నది వ్యవసాయక దేశం. అనాదిగా మన ప్రదాన వృత్తి వ్యవసాయం. అయినా కాని రైతులు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు అంటున్నారు. గిట్టుబాటు కాకపోయినా పంటల సాగు ఆగుతుందా? అంటే ఆగడము లేదు. పంటల సాగు నిరంతరం కొనసాగుతుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. రైతులు పంటల సాగు కొనసాగించడం వలననే కరోనా సమయంలో అన్ని ఆగినవి కానీ రైతు కాడి ఆగలేదు. కాబట్టి మన అవసరాలకు మించి ఆహారాన్ని అన్నదాతలు పండించగలిగారు. వరి ఉత్పత్తి పెరగబట్టే ప్రభుత్వాలు వరి సాగును నియంత్రించడం జరిగింది. అంటే రైతులకు పంటల సాగు గిట్టుబాటు అయినా, కాకపోయినా కూడా వ్యవసాయం ఆగడం లేదు. రైతులందరికీ పంటల సాగు గిట్టుబాటు కావడం లేదా? అంటే సమాధానం కాదు అని వస్తుంది. అంటే కొంతమంది రైతులు లాభాల సాగు చేస్తున్నారు. కొంతమంది రైతులు సాగులో నష్టాలను భరించవలసి వస్తుందనేది మన వ్యవసాయ రంగం సారాంశం. ఏది ఏమైనా కానీ వ్యవసాయంలో అవసరమైన అన్ని మెళకువలు అంటే పెట్టుబడులు తగ్గించుకొని, నాణ్యమైన దిగుబడి పొంది ఆ దిగుబడికి విలువ జోడించి నేరుగా వినియోగదారులకు అమ్మగలిగితే రైతులు తమ సాగులో లాభాలు గడించగలరు అని అనేకమంది రైతుల అనుభవాలు చెబుతున్నాయి. ఈ కోవకే చెందుతారు పశ్చిమగోదావరి జిల్లా రావులపాలెంకి చెందిన వీరారెడ్డి.

వీరారెడ్డి జీవితం అనేక మలుపులు తిరిగింది. ఒకానొక సమయంలో ఆర్థిక సమస్యల నుంచి బయట పడటానికి చెరకు సాగు మొదలు పెట్టారు. మొదటగా ఒక ఎకరంలో చెరకును పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించి ఆ చెరకును అదేవిధంగా చెరకుగా అమ్మకం చేసినట్లయితే సరైన ఆదాయం రాదు అని గ్రహించి చెరకుకు విలువ జోడించి రసం చేసి, చెరకు రసాన్ని నేరుగా వినియోగదారులకు అమ్మగలిగితే మంచి ఆదాయం వస్తుందని గ్రహించి ఆ దిశగా అడుగులు వేశారు. వీరారెడ్డి గారు కౌలుకు తీసుకున్న పొలం ప్రధాన రహదారి ప్రక్కనే ఉండడం వలన చెరకు రసంను మార్కెటింగ్‌ చేసుకోవడానికి అవకాశం కుదిరింది. తాను పండించే చెరకుకు ఎలాంటి రసాయనాలు వేయకుండా పశువుల ఎరువు తోలించడంతో పాటు అవసరాన్ని బట్టి ద్రవజీవామృతం, ఘనజీవామృతం లాంటివి అందిస్తూ వస్తున్నారు. ఇంకా అవసరమనుకుంటే ఫిష్‌ ఎమినో యాసిడ్‌ కూడా పంటకు అందిస్తూ వస్తుంటారు. చెరకు రసం తీసిన పిప్పిని కూడా బాగా కుళ్ళించి దానిని కూడా చెరకు సాగుకు ఉపయోగిస్తూ ఎలాంటి రసాయనాల అవసరం లేకుండా ఎకరానికి 40 టన్నులకు తగ్గకుండా చెరకు దిగుబడిని పొందుతూ ఆ దిగుబడిని రసం తీసి లీటరు 60/-ల చొప్పున అమ్ముతూ వస్తున్నారు. 

ఒక దుకాణంతో, ఒక ఎకరంతో మొదలైన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి 22 బ్రాంచిలకు, 22 ఎకరాలకు ఎదిగింది. ప్రస్తుతం వీరారెడ్డి గారు మొత్తం 22 ఎకరాలలో చెరకు పంటను సాగు చేస్తున్నారు. 22 ఎకరాల చెరకుగాను ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో 22 దుకాణాలను ఏర్పాటు చేసి సంవత్సరం పొడవునా చెరకు రసం మార్కెటింగ్‌ చేస్తూ వస్తున్నారు. చెరకు రసంలో ఉండే పోషకాలను వినియోగదారులకు తెలియపరుస్తూ శీతల పానీయాలకు బదులుగా చెరకు రసాన్ని వినియోగిస్తే లభించే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు తెలియపరుస్తూ రోజు రోజుకు తన వ్యాపారాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

