గుడ్ల ఉత్పత్తికి లేదా మాంసానికి బ్రోయలర్ కోళ్ళు పెంచేందుకు కోళ్ళఫారాల్లో అపుడే పుట్టిన పిల్లలను పెంచి పెద్ద చేయడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమము. కోడిపిల్లల ఉత్పత్తి సంస్థలో ఎక్కడో జన్మించిన నవజాత కోడిపిల్లలు రైలులో, మోటారు వాహనాలలో, విమానంలో గంటల/రోజుల తరబడి ప్రయాణించి మన ఫారంలో అడుగుపెడతాయి. అవి చురుకుగా ఆరోగ్యంగా కనువింపుగా ఉంటె వాటిని దింపుకొని బ్రూడింగ్ చేస్తాము. దింపుకునే ముందు ఆ పిల్లలు మంచిగా, బాగుగా ఉన్నాయని నిశ్చయించుకున్న తరువాతనే దించుకుంటాము. చురుకుగా ఉంటె పిల్లలు నాణ్యంగా ఉన్నాయని ఊహించుకుంటాము. కోడి పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా, మంచిగా ఉండాలి. గలగల్లడుతూ బ్రూడింగ్ ప్రదేశంలో తిరగాలి. నీళ్ళు తాగాలి. మేతమేయాలి. పరిమాణంలో వ్యత్యాసం ఉండకూడదు. పెట్టెల్లో నలగకుండా ఉండాలి. ఎక్కువ సంఖ్యలో మరణించి ఉండరాదు. సాధారణంగా ఇవే మనం చూస్తాము.
కాని కోడిపిల్లల ఉత్పత్తి కేంద్రం వారి లