జనాభా పెరుగుతున్న కొద్ది ఆహార పదార్థాలు మరియు పీచుపదార్థాల ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. దీనివల్ల ప్రతీ యూనిట్ విస్తీర్ణంలో ఆహార పదార్థాల మరియు పంటల దిగుబడి పెంచటానికి రసాయన మందుల వాడకం కూడా పెరుగుతూ వస్తుంది. కానీ ఎక్కువ రసాయనిక ఎరువుల వల్ల విపరీతమైన వ్యాధులు వస్తున్నాయి. దాంతోపాటు పర్యావరణ కాలుష్యం అధికం అవుతుంది. కాబట్టి దీనిని తగ్గించటానికి ప్రస్తుత రోజల్లో మొక్కల నుంచి తీయబడ్డ పదార్థాలను వ్యవసాయరంగంలో, ఉద్యానరంగంలో ఉపయోగిస్తున్నారు. కాబట్టి రసాయనిక ఎరువుల స్థానంలో క్రమంగా ప్రత్యామ్నాయ స్థానంలో సహజసిద్ధమైన ఎరువులు ఉపయోగించటం ఎంతో ఉపయోగకరం. సహజసిద్ధమైన ఎరువులు సులభంగా సూక్ష్మజీవులతో విచ్ఛిన్నం చేయబడతాయి. విషపూరితం కావు. పర్యావరణాన్ని కాలుష్యం కలిగించవు. మనుష్యులకు, జంతువులకు, పకక్షులకు హానికరం కాదు.
సీవీడ్ అనేది కంటికి కనిపించే సముద్రపు ఆల్గే. వీటిని ఆహారంగా, పశువులకు మేతగా, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. పరిశ్రమ పదార్థాలయిన అగార్, ఆల్జినేట్లను తయారు చేయడానికి కూడా సీవీడ్‌ని ఉపయోగిస్తారు. ప్రస్తుత రోజుల్లో రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సీవీడ్‌ని ఉపయోగిస్తున్నారు. సీవీడ్ ద్రవరూపంలో, బయోస్టిమ్యులెంట్ రూపంలో మార్కెట్లో లభిస్తాయి.
బారదేశంలో 800 రకాల సముద్రపు ఆల్గేలు భారతదేశ తీరప్రాంతాలైన అలల మధ్య ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో కనుగొనబడ్డాయి. దీనిలో దాదాపుగా 60 రకాల జాతులను మాత్రమే వాణిజ్యపరంగా ఉపయోగకరమైనవిగా గుర్తించారు. ఇవి తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, లక్షద్వీపాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అండమాన్నికోబార్, పశ్చిమబెంగాల్, ఒరిస్సా తీరప్రాంతాలలో లభిస్తాయి. దీనిలో కొన్ని జాతులను మాత్రమే వ్యవసాయరంగంలో ఉద్యానరంగంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.
వీటిలో ముఖ్యమైన సీవీడ్ రకాలు:
కప్పాఫికస్ ఆల్వరెజి: ఇది తినడానికి వీలయ్యే ఎర్రటి సముద్రపు ఆల్గే. ఇది ఉష్ణమండల ప్రాంతాలలో అధికంగా పెరిగే, లభించే ఆల్గలలో ఒకటి. ఈ ఆల్గే 23.4 మి.గ్రా./లీ. ఐబిఏ, 27.8 మి.గ్రా./లీ. జిబ్బర్లిన్, 31.9 మి.గ్రా. సైటోకైనిన్ కలిగి ఉంటుంది.
గ్రాసిలేరియా ఎడ్యులిస్: ఇది ఎర్రటి ఆల్గే కుటుంబానికి చెందినది. ఇది భారతదేశ ఉప అలల ప్రాంతాలలో అధికంగా లభించే ఆల్గే. ఈ ఆల్గే నుండి తీయబడిన ద్రవం/సారంలో ఫాస్ఫరస్ 278.5 మి.గ్రా./లీ., సోడియం 195.2 మి.గ్రా./లీ., ఐరన్ 12.7 మి.గ్రా./లీ., మాంగనీస్ 32.9 మి.గ్రా./లీ. కలిగి ఉంటాయి.
వీటితో పాటు గెలిడైఎల్లా ఎకరోజా ఆస్కోఫిల్లమ్ నోడోసమ్ కూడా ముఖ్యమైనది.
