. కాయలు పసుపురంగు నుంచి ముదురు ఎరుపు రంగుకు మారతాయి. కాయ కింద భాగంలో ఉండే పుష్పకోశం ముడుచుకుంటుంది. పక్వథకు చేరుకున్న దానిమ్మను చేతివేళ్ళతో నొక్కితే లోపల విత్తనాలు పగులుతున్న శబ్దం వినిపిస్తుంది. సరిగ్గా పక్వమైన పండ్లను వేలిగోళ్ళతో సులభంగా తీయవచ్చు. దానిమ్మ రసం పూర్తిగా ఎరుపురంగులో కనిపించడం, ఆమ్ల శాతం 1.85 గా ఉండటం పక్వథకు సంకేతాలు.

కె. సాధన (9940236076), డా|| జె.డి. సరిత, డా. బి. పుష్పావతి, వ్యవసాయ కళాశాల, పాలెం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ.

