ఈరోజుల్లో గొర్రెలను వృత్తిగా మాత్రమే కాకుండా వాణిజ్య సరళిలో పెంచుతున్నారు మరియు అధునాతన యాజమాన్య పద్ధతుల్లో పెంచుతున్నారు. అయితే సాధారణంగా గొర్రెల్లో చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి వైరస్‌ మరియు బాక్టీరియా వల్ల కావచ్చు. వీటిల్లో చాలా వరకు వ్యాధులను యజమాని గుర్తు పట్టి వైద్యం అందించి బ్రతికించుతాడు. కానీ కొన్ని వ్యాధులు గుర్తు పట్టడం మరియు చికిత్స అందించే లోపలే గొర్రెలు చనిపోయే అవకాశం ఉంది. వాటిల్లో చిటుకువ్యాధి ముఖ్యమైనది. తొలకరి జల్లులు పడగానే క్లాస్ట్రిడియం అనే బాక్టీరియా విడుదల జేసే విషపదార్థం వల్ల ఈ వ్యాధి వస్తుంది. చిటుక వేసినంత కాలంలోనే విష పదార్థం విడుదల అవడం వలన జీవాలు చనిపోతాయి. అందుకే ఈ వ్యాధిని చిటుకు వ్యాధి అంటారు. ఈ వ్యాధిని ఎంటిరోటాక్సిమియా అని వాడుక భాషలో అయితే గడ్డి రోగం, మెడసారం, ముచు& వ్యాధి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. అలాగే ఈ వ్యాధితో ఒకేసారి పిడుగుపాటుకు చనిపోయినట్లుగా చనిపోతాయి. అందుకే ఈ వ్యాధిని నెత్తి పిడుగు వ్యాధి అని కూడా అంటారు. ఈ  చిటుకు వ్యాధి జూన్‌-జూలై మాసాలలో దొరొకే పచ్చిక తిన్న జీవాలలో వస్తుంది. సాధారణంగా చిటుక వ్యాధి లేత వయస్సు ఉన్న దృఢంగా, ఆరోగ్యంగా ఉన్న జీవాలలో, గొర్రెలలో ఎక్కువగా కనిపిస్తుంది.

వ్యాధి కారణాలు

గొర్రెల్లో అకస్మాత్తుగా గడ్డి ఎక్కువగా తినడం వల్ల పేగుల్లో అనరోబిక్‌ అనగా ఆక్సిజన్‌ తక్కువగా అవడం వల్ల క్లాస్రీటడియం ఫర్‌ఫ్రింజెన్స్‌-డి వల్ల వస్తుంది. ఈ బాక్టీరియా బద్దె పురుగులు కడుపులో ఉండటం వల్ల ఎక్కువగా అటు ఎప్సిలాన్‌ అనే విష పదార్థాన్ని విడుదల చేయడం వలన ఈ వ్యాధి వస్తుంది. పచ్చిగడ్డికి బదులు ఎండుగడ్డిని వేయడం లేదా ఒకేసారి మేతను మార్చడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.

వ్యాధి లక్షణాలు

సామాన్యంగా ఈ జీవాల్లో రోజంతా బాగుండి, తెల్లారేసరికి ఎక్కువ సంఖ్యలో జీవాలు ఎటువంటి లక్షణాలు లేకుండా హఠాత్తుగా గాల్లోకి ఎగిరి కిందపడి గిలగిలా కొట్టుకొని, పళ్లు బిగపట్టుకొని, కళ్ళను పైకి అని మరణిస్తాయి. వీటిలో శరీర ఉష్ణోగ్రత (104-106 డిగ్రీ ఫారెన్‌హీట్‌) ఉంటుంది. వ్యాధి అధికంగా ఉన్నపుడు నీరసంగా ఉండటం, పొట్టను తన్నుకొవడంతో పాటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయి గొర్రెలు చనిపోతాయి.

వ్యాధి చికిత్స

ఈ వ్యాధిలో గొర్రెలకు చికిత్స అంటూ లేదు. ఎందుకంటే ఈ వ్యాధి సోకిన జీవాలు అకస్మాత్తుగా మరణిస్తాయి. వ్యాధి దీర్ఘకాలికంగా సోకిన జీవాలకు పశువైద్యుని సలహా ప్రకారం పెన్సిలిన్‌ ఆంటిబయోటిక్‌ను క్రమం తప్పకుండా 5 రోజులు వాడాలి. రక్తనాళంలోకి డెక్ట్రెస్‌ సెలైన్‌ను ఎక్కించాలి. 

వ్యాధి నివారణ

వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయటం కష్టమని తెలిసింది కాబట్టి కొన్ని నివారణ చర్యలు పాటిస్తే మనం జీవాలను ఎంటరోటాక్సిమియా బారిన పడకుండా కాపాడవచ్చు. మే మాసంలో అనగా తొలకరి జల్లులు పడే కంటే ముందు ఈ టీకాను వేయించాలి. మరల 15 రోజుల తరువాత బూస్టర్‌డోస్‌ తప్పకుండా వేయించాలి. తొలకరి వర్షాలకు మొలిచిన, వాడిపోయిన లేతగడ్డిని జీవాలు మేయకుండా జాగ్రత్తపడాలి.

పిల్లలు పాలు తాగే స్థితి మంచి మేత, దాణాను ఒకేసారి మార్చకుండా క్రమక్రమంగా మార్చుకోవాలి. తొలకరి జల్లులు పడినప్పుడు కడుపునిండా పచ్చిమేత పెట్టకుండా, 3-4 గంటలు మాత్రమే మేసేలా చూడాలి. టీకాలు వేసే కంటే ముందు బద్దె పురుగులకు సంబంధించిన నట్టల మందును తాగించాలి.

ఈ వ్యాధి వస్తే అధిక సంఖ్యలో జీవాలు అకస్మాత్తుగా చనిపోయిన, జీవాల పెంపకందారులు తీవ్రమైన నష్టాలకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మే-జూన్‌ మాసాల్లో తప్పనిసరిగా చిటుక రోగ నివారణ టీకాలు వేయించాలి.

వ్యాధి నిర్ధారణ

గొర్రెలు తొలకరి జల్లులు పడినపుడు మేత ఎక్కువగా తిని ఒకేసారి ఎక్కువ సంఖ్యలో చనిపోయినపుడు మనం చిటుక వ్యాధిగా నిర్ధారించుకోవచ్చు. గొర్రెను కోసి చూసినట్లయితే పొట్టలో ఆకుపచ్చదనం కన్పిస్తుంది. చిన్న ప్రేగు ప్రారంభంలో గుండె మీద రక్తస్రావాలు గమనించవచ్చు. ముఖ్యంగా గొర్రె మూత్ర పిండాలు గుజ్జు గుజ్జు అవుతాయి. ఈ లక్షణాలను బట్టి మనం చిటుకు వ్యాధిగా నిర్ధారణ చేసుకోవచ్చు. ఇంకా నిర్ధారణ చేసుకోవాలంటే గొర్రె పొట్టలో పదార్థాన్ని ల్యాబ్‌కు పంపినట్లయితే దాన్ని ఎలుక తోకలోకి ఎక్కించి 24 గంటల్లో చనిపోయినట్లయితే ఎంటిరోటాక్సిమియా చిటుకు వ్యాధిగా నిర్ధారించవచ్చు.

డా. స్వేచ్ఛ మంగళగిరి, పి.జి. స్కాలర్‌, వెటర్నరీ పబ్లిక్‌ హెల్త్‌, ఎం.వి.ఎస్సీ., చెన్నై, ఇ-మెయిల్‌: addl.adilabad@gmail.com