మన తెలుగు రాష్ట్రాల్లో పండించే అపరాల్లో పెసర, మినుము ముఖ్యమైనవి. సుమారుగా 65-80 రోజుల్లో కోతకు వచ్చే ఈ పంటలు 1.5 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతున్నది. సాగు నీటి లభ్యత ఎక్కువగా ఉండటం వలన రైతులు వేసవి పప్పుధాన్యాల సాగు చేసుకోవచ్చు. పెసర, మినుము పంటలు తక్కువ కాల పరిమితి కల్గి ఉంటం వల్ల మరియు తక్కువ నీటి వసతి ఉన్నచోట కూడా పండించేందుకు అనుకూలంగా ఉంటుంది. అన్ని కాలాల్లో పండించే ఈ పప్పు దినుసులు మన ఆహారంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.


మానవ శరీరానికి అవసరమైన మాంసకృత్తులు, ఖనిజ లవణాలను అందించడమేకాకుండా నత్రజని స్థిరీకరణ ద్వారా నేలను సారవంతం చేస్తుంది. పప్పుదినుసులు తలసరిగా రోజుకు 80 గ్రా. తీసుకోవలసి ఉండగా ప్రస్తుతం కేవలం 31 గ్రా. మాత్రమే అందుబాటులో వున్నాయి. ఈ వ్యత్యాసాన్ని పూడ్చడానికి ప్రస్తుతం మన భారతదేశం 3 మిలియన్‌ టన్నుల అపరాలను దిగుమతి చేసుకుంటుంది. పెసర, మినుము మనకు కావాల్సిన మాంసకృత్తులు అందించడమే కాకుండా పంట మార్పిడి జరిగి భూసారం పెరిగి ప్రధాన పంటల్లో స్థిరమైన దిగుబడి సాధించుటకు దోహదపడుతుంది.

మినుము, పెసర సాగులో సమస్యలు:

*    అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోకపోవడం నిస్సారమైన భూముల్లో వర్షాధారంగా సాగుచేయడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, చౌడు విస్తీర్ణం పెరగటం

*    సరైన సమయంలో కలుపు నివారణ చేయకపోవటం వరి మాగాణుల్లో ఊద మరియు బంగారు తీగ ప్రధాన సమస్య

*    తెగుళ్ళకు, పురుగులకు లొంగిపోవటం- తెగుళ్ళల్లో పల్లాకు, మొవ్వుకుళ్ళు, ఆకుముడత, ఎండు తెగులు, బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు మరియు పురుగుల్లో మారుకా మచ్చల పురుగు, రసం పీల్చే పురుగులు, పొగాకు లద్దె పురుగు ప్రధాన నష్టాన్ని కలుగజేస్తున్నాయి.

*    పండించిన పంటకు సరైన ధర రాకపోవడం. కాబట్టి రైతులు సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేస్తే, వాణిజ్య పంటలతో పోటీగా ఆదాయాన్ని పొందవచ్చు.
వేసవి పెసర/మినుము సాగు అవకాశాలు: 

ఈ అపరాల సాగుకు సుమారు 300 మి.మీ. నీరు అవసరం ఉంటుంది. కొద్దిపాటి నీటిసదుపాయం ఉన్న రైతులు కీలక థల్లో 3-4 నీటితడులు ఇచ్చినట్లయితే ఈ పంటలను సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు. వాణిజ్య పంటలైనటువంటి ప్రత్తి, మిరప, పసుపు అలాగే యాసంగి మొక్కజొన్న, వేరుశనగ, వరి తీసిన తరువాత ఖాళీగా ఉన్న భూముల్లో పెసర, మినుము సాగుచేయవచ్చు. వేసవిలో సాగుచేసే పెసర, మినుము పంటల్లో చీడపీడల బెడద తక్కువగా ఉండటం వలన తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చు.
నేలలు: 

నీటి వసతి కలిగిన ఎర్ర నేలలు, సారవంతమైన మురుగు నీరుపోయే సౌకర్యం గల నల్ల నేలలు కూడా అనుకూలం. నీరు బాగా ఇంకి తేమను పట్టి ఉంచే మధ్యస్థ బరువైన నేలలు అనుకూలమైనవి. సమస్యాత్మక భూములు ముఖ్యంగా చౌడు భూములు ఈ పంటల సాగుకి పనికిరావు.

