ఆదిలక్ష్మి, రైతు శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్
మట్టి అన్నింటికీ మూలం. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న బంగారం, రాగి, వెండి, ఇనుము లాంటి ఖనిజాలు అన్నీ కూడా మట్టిలోనుండే వస్తున్నాయి. వివిధ రకాల పంటలను మట్టిలోనే పండిస్తున్నాము. చేదుగా ఉండే కాకరకాయ, తీపిగా ఉండే మామిడికాయ, సువాసనలు అందించే మల్లెపూలు, రంగురంగుల మందార పూలు ఈ విధంగా చూసుకుంటే వివిధ రకాల రుచులు, వివిధ రకాల సువాసనలు, వివిధ రకాల రంగుల పంటలన్నీ కూడా మట్టి ద్వారానే మనం పొందుతున్నాము. మనిషితో పాటు ఏ జీవి చనిపోయినా కుడా మట్టి తనలో కలుపుకుంటుంది. ఇలాంటి ఎన్నో గొప్ప గుణాలున్న మట్టిని రసాయనాలు వేసి పాడు చేస్తున్నాము. కాబట్టి అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా మేల్కొని రసాయనాలను వీడి సేంద్రియ సాగు బాటపట్టి మట్టిని కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందని ఏప్రిల్ 9న ‘నాబార్డు’ వారి సహకారంతో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా, నర్సపూర్‌లోని శ్యామసుందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ సాగు విధానం, కషాయాలు, మిశ్రమాల తయారీతోపాటు రైతులు పండిరచిన వ్యవసాయ దిగుబడులకు విలువ జోడిరపు వంటి అంశాలపై జరిగిన అవగాహన సదస్సులో రాజేంద్రనగర్ రైతు శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిలక్ష్మి అన్నారు. కార్యక్రమంలో ఏ.ఈ.ఓ. విజృంభణ, సేంద్రియ రైతులు శ్యామసుందర్ రెడ్డి, బాలేష్, క్రాంతి కిరణ్, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.

రైతులు ఏక పంట విధానానికి స్వస్తి పలికి బహుళ పంటల విధానాన్ని చేపట్టడంతోపాటు గొర్రెలు, మేకలు, కొళ్ళను కూడా పెంచుకుంటూ సమగ్ర వవ్యవసాయ విధానాలను అవలంబించగలిగితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని తన సొంత అనుభవాన్ని శ్యామసుందర్ రెడ్డి వివరించారు. వేసవి కాలంలో ఆకు కూరలకు గిరాకీ బాగా ఉంటుంది కాబట్టి నీడ అందుబాటులో ఉండే ప్రదేశాలలో వివిధ రకాల ఆకు కూరలను, కూరగాయలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తూ వచ్చిన దిగుబడులను నేరుగా వినియోగదారులకు అమ్మకం చేసినట్లయితే సేంద్రియ సాగులో లాభాలు తప్పనిసరిగా వస్తాయని తన సొంత అనుభవాన్ని సేంద్రియ రైతు బాలేష్ వివరించారు. సేంద్రియ సాగు ఆవశ్యకత, వివిధ పంట ఉత్పత్తులకు విలువ జోడిరపుకు సంబంధించిన సమాచారాన్ని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు విపులంగా వివరించారు. శిక్షణకు హాజరైన రైతులు శ్యామసుందర్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రాన్ని ప్రత్యక్షంగా తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాజరైన రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు.