సీవీడ్ తయారు చేసుకొను పద్ధతులు:
తీరప్రాంతాల నుంచి సేకరించిన సముద్రపు ఆల్గేని మొదట సముద్రపు నీటితో బాగా శుభ్రపరచుకోవాలి. దీనివల్ల ఆల్గేకు అంటుకొని ఉన్న మలినాలు, ఇసుక రేణువులు, ఇతర ఆల్గేపై పెరిగే అవసరం లేని మొక్కలు తొలగించబడతాయి. తర్వాత వీటిని పాలిథీన్ సంచులలో ఉంచి, వీటిని మంచుపెట్టెలో ఉంచుకోవాలి. తర్వాత వీటిని తయారు చేయు ప్రదేశానికి తీసుకువచ్చి వీటితో ఆల్గేకు అంటుకొని ఉన& లవణాలు తొలగించబడేలా శుభ్రపరచుకోవాలి. తర్వాత తాజా శుభ్రమైన ఆల్గేను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. 1 కిలో ఆల్గే నుంచి సారాన్ని/ద్రవాన్ని సేకరించుకోవాలి. ఈ ద్రవాన్ని/సారాన్ని రెండుపొరల మస్లిన్వస్త్రం గుండా పోస్తే వడబోసుకోవాలి. దీనివల్ల ఇతర చిన్న చిన్న మొక్క బాగాలు కూడా తొలగించబడతాయి. ఇలా లభించిన ద్రవం 100% సాంద్రత కలిగిన ద్రవరూప సీవీడ్. దీనిని 0-4 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేసుకోవాలి. మొక్కలకు అనుగుణంగా అవసరమైన మోతాదులో దీని నుండి (100% లిక్విడ్ సీవీడ్) వివిధ మోతాదులను (ఉదాహరణకు 25%) తయారు చేసుకోవచ్చు.
అదేవిధంగా 50 గ్రా.ల ఎండిన పౌడర్ని 50 మి.లీ. ల నీటిలో రెండురోజులపాటు నానబెట్టి తర్వాత మస్లిన్ వస్త్రంతో వడపోసుకుని కూడా వినియోగించుకోవచ్చు.
సముద్రపు ఆల్గేని బాగా 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఎండబెట్టుకోవాలి. తర్వాత మెత్తని పౌడర్‌ను తయారు చేసుకోవాలి. దీని నుంచి ఎరువు తయారీ కోసం 50 గ్రా. పౌడర్ని 50 మి.లీ. నీటిలో ఒక గంటపాటు మరగబెట్టుకోవాలి. తర్వాత మస్లిన్ వస్త్రం ద్వారా వడపోసుకోవాలి. ఈ వడపోసిన మిశ్రమాన్ని 50 మి.లీ. వరకు చేసుకోవాలి. దీనివల్ల 100% మోతాదుగల మిశ్రమాన్ని పొందవచ్చు.
పైన తెలిపిన మూడు పద్ధతులలో తీయబడ్డ ద్రవరూప సీవీడ్‌ని తదుపరి ఉపయోగించేవరకు 0-4 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నిల్వ చేసుకోవాలి. తర్వాత 100% మోతాదుగల ద్రావణాన్ని మొక్కల రకాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వివిధ మోతాదులో నీటితో కలిపి తయారు చేసుకోవచ్చు.
ఈ పద్ధతిలో తాజా సముద్రపు ఆల్గేని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. వీటికి బలమైన ఆమ్లాలయిన హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలిపి 30 నిమిషాలపాటు 40-50 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఇంకుబేట్ చేసుకోవాలి. ఈ ఆమ్లం సంక్లిష్ట పదార్థాలని ద్రవరూప మిశ్రమం నుంచి తీసివేస్తాయి.

ఇందులో పైన తెలిపిన పద్ధతిలో ఉపయోగించిన ఆమ్లం స్థానంలో సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ క్షారాలను వినియోగిస్తారు. ఈ పద్ధతిలో కూడా తాజా సముద్రపు ఆల్గేని చిన్నముక్కలుగా కత్తిరించుకొని, బలమైన క్షారాలను కలుపుకొని అధిక ఉష్ణోగ్రతలో (70-100 డిగ్రీ సెంటీగ్రేడ్) 30 నిమిషాల పాటు ఇంకుబేట్ చేసుకోవాలి.
ఇది కొంచెం క్లిష్టమైన, ఆధునిక పద్ధతి. దీనిలో ఎండిపోయిన సముద్రపు ఆల్గేని నీటిలో బాగా నానబెట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమానికి సూక్ష్మతరంగాలను పంపి వేడి చేయడం వల్ల ద్రవరూప సముద్రపు ఆల్గే ఎరువును పొందవచ్చు.
వ్యవసాయరంగంలో ప్రాధాన్యత
- సముద్రపు ఆల్గే ఎరువులు ద్రవరూపంలో, గుళికలుగా, పౌడరు రూపంలో మార్కెట్లో లభ్యమవుతాయి.
- వీటిని ఎరువులుగా ఆకులమీద పిచికారి చేసేవిధంగా, కండిషనర్లుగా, నేలలో కలిపేవిధంగా వినియోగించుకోవచ్చు.