అనువైన రకాలు: 

పెసర: యంజిజి-295, యంజిజి-347, యంజిజి-348, యంజిజి-351, యంజిజి-385, డబ్ల్యుజిజి-37, డబ్ల్యుజిజి-42, ఐపియం-2-14, టియం-96-2.; మినుము: యంబిజి-207, డబ్ల్యుబిజి-26, పియు-31, ఎలిబిజి-752, ఎల్బిజి-787, టిబిజి-104, జిబిజి-1
వేసవికి అనుకూలమైన పెసర రకాలు – లక్షణాలు :

యంజిజి-295: కాపు పైభాగాన గుత్తులుగా వస్తుంది. గింజ మధ్యస్థ లావుగా ఉండి, సాదాగా ఉంటుంది. మొవ్వుకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. పంట కాలం 65-70 రోజులు, దిగుబడి: 5-6 క్వి/ ఎకరానికి.

యంజిజి-347: కాపు పైభాగాన ఉండి ఒకేసారి కోతకు వస్తుంది. ముదురు ఆకుపచ్చ మరియు సాదా గింజలు. పల్లాకు తెగులు మరియు బెట్టను కొంత వరకు తట్టుకుంటుంది. పంట కాలం 60-65 రోజులు. దిగుబడి : 5-6 క్వి/ఎకరం.

యంజీజీ-348: గింజ మధ్యస్థ లావుగా ఉండి, లేత ఆకుపచ్చలో సాదాగా ఉంటుంది. బెట్టను కొంత వరకు తట్టుకుంటుంది. పంట కాలం : 65-70 రోజులు. దిగుబడి: 5-6 క్వి/ఎకరం.

యంజిజి-351: లేత ఆకుపచ్చ, సాదా, మధ్యస్థ లావు గింజ ఉండి, పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. పంట కాలం 70 రోజులు. దిగుబడి 6-6.5 క్వి/ఎకరం.

యంజిజి-385: మొక్కలు నిటారుగా, గుబురుగా పెరిగి కాయలు గుత్తులుగా వ్యాపించి ఉండి ఒకేసారి కోతకు వస్తుంది. గింజలు మధ్యస్థ లావుగా, ముదురు ఆకుపచ్చగా మెరుస్తూ ఉంటాయి. మొవ్వుకుళ్ళును, ఆకుముడతను సమర్ధవంతంగా తట్టుకుంటుంది. పంట కాలం : 70-76 రోజులు. దిగుబడి 6-6.4 క్వి/ఎకరం.

డబ్ల్యుజిజి-37: గింజ మెరుస్తూ మధ్యస్థ లావుగా ఉండి, ఒకేసారి కాపుకు వచ్చి పల్లాకు తెగులును తట్టుకుంటుంది. పంట కాలం 60-65 రోజులు. దిగుబడి 5-6 క్వి/ఎకరం.

డబ్ల్యుజిజి -42: పొడవైన కాయలు, లావు పాటి మెరుపు గింజలు కలిగి, పల్లాకు తెగులును సమర్ధవంతంగా తట్టుకునే రకం. పంట కాలం 55-60 రోజులు. దిగుబడి 4-5 క్వి/ఎకరం.

టీయం-96-2: గింజలు లావుగా ఉండి, బూడిద తెగులును తట్టుకునే పాలిష్‌ రకం. వరి మాగాణుల్లోకి అనువైనది. పంట కాలం 60-65 రోజులు. దిగుబడి 5-6 క్వి/ఎకరం.

ఐపియం-2-14: మొక్క నిటారుగా పెరిగి ఒకేసారి కోతకు వచ్చి, మధ్యస్థ లావు గింజలు కలిగి, పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్‌ రకం. పంట కాలం 60-65 రోజులు. దిగుబడి : 5-6క్వి/ఎకరం.
వేసవికి అనుకూలమైన మినుము రకాలు – లక్షణాలు

యంబిజి-207: పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్‌ రకం. పంట కాలం 75-80 రోజులు. దిగుబడి 7.2-8 క్వి/ఎకరం. వరి మాగాణులకు అనువైన రకం.

డబ్ల్యుబిజి-26: అన్ని కాలాలకు అనువైన సాదా రకం. కణుపుల మధ్య దూరం తక్కువ. గుత్తుల కాడ చిన్నగా ఉండి, కాయలు ఎక్కువ. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. దిగుబడి 4-4.8 క్వి/ఎకరం.

పియు-31: అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకునే సాదా రకం. కాయల మీద నూగు ఉంటుంది. తక్కువ కాల పరిమితి గల రకం. పంటకాలం 65-70 రోజులు. దిగుబడి 6-6.8 క్వి/ఎకరం.

యల్బిజి-752: అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకొనే పాలిష్‌ రకం. వరి మాగాణుల్లో ఆలస్యంగా విత్తుకొనుటకు అనువైన రకం. పంట కాలం 75-80 రోజులు. దిగుబడి 8-8.5 క్వి/ఎకరం.

ఎల్బిజి-787: అన్ని కాలాలకు అనువైన, మధ్యస్థ కాల పరిమితి కలిగి పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్‌ రకం. కాయలు ప్రధాన కాండం మీద కణుపుల వద్ద కూడా కాస్తాయి. పంట కాలం 75-80 రోజులు. దిగుబడి 8.0-8.8 క్వి/ఎకరం.

టిబిజి-104: అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును తట్టుకొనే పాలిష్‌ రకం. కాయలపై నూగు ఉంటుంది. పంట కాలం 70-75 రోజులు. దిగుబడి 5-6 క్వి/ఎకరం.

జిబిజి-1: అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్‌ రకం. కాయలపై నూగు ఉంటుంది. పంట కాలం 70-75 రోజులు. దిగుబడి 5-6 క్వి/ఎకరం.
నేల తయారీ: యాసంగి పంట తీసేసిన తరువాత కలుపు మొక్కలు, పంట అవశేషాలు లేకుండా నేల విత్తుటకు సిద్ధం చేయాలి. భూమిని 2-3 సార్లు బాగా దున్ని, 2 సార్లు గుంటక తోలి, చదును చేయాలి. వీలైతే ఒక నీటి తడి ఇచ్చి కూడా విత్తనాన్ని విత్తుకోవచ్చు.

విత్తనం/విత్తే పద్ధతి: ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసర ముంటుంది. గొర్రుతో సాళ్ళ మధ్య 22.5-25 సెం.మీ. (9-10 అంగుళాలు), మొక్కల మధ్య 10 సెం.మీ. (4 అంగుళాలు) ఉండేలా వరుసల్లో విత్తుకోవాలి.
విత్తే సమయం: వేసవిలో సాగుచేయడానికి ఫిబ్రవరి నుండి మార్చి మొదటి పక్షం వరకు పెసర, మినుము పంటలు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తినప్పుడు పూత, కాయ థల్లో ఉష్ణోగ్రత పూత రాలటం, గింజ కట్టడం వంటి సమస్యల దిగుబడి తగ్గే ప్రమాదముంది. 19

కలుపు యాజమాన్యం:  విత్తిన 25 రోజుల వరకు పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.

అంతరకృషి: విత్తనం ఎద బెట్టిన పంటల్లో సాళ్ళ మధ్య గొర్రుతో కాని, గుంటకతోగాని 20-25 రోజుల సమయంలో అంతరకృషి చేసుకున్నట్లయితే కలుపు నివారించబడి పంట ఏపుగా పెరుగుతుంది. అదే విధంగా బెట్ట పరిస్థితుల నుంచి పంటను కొంతవరకు కాపాడుకోవచ్చు. 

కసనబోయిన క్రిష్ణ, పిహెచ్‌.డి. స్కాలర్‌,

ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.

 జి. పరిమళ, బాదవత్‌ కిషోర్‌, పిహెచ్‌.డి. స్కాలర్‌,

బిధాన్‌ చంద్ర కృషి విద్యాలయం, మోహన్‌పూర్‌, వెస్ట్‌ బెంగాల్‌; 

నందిగాం స్వాతిరేఖ, పిహెచ్‌.డి. స్కాలర్‌,

ఆచార్య ఎన్‌.జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