పేరిశాస్త్రి తల్లి వైదేహి ఉదయమే లేచి పేరిశాస్త్రిని పెరట్లోకి తీసుకెళ్ళింది. అతడిని కొబ్బరిచెట్టు నీడన రాతిబండపై కూర్చోబెట్టింది. బాదం తైలంతో అతని తలని మర్ధన చేసింది. ఉష్ణం తగ్గాలని నిమ్మకాయ పిండి తలకి రాసింది. పేరిశాస్త్రి ముఖం మిలమిలా మెరవాలని దోసిడంత గోవు వెన్న తీసి ముఖానికి పూసింది. అరవై నిమిషాలు తైలంతో నానాక అతడి శరీరంపై చేదబావిలోని చన్నీళ్ళను బొక్కనతో తోడి పోసింది. కుంకుడు కాయలతో తలని అంటి అభ్యంగన స్నానం పూర్తి చేయించింది. తన చీర కొంగుతో అతడి తలను ఆరబెట్టింది. విసన కర్ర తెచ్చి విసురుతూ కురులను వదులు చేసింది. తలకి సాంబ్రాణి పొగ వేసింది. పేరిశాస్త్రిని రచ్చబండ వద్దకి తీసుకెళ్ళి వేపచెట్టు కింద పసుపు కుంకుమలు పూసివున్న గంగమ్మ తల్లికి దండాలు పెట్టించింది.
ఇంటికి తీసుకెళ్ళి దోసిట్లో చద్ది అన్నం పోసి ఉల్లిపాయ ముక్క, పచ్చి మిరప అందించింది. కడుపు నిండా ఆరగించిన పేరిశాస్త్రి రేగుపండ్ల కోసం అడవికి బయలుదేరినాడు.
* * *
పేరిశాస్త్రి తల్లి వైదేహికి పాతికేళ్ల వయస్సుకే వైధవ్యం ప్రాప్తించింది. ఏటిగట్టుకి ఈతకు పోయిన భర్త సదానంది శాస్త్రి ఏరు పెరిగి ఏటిలో ఎటో కొట్టుకు పోయినాడు. వైధవ్యం ప్రాప్తించే నాటికి పేరిశాస్త్రి చిన్న బిడ్డ. ఇంటవున్న గేదెల పాల విక్రయం ద్వారా జీవనం సాగిస్తోంది ఆమె.
తండ్రిని చూడకనే పేరిశాస్త్రి బాల్యం గడిచింది. ఆయా రుతువులలో ఫలించే అడవి ఫలాలను తెచ్చి పల్లెల్లోకి తీసుకెళ్లి అమ్ముతాడు పేరిశాస్త్రి. దాని ద్వారా లభించే నగదు, ధాన్యాలను గృహానికి చేరుస్తాడు.
* * *
పేరిశాస్త్రి చిన్నగా నడుస్తున్నాడు. వడివడిగా నడిస్తే పుడమితల్లి గాయపడుతుందేమోనన్నంత చిన్నగా నడుస్తున్నాడు. అతడు గోదావరి నదికి అభిముఖంగా నడక సాగిస్తున్నాడు. అతడి మెత్తటి నడకను వెక్కిరిస్తున్నట్టుగా గోదావరి ఎగిరెగిరి ప్రవహిస్తోంది.
అడవిలో కావలసినన్ని రేగుపండ్లు సేకరించి బుట్టలలో, సంచులలో బిగించి ఇంటికి తీసుకెళ్తున్నాడు. గోదావరి నదిలో స్నానం చేస్తున్న ఓ పదహారేళ్ల పడుచుపిల్ల పేరిశాస్త్రిని చూసి సిగ్గుపడలేదు. నవ్వుతూ ఈదుకుంటూ వచ్చి ఒడ్డుపై వాలింది. ఆ పిల్ల ఒళ్ళు బంగారంలా మెరుస్తోంది. తడిసిన సొగసు రతీదేవిని అసూయపరిచేట్లుగా వుంది. సిగకొప్పు నల్ల చీకటి ముద్దలా వుంది. కొప్పులోని వాడిన మల్లెలు అలసిన మన్మథుడు రతీదేవిపై వాలి ఉన్నట్లుగా ఉంది. ఆ పిల్ల కిసుక్కున నవ్వితే మెరుపు మెరిసినట్లుగా వుంది. ఆ పిల్ల ముక్కు పుడక కాంతి సన్నని చీకటి దీపంలాగా ఉంది.