చెరకు రసం తీయడానికి పలు రకాల మిషన్‌లు ఉపయోగించి చివరకు లక్షన్నర విలువ చేసే మిషన్‌ అయితే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకుని అన్నీ ఆ మిషన్లనే ఏర్పాటు చేశారు. మిషను మరియు దుకాణంకి కావలసిన అన్ని ఏర్పాట్లకు కలసి ఒక్కొక్క దుకాణానికి 8 లక్షల రూపాయలు ఖర్చు చేసి 22 బ్రాంచిలను ప్రారంభించి అన్ని బ్రాంచీలను విజయవంతంగా నడిపిస్తున్నారు. సొంత దుకాణాల ద్వారా చెరకు రసాన్ని అమ్మకం చేయడంతో పాటు శుభకార్యాలకు, పెళ్ళిళ్లకు, పంక్షన్లకు కూడా చెరకు రసాన్ని సరఫరా చేస్తున్నారు. ఇందుకుగాను ముందుగా వచ్చిన ఆర్డరు ప్రకారం అవసరమైన చెరకు ముక్కలను రిఫ్రిజిరేటర్‌లో పెట్టి అవసరమైన చల్లదనం వచ్చిన తరువాత ఆ చెరకు ముక్కలను కూల్‌ బాక్స్‌లో పెట్టి ఫంక్షన్‌ జరిగే ప్రాంతానికి చల్లబరచిన చెరకు ముక్కలు మరియు రసం తీసే మిషను తీసికెళ్ళి అక్కడకూడా తాజా చెరకు రసాన్ని తీసి అందిస్తున్నారు.

చెరకు సాగుకు కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. చెరకు విత్తనం నాటడానికి, సేంద్రియ పదార్థం అందించటం, చెరకు నరకడము ఇలాంటి పనులన్నింటికి కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే చెరకును చెరకు రసంగా మార్చాలంటే కూలీల అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది. చెరకు గడను పై చెత్త తొలగించడం, ఉప్పు నీటిలో ఒకసారి, మంచి నీటిలో ఒకసారి కడగడం, శుభ్రంగా కడిగిన గడలను ముక్కలుగా కట్‌ చేసి ట్రేలలో అమర్చడం, కట్‌ చేసే సమయంలో ఏదైనా తెగులు ఆశించిన భాగాన్ని తొలగించడం, సిద్ధమైన చెరకు ముక్కలను అవసరమైన ప్రాంతానికి రవాణా చేయడం లాంటి వాటన్నింటికి కూలీల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందుకుగాను వీరారెడ్డి గారు మొత్తం సుమారుగా 150 మంది కూలీలను నియమించుకుని ప్రతినిత్యం వారికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు.

మామూలుగా చెరకును అదేవిధంగా చెరకు ఫ్యాక్టరీకి అమ్మకం చేసినట్లయితే టన్నుకు 3000/-ల వరకు రావచ్చు. అదే చెరకు రసం చేసే వారికి అమ్మకం చేసినట్లయితే టన్నుకు 5000/-ల వరకు రావచ్చు. అదే తానే సొంతంగా చెరకు రసాన్ని తీసి అమ్మినట్లయితే టన్ను చెరకు నుంచి 30000/-ల స్థూల ఆదాయం పొందవచ్చు. టన్ను చెరకు నుంచి 500 లీటర్ల చెరకు రసం పొందవచ్చు. లీటరు 60/-లకు అమ్మకం చేసినా కూడా 30,000/-ల స్థూల ఆదాయం వస్తుంది. ఈ రకంగా వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించగలిగితే రైతు లాభా బాటలో నడవడం తధ్యం అని వీరారెడ్డి నిరూపిస్తున్నారు. చెరకుతోపాటు కొద్ది ప్రాంతంలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు కూడా పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్నారు. మరిన్ని వివరాలు 95333 61515 కి ఫోను చేసి తెలుసుకోగలరు.        

ఎకరానికి 9 లక్షల ఆదాయం

చెరకు అందరికీ తెలిసిన పంట. రసాయనాలతో చెరకును పండించేవారు ఎకరానికి 60 టన్నులకు పైబడే దిగుబడి తీస్తున్నారు. ఏది ఏమైనా కానీ సగటున కనీసం 40 టన్నుల వరకు తీస్తున్నారు. సేంద్రియ సాగు పద్ధతులు వచ్చిన తరువాత చెరకు రైతులు సేంద్రియబాట పడుతున్నారు. మిగతా పంటలతో పోల్చుకుంటే చెరకు సేంద్రియ సాగుకు బాగా అనుకూలం. అన్ని మెళకువలు సక్రమంగా తీసుకోగలిగితే చెరకులో సేంద్రియ పద్ధతులు పాటించిన మొదటి సంవత్సరం నుంచే రసాయనాలతో సమానంగా దిగుబడి తీయవచ్చని అనేకమంది రైతులు నిరూపిస్తున్నారు. వీరారెడ్డిగారు 22 ఎకరాలలో చెరకును సాగు చేస్తూ ఎకరానికి సంవత్సరానికి సగటున 30 టన్నుల దిగుబడి తీస్తున్నారు. చెరకును రసం తీసి లీటరు 60/-లకు తగ్గకుండా అమ్మకం చేస్తున్నారు. టన్ను చెరకు నుంచి 500 లీటర్లకు తగ్గకుండా చెరకు రసం వస్తుంది. లీటరు 60 రూపాయలు చొప్పున 500 లీటర్లకు 30,000/- అంటే టన్ను చెరకు 30,000/-లు. ఎకరానికి 30 టన్నుల దిగుబడి సాధిస్తూ, 30 టన్నుల చెరకును రసం తీసి అమ్ముతూ టన్ను చెరకు నుంచి 500 లీటర్లు అంటే 30 టన్నుల చెరకు నుంచి 15000 లీటర్ల రసం పొంది లీటరు 60/-ల చొప్పున మొత్తం ఎకరం చెరకును చెరకు రసం చేసి 9 లక్షల రూపాయల స్థూల ఆదాయం గడిస్తున్నారు. రసం తీయగా వచ్చిన పిప్పిని కుళ్ళించి మరలా చెరకు సాగుకు వినియోగిస్తున్నారు కాబట్టి సాగు ఖర్చులు కూడా తగ్గించుకుంటున్నారు.