కదిరి కుళ్లాయప్ప కరువుతో కుస్తీ పట్టలేక రెండెకరాల పొలం అమ్మినాడు. అమ్మితే వచ్చిన రెండు లక్షలతో భార్యని, ఇద్దరు కూతుర్లనీ తీసుకొని తిరుపతి చేరినాడు. సేంద్రీయ వ్యవసాయంతో పండించిన కూరగాయల వ్యాపారం చేద్దామని పట్టణానికి కొంత దూరంలో అవిలాల జంక్షన్లో అంగడి పెట్టినాడు. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, వేపపిండి లాంటి పదార్థాలతో పండించిన సేంద్రీయ కూరగాయలను అమ్మసాగాడు. కూరగాయలను పక్కనున్న నాగలాపురం, పిచ్చాటూరు, కమ్మపల్లి మండలాల రైతుల వద్దకెళ్లి తెచ్చుకొనేవాడు.
కుళ్లాయప్ప కూరగాయలు తెస్తే, భార్య భ్రమర భద్రంగా వాటిని సర్దేది. పెద్ద కూతురు కృష్ణవేణి తూకం వేసేది. రెండవ కూతురు రేవతి గల్లాపెట్టె కాడ కూర్చొనేది. ముగ్గురూ కూలోళ్ల లెక్కన కష్టపడేవాళ్లు. ‘ఎగిరి దంచినా, ఎగిరెగిరి దంచినా ఒకే పిండి’ అన్నట్లుగా వాళ్లు ఎంత కష్టపడినా రోజుకి మూడు వందల రూపాయలకి అటూ ఇటూ మాత్రమే వ్యాపారం జరిగేది.
తమ కష్టాలను తమ కస్టమర్ అయిన ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ లక్కిశెట్టి బీరప్పకి చెప్పినారు. తమ అనంతపురం జిల్లా మనుషుల పట్ల అభిమానంతో ఆయన చిన్న సినాప్సిస్ తయారుచేసినాడు. ”కుళ్లాయప్పా! చాలామందికి ప్రకృతిసిద్ధమైన, పర్యావరణ అనుకూలమైన, జీవాధారిత వ్యవసాయం ద్వారా ప్రాంతీయ వనరులతో లభించే ఆర్గానిక్ ఆహారం తినాలని వుంటుంది. కానీ ఈ బిజీ పట్టణంలో కూరగాయలు కొని, వండి తినే సమయం, ఓపిక, తీరిక ఆర్గానిక్ ప్రియులు అందరికీ వుండకపోవచ్చు. వాటిపై మక్కువ వున్నా ఇంతింత దూరాలు వచ్చి పట్టుకెళ్లి వండుకోవడానికి వారికి కుదరకపోవచ్చు. రాలేక పోలేక, చెయ్యలేక, చేసుకోలేక చాలామంది గమ్మున వుండిపోతారు. నా మాటవిని నీవు ఈ కూరగాయల అంగడిని సేంద్రీయ కూరగాయలతో పండిన కర్రీస్ కార్నర్‌గా మార్చిచూడు. వారికి ఆరోగ్యం – మీకు ఆదాయం, వారికి తృప్తి – మీకు మంచి వ్యాపారం చేస్తున్నామన్న సంతృప్తి మిగులుతాయి” అని చెప్పివెళ్లాడు.
* * *
మూడు నెలలు గడిచింది. ప్రొఫెసర్ ప్లాన్ ఫలించింది. కుళ్లాయప్ప కూరగాయల అంగడి ‘కుళ్లాయప్ప కర్రీస్ కార్నర్’ అయ్యింది. రుచిగా, శుచిగా సేంద్రీయ వంటలు వండసాగారు. టూవీలర్లలో, ఫోర్ వీలర్లలో జనాలు సర్రుసర్రున వచ్చి ఆర్గానిక్ ఆహారాన్ని ప్యాక్ చేసుకుపోసాగారు. మూడు మునక్కాయలు, ఆరు సొరకాయలుగా వ్యాపారం వెలిగిపోయింది. పట్టణంలో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ బ్రాంచీలు ప్రారంభమయ్యాయి.
* * *
ఓ శుక్రవారం సాయంత్రం ప్రొఫెసర్ బీరప్ప తన ఇంటి తోటకి నీళ్లు పడుతున్నాడు. అప్పుడే మహిళా యూనివర్శిటీలో ఎం.సి.ఎ. చదువుతున్న కూతురు సైకిల్ స్టాండు వేస్తూ ”అమ్మా! కొత్తగా మన జంక్షన్‌లో ఆర్గానిక్ కర్రీస్ కార్నర్ పెట్టారే! ఎంచక్కా మంచి కర్రీస్ ఎంజాయ్ చేయవచ్చు” అంటోంది. చిన్నచిన్నగా నవ్వుకున్నాడు ప్రొఫెసర్ బీరప్ప.
* * *
మూడు ఏండ్లకే మూడు ఎకరాల పొలం కొన్నాడు కుళ్లాయప్ప. నెలకి ఆరు లారీల కూరగాయలు పండించి ఉత్తర రాష్ట్రాలకు ఎగుమతి చేయసాగాడు. సేంద్రీయాన్ని నమ్ముకున్న కుళ్లాయప్ప కుటుంబమంతా ఎర్ర టమోటాల లెక్కన కళకళలాడసాగింది.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు, 9393662821(జూలై 2018 ‘చతుర’ మాసపత్రిక) సౌజన్యంతో