అలాంటి పిల్ల నది గట్టున కూర్చొని పేరిశాస్త్రిని మైలు దూరం నుంచి చూసి చూసి… విసిగింది. అతడి క్షణ వీక్షణానికై తహతహలాడింది. అయితే పేరిశాస్త్రిలో చలనం లేదు. తన మార్గంలో తను ఉన్నాడు. శుక్ర మహర్షిలా ఠీవిగా నడుస్తున్నాడు.
విసిగిన ఆ పిల్ల ‘తన బతుకెందుకింక’ అన్న ధోరణిలో గబుక్కున నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళింది.
* * *
పేరిశాస్త్రి అడవిదాటి, నది దాటి, సేద్యపు గెనాలు దాటి పల్లెలోకి ప్రవేశించాడు. పల్లెకి దూరంగా ఒంటిగా వున్న తన ఇంటిలోకి పెరటిగుండా వెళ్ళినాడు. పెరట్లోని చేదబావి దగ్గర కొబ్బరి చెట్ల నీడన కూర్చొని తను తెచ్చిన రేగుపండ్లను ఆరపోశాడు. చెడిన పండ్లను ఏరి పారేస్తూ కిటికీగుండా ఇంటిలోకి చూసినాడు.
ఇంటిలోపల పట్టెమంచంపై రామశర్మ కూర్చొని ఉన్నాడు. అమ్మ పక్కనే నిలబడి ఉంది. రామశర్మ తన పల్లెలోని పడమటి వీధిలో కాపురముంటున్నాడు. పౌరోహిత్యం ద్వారా జీవనం సాగిస్తున్నాడు. పేరిశాస్త్రికి వరుసకు పెదనాన్న అవుతాడు.
పేరిశాస్త్రి పెరటినుండి ఇంటిలోపలికి వచ్చి రామశర్మ పాదాలకి నమస్కరించాడు. భయంగా, గౌరవంగా, దూరంగా నిలబడినాడు. ఇంటిముందు ముద్ద మందారం చెట్టులోని మందారాలు గాలికి అటూ ఇటూ ఊగుతున్నాయి.
* * *
రామశర్మ కొడుకు సుధాకరం అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చదివినాడు. బిడ్డకి మంచి భవిష్యత్తు ఉంటుందని కలలు కనినాడు. ఏ శాపం తగిలిందో ఏమో, సుధాకరానికి మూత్రపిండాల జబ్బు వచ్చింది. మూత్రనాళాలలో ఇన్ఫెక్షన్లు ప్రారంభమై క్రియాటిన్ స్థాయిలు పెరిగి మూత్రపిండాలు దెబ్బతిని డయాలసిస్ స్థాయి దాటి మూత్రపిండ మార్పిడి వరకు వచ్చింది.
”బిడ్డలాంటి బిడ్డ నీవు నాకు. కష్టపడి చదివిన నా సుధాకరం, నీవూ ఒకటే బాబు నాకు. ఒక్క మూత్రపిండమైనా మారిస్తే తన బతుకు తాను బతకగలడని యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు చెబుతున్నారు.
విదేశాలలో ఉద్యోగాలు సైతం వాడికోసం సిద్ధంగా ఉన్నాయి. అయినా వాడు మన తెలుగు రాష్ట్రాల ఎల్లలు దాటనంటాడు. తెలుగు రైతన్నలకు మంచి చెడ్డలు నేర్పతానంటాడు. దానికోసం ‘కర్షక మిత్ర’అనే సంస్థను చిన్న పల్లెటూరు, మన పొరుగూరు అయిన అనంతంపల్లిలో ఆఫీసు ఏర్పాటు చేసినాడు. భావసారూప్యం కలిగిన పదిమందితో జట్టు కట్టినాడు. ఆ పదిమందిలో అగ్రికల్చరల్ బి.యస్సీ. చేసిన వారు, హార్టికల్చర్, సెరికల్చర్ సబ్జక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్లు ఉన్నారు.