- ఇది అన్ని రకాలైన ధాన్యాలు, పప్పులు, పూల మొక్కలలో లాభదాయకమైన ప్రభావాన్ని చూపించినవిగా కనుగొనబడ్డాయి.
- ఈ సీవీడ్ ఎరువులు కలుపు మరియు వ్యాధికారక శిలీంద్ర రహితం
- నేలలో కంటే ఆకులమీద పిచికారి చేయటం వల్ల మొక్కలు పోషకాలను త్వరగా గ్రహించుకొంటాయి.
- ఆకులమీద పిచికారి చేయటం వల్ల ధాన్యం, కూరగాయలు, పండ్లతోటల్లో మొక్కల ఎదుగుదల మరియు దిగుబడిని పెంచూయి.
- ఈ ద్రవరూప సముద్రపు ఆల్గే ఎరువులు తక్కువ మోతాదులో (1:1000) క్రియాశీలకంగా పనిచేస్తాయి.
విత్తన అంకురోత్పత్తిలో ప్రాధాన్యత
- విత్తనాలను తక్కువ మోతాదు సముద్రపు ఆల్గే ఎరువులో నానబెట్టి విత్తుకోవడం వల్ల ఎక్కువ అంకురోత్పత్తి, వేరు మరియు మొక్క పెరుగుదల అధికంగా ఉంటుంది. తక్కువ మోతాదులో మొక్క ఎదుగుదలకు అవసరమైన ఆక్సిన్లు, జిబ్బర్లిన్లు, సైటోకైనిన్లు, సూక్ష్మ, స్థూల పోషకాలు లభ్యమవుతాయి.
- ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తే అంకురోత్పత్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మోతాదుల్లో అధిక లవణాలు ఉండి అంకురోత్పత్తి నారు పెరగకుండా చేస్తాయి.

- ఇవి మొక్కలకు అవసరమైన హార్మోన్లు కలిగి ఉండటం వల్ల, వేరు మరియు మొక్క పెరుగుదలను మెరుగుపరుస్తాయి.
- అధిక కార్బన్ సమీకరణవల్ల కిరణజన్య సంయోగక్రియ పెరిగి పండ్లతోటలు మరియు పూల దిగుబడి పెరుగుతుంది.
- ఇవి మొక్క ఎదుగుదలకు, అభివృద్ధికి కారణమైన మొక్క పెరుగుదల నియంత్రణకారులను కలిగి ఉండటం వల్ల మొక్కల్లో వార్ధక్య థ తగ్గిస్తుంది.
- నేలలో లాభదాయకమైన సూక్ష్మజీవులు పెరుగుదలకు దోహదపడతాయి.
- సీవీడ్‌ని వాడటం వల్ల మొక్కల్లో పర్యావరణ ఒత్తిడులను తట్టుకొని సామర్ధ్యం పెరుగుతుంది.
- యాంటీఆక్సిడెంట్స్ పెరుగుదలకు దోహదపడతాయి.
- ఈ సేంద్రియ ఎరువులను వినియోగించటం వల్ల కీటకనిరోధక, వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
- అదేవిధంగా ఈ సీవీడ్ ఎరువులలో సైటోకైనిన్లు ఉండటం వల్ల మొక్కల్లో క్రియాశీలమైన, ఉపయోగకరమైన వేరుబుడిపెల పెరుగుదలకు దోహదపడతాయి.
- ఈ సముద్రపు ఆల్గే ఎరువులలో సేంద్రియ పదార్థాలు అధికంగా ఉండటం వల్ల మొక్కలకు అవసరమైన తేమని, పోషకాలను వేరుకు అందుబాటులో ఉంచుతాయి. దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది.
- సీవీడ్ వేరు విస్తరణను పెంచటం వల్ల ప్రోటీన్ తయారీకి అవసరమైన నైట్రోజన్, ఫాస్ఫరస్‌ను మరియు సల్ఫర్‌ను అధికంగా గ్రహించుకొని ప్రోటీన్ శాతాన్ని పెంచుతాయి.
- ఈ సీవీడ్ హార్మోన్లు, ఎంజైములు, పెరుగుదల నియంత్రణకారులు కలిగి ఉండటం వల్ల పంటల మరియు పూల నిల్వ కాలాన్ని కూడా పెంచుతాయి.
ఇటువంటి ఉపయోగాల వల్ల ప్రస్తుత రోజుల్లో సహజసిద్ధమైన సముద్రపు ఆల్గే వినియోగం చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
దరిపల్లి శ్రీలక్ష్మి, పిహెచ్.డి, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, బిధన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయం, మోహన్పూర్, పశ్చిమబెంగాల్. ఫోన్: 70324 60731
