చిటుకు వ్యాధి బాగా మేసి బలిష్టంగా ఉన్న గొర్రెల్లో, మేకల్లో వస్తుంది. క్లాస్ట్రీడియం పెర్‌ఫ్రింజెన్స్‌(టైప్‌-డి) అనబడే సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉన్న జంతువుల పేగులలో చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఆహారంలో పిండి పదార్థాల శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూక్ష్మజీవులు వృద్ధి చెంది విష పదార్థాలను విడుదల చేస్తాయి. అతిగా తినడం వల్ల వస్తుంది కాబట్టి దీనిని తినే వ్యాధి అంటారు. ఈ వ్యాధి సోకిన కొద్ది సమయంలోనే తీవ్రరూపం దాల్చడం వల్ల గొర్రెలు చిటికెలో మరణిస్తా యి. అందువల్ల దీనిని చిటుకు రోగంగా పిలుస్తారు. ఈ రోగం వస్తే జీవాలను రక్షించడం చాలా కష్టం. అందువలన గొర్రెల కాపలదారులు జాగ్రత్త వహించాలి. 

వ్యాధి ఎలా వస్తుందంటే?: 

గొర్రె లేదా మేక పిల్లలు చాలా ఎక్కువగా పాల ను తాగినప్పుడు, ఎక్కువగా దాణా మేసినప్పుడు, ఇతర వ్యాధులు సోకినప్పుడు, జీవాల్లో సహజ వ్యాధి నిరోధకశక్తి క్షీణించడం వల్ల, పరాన్నజీవులు జీవాల కడుపులో ఎక్కువగా ఉన్నప్పుడు, ఇతర ఏవైనా కారణాల వల్ల పేవుల కదలిక తగ్గినప్పుడు ఈ వ్యాధి ప్రబలుతుంది.


లక్షణాలు: 

ఈ వ్యాధి సోకిన జీవాలు అకస్మాతుగా మేత మేయడం మానేస్తాయి. పొట్ట భాగాన్ని కాళ్లతో కొట్టుకోవడం, తరచు కిందికి పైకి లేవడం, పక్కలకి తిరిగి పడుకోవడం వంటివి చేస్తాయి.సూక్ష్మజీవులు విడుదల చేసిన విష ప్రభావం మెదడుపై ప్రభావం చూపడం వల్ల కాళ్లు చాపి తల మెడ భాగం వెనక్కి విరుచుకోవడం చేస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన కొద్ది నిమిషాల్లోనే జీవాలు చనిపోతాయి. సూక్ష్మజీవులు విడుదల చేసిన విషపదార్ధల వలన కొన్నిసార్లు, జీవాలు విడుదల చేసిన విషపదార్థాల వల్ల కొన్నిసార్లు జీవాల్లో పారుడు, విరేచనాల లక్షణాలు కనబడతాయి. వ్యాధితో మరణించిన గొర్రెలలో మూత్రపిండాలు లావుగా, మెత్తగా మారిపోతాయి. సూక్ష్మజీవుల విషపదార్ధాల వల్ల పేగులు నల్లగా మారిపోతాయి.


చికిత్స: 

తీవ్రమైన థలో ఈ వ్యాధి చికిత్సకు నయం కాదు. గొర్రె లేదా మేక పిల్లలకు 5మి.లీ యాంటి టాక్సిన్‌ను చర్మం కింది పొరల్లో ఇవ్వాలి. తద్వారా మనం వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. వ్యాధి తీవ్రతను తక్కువగా ఉన్నప్పుడు పెన్సిలిన్‌ గొర్రె బరువును బట్టి ఇవ్వాలి. యాంటిసిడ్‌ యాంటి బ్లోట్‌ మందులను తాగించాలి. థయామిన్‌(బి1) విటమిన్‌ను కండకు ఇంజక్షన్‌ చేయాలి. విష పదార్థాల ప్రభావం తగ్గించడానికి కార్టికోస్టిరాయిడ్స్‌ రక్తము ద్వారా ఇవ్వాలి.


నివారణ చర్యలు: 

జీవాలకు పిండి పదార్థాలు దాణా ఎక్కువ మోతాదులో పెట్టకూడదు.గొర్రె, మేక పిల్లలకు దాణాలో ఇచ్చే పెల్లెట్ల మోతాదును 3-4 బాగాలుగా విభచించి ఇవ్వాలి. ప్రతి సంవత్సరం పశు సంవర్ధక శాఖ వారు ఏప్రిల్‌, మే నెలలలో చిటుకు వ్యాది నివారణ టీకాలు పంపిణీ చేస్తుంది. ఈ టీకా మందుని మొదటిసారి ఆరు వారాల పైబడిన పిల్లలన్నింటికి ఇచ్చి ఆ తర్వాత మూడు వారాల లోపు రెండవ డోస్‌ ఇప్పించాలి.అంతే కాకుండా ప్రతి సంవత్సరం ఈ టీకాలును క్రమం తప్పకుండా చేయించాలి.గర్భంతో ఉన్న జీవాలకు ఈనటానికి 2-3వారాల ముందు ఈ టీకా మందు ఇస్తే పుట్టే పిల్లలకు 8 వారాల వరకు ఈ వ్యాధినుంచి రక్షణ కలుగుతుంది.   
డా. జి. రాంబాబు, పశు వైధ్యాధికారి, కడప. ఫోన్‌: 9618499184