వారికి సహాయకరంగా ఇరవైమందితో అంకితభావం కలిగిన క్షేత్రస్థాయి బృందం ఒకటి ఏర్పడింది. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫార్మ్ ఇంజనీరింగ్, అగ్రి టెక్నాలజీలలో డిప్లొమోలు చేసినవారు ఈ బృందంలో ఉన్నారు.
వీరంతా ఉత్తరాల ద్వారా, కరపత్రాల ద్వారా, ఫోన్ల ద్వారా, మొబైల్ మెసేజ్ల ద్వారా రైతులకు సలహాలు, సూచనలు ఉచితంగా ఇస్తారు. రైతుల పొలాల నుంచి ఇంటికి వచ్చినాక రాత్రిళ్లలో రచ్చబండ సమావేశాలు నిర్వహిస్తారు. దిగుబడి పెంచి, రాబడి గడించే సూచనలు చేస్తారు. అవసరమైతే పొలాలకు వెళ్ళడం, రైతులు ఇండ్లకి వెళ్ళడం చేస్తారు. వారి అవగాహనా సామర్థ్యాన్ని పెంచడానికి ప్రజెంటేషన్స్ చేస్తారు. అందుకై ఎల్.సి.డి. ప్రొజెక్టర్, ల్యాప్ టాప్, స్క్రీన్, రిమోట్ మరియు సి.డి. లు కొనుగోలు చేసారు.
అలాంటి సంస్థ నాయకుడి ఆరోగ్యం దెబ్బతినడంతో సంస్థ ఎటుపోతుందో తెలియడం లేదు. సంస్థ నిర్మాణం కోసం, వస్తు సామాగ్రి కోసం వాహనాలకోసం, జీతభత్యాలకోసం ఉన్న ఇల్లూ, వాకిలీ, నేలా, నగా అన్నీఅమ్మేశా. దిక్సూచి లేని సముద్ర ప్రయాణంలా ఉంది పరిస్థితి.
మంచి చదువు చదివినవాడు, పదిమందికీ పనికివస్తాడని ఆశించినాము. అయితే రోజు రోజుకీ వాడి ఆరోగ్యం క్షీణిస్తోంది. వయసు మీరిన నేను ఎక్కువకాలం బతకను. పదేళ్లక్రితమే భార్యను పోగొట్టుకున్నవాణ్ణి. ఇప్పుడు కొడుకునీ పోగొట్టుకోలేను. వాడి ఆదర్శాలనూ చంపలేను. నా శరీర నిర్మాణం సరిగా లేనందున నా అవయవదానం పనికిరాదు.
పెద్దమనసు చేసుకొని నీ మూత్రపిండం ఒక్కటి నా బిడ్డకి ఇస్తే మా ఇంటిదీపం వెలిగించిన వాడవవుతావు. నీకు తమ్ముడిలాంటి వాడు. వాడికి ఆయుష్షు ప్రసాదించు బాబూ! వాడు ఈ సమాజానికి చేయాల్సింది చాలా ఉంది బాబూ!” అని ఏడుస్తూ పేరిశాస్త్రి కాళ్లమీద పడినాడు.
తల్లి వైదేహి ససేమిరా ఒప్పుకోవద్దని పేరిశాస్త్రికి సైగలు చేస్తోంది. పమిటతో నోటికి కప్పి ఏడుస్తూ వుంది. ఆమె సైగలను పట్టించుకోలేదు అతడు.
పేరిశాస్త్రి తీక్షణంగా రామశర్మ కళ్లలోకి చూస్తూ, మౌనంగా, నిలబడినాడు. అలాగే పదిహేను నిమిషాలపాటు కళ్ళు మూసి దీర్ఘంగా ఉచ్చ్వాసనిశ్వాసాలు తీసినాడు.మనసుకి ఏదో బోధపడింది.
కళ్లు తెరిచి ”పెద్దనాన్నగారు, నా శరీరభాగం మన సుధాకరానికి ఉపయోగపడుతుందంటే రెండవ ఆలోచన చేయాల్సిన పనిలేదు. రైతు బాంధవుడు అతడు. అజ్ఞానం నీడలో, సాగుబడిలేక, దిగుబడిరాక దినదిన గండంతో సతమతమవుతున్న రైతుల చీకటి జీవితాల్లో చిన్న చిరుదివ్వె వెలిగించాలన్నది సుధాకరం తపన. అది ఎంతమందికి వెలుగు ప్రసాదిస్తుందనేది అప్రస్తుతం. ప్రయత్నం చాలు. మనందరం ఆ ప్రయత్నాన్ని స్వాగతిద్దాం. మనవంతు సాయం మనం చేద్దాం. మీరు మూత్రపిండ మార్పిడికి డాక్టర్లతో మాట్లాడి ఏర్పాటు చేసుకోండి” అని ధైర్యంగా సూటిగా రామశర్మకి చెప్పినాడు.
రెండు చేతులూ జోడించి కళ్లనీళ్లతో ”కృతజ్ఞతలు బాబూ!” అంటూ రామశర్మ బయలుదేరినాడు.
* * *
వెక్కి వెక్కి ఏడుస్తూ వచ్చిన వైదేహి పేరిశాస్త్రికి నాలుగు అడుగులు దూరంలో నిలబడింది. ఆమె శరీరం చిన్నగా కంపిస్తోంది. కళ్లలోంచి కన్నీరు… వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తోంది.
తల్లి ఏడ్వడం సహించలేని పేరిశాస్త్రి వడివడిగా వస్తూ ”ఏడ్వకే అమ్మా!” అంటూ ఆమెను తన ఒడిలోకి తీసుకొని మౌనంగా భుజం తడుతూ ఓదార్చినాడు.
సొమ్మసిల్లినట్టుగా పడివున్న తన తల్లి ముఖాన్ని చల్లటి నీటితో శుభ్ర పరచాలని నీటితొట్టి వద్దకి పరుగు తీసినాడు. పరుగుతీసే సమయంలో అతడి కాలికి ముల్లు గుచ్చుకొంది. గట్టిగా ”అమ్మా!” అని అరిచినాడు.
వైదేహి ఉలిక్కిపడింది. పరుగెత్తుకెళ్ళి అతడిని తన ఒడిలోకి తీసుకొని కాలిలోని ముల్లు పెరికింది. పేరిశాస్త్రిని బాధ లాగుతోంది. అరిపాదంలో ఇరుక్కొని వున్న ముల్లుకొన నెప్పి పెడుతోంది.
ఆమె తనవద్ద వున్న పిన్నుతో ముల్లుకొనని తీసి పారేసింది. రక్తం వస్తోంది. ఆమె తన నోటిలోకి రక్తాన్నంతా లాక్కొంది.
రక్తం రావడం ఆగాక, చిన్నగా అరిపాదంపై ముద్దెట్టుకుంది. అతడి కళ్లలో కన్నీరు ”ఒక్కగానొక్క కొడుకువి, నన్ను అన్యాయం చేయకయ్యా!” అని చేతులు పట్టుకు అడిగింది. అతడు ఏడ్చాడు. చిన్న పిల్లాడిలా ఆమెను హత్తుకుపోయాడు.
”అమ్మా! అమ్మా! నీవు ధైర్యంగా ఉండవే! నీ కళ్లలో కన్నీళ్లు చూడలేను. నవమాసాలు నన్ను మోసి, పెంచి, పెద్ద చేసినదానవు. నేను నీ సృష్టినే అమ్మ! నీకు అన్యాయం ఎందుకు చేస్తానే!
పెద్ద చదువులు చదవకపోయినా, నాలో చిన్నప్పటి నుంచీ అన్నం పెట్టే రైతన్నలకి ఏమైనా, ఏదైనా సహాయం చేయాలనిపించేది. అది జరిగే వీలు నాకు కలగలేదు. సుధాకరం నా కలలని వాస్తవం చేసే యజ్ఞంలో ఉన్నాడు. ఆ యజ్ఞానికి నా వంతు ఆజ్యం పోస్తానమ్మా!”అన్నాడు.
వైదేహి తల్లడిల్లిపోయింది.
‘ఒక్కగానొక్క కొడుకు. ‘నా’ అనే దిక్కు లేదు. ఏమి చేసేదబ్బా’ అనుకుంటూ మంచంపైని తుండుగుడ్డని లాక్కొని ముఖాన్ని దాచుకొని ఏడుస్తూ కూర్చుంది.
అమ్మ కాళ్లదగ్గర కూర్చున్నాడు పేరిశాస్త్రి.
”అమ్మా! గొప్ప చదువులు చదివినవాడిని కాను. మీరంతా చదవమనినా, చదవక తప్పించుకొని తిరిగినవాడిని. పట్టుమని పదివరకైనా చదవలేకపోయాను. ప్రపంచాన్ని చూసేకొద్దీ చదువు విలువ తెలుస్తోందమ్మా.
తమ్ముడు పెద్ద పెద్ద చదువులు చదివినాడు. ఎందరో జనాలకి సహాయం చేయాలని ఉన్నవాడు. నేను ఎంత ఎదిగినా నా పరిమితి చిన్నది. సుధాకరం బృందం పరిమితి పెద్దది.
నా శరీరంలోని ఒక భాగం ఒక సంఘసేవకుడి నిర్మాణాత్మక కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతున్నందులకు గర్వపడాలి. చిన్నప్పటి నుంచీ రైతులకు సహాయం చేయాలని ఉండేది. ఇప్పుడు అవకాశం వ్చచింది నాకు. కాదనవద్దమ్మా! ఒక్క మూత్రపిండం దానం చేసినంత మాత్రాన నా ప్రాణాలేమీ పోవమ్మా! నాకు పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. నీ బిడ్డ చేసే సాయంవల్ల నలుగురికీ మంచి జరుగుతుందే అమ్మా! ఓ బిడ్డ తల్లిలాగా ఆలోచించవద్దు. లబ్ధిపొందబోయే రైతుబిడ్డల తల్లిగా ఆలోచించు. అందరూ ‘నా’ వారు అనుకుంటే సమస్య ఉండదమ్మా!” అని ప్రాధేయపడినాడు.
వైదేహికి పేరిశాస్త్రి భగవద్గీతను బోధించే శ్రీకృష్ణుడిలా కనిపించాడు. ధర్మసూక్ష్మాలు బోధించే గౌతమ బుద్ధుడిలా అగుపించాడు.
అలాగే ఆమె అతడిని నెలల పసికందులా దగ్గరకు తీసుకున్నట్లు తీసుకొని ఆలింగనం చేసుకొంది. ఆకాశం నుంచి సన్నసన్న చినుకులు రాలడం ప్రారంభమయ్యింది. ఆకాశంలో తూర్పు దిక్కున ఇంద్రధనస్సు మొలిచింది.
ఇంటి పెరటి చింతచెట్టు గాలికి చిన్నగా సవ్వడి చేసింది. చింత చిగురు వారినిద్దరినీ పలకరిస్తున్నట్టుగా మెరుస్తూ ఉంది. లేత చింతకాయలు పేరిశాస్త్రిని ఆశీర్వదిస్తున్నట్లుగా అటూ ఇటూ ఊగుతున్నాయి. *
ఆర్.సి. కృష్ణస్వామి రాజు, 9393662821
‘ఆంధ్రభూమి’ మాసపత్రిక సెప్టెంబర్ 2018లో ప్రచురింపబడింది.

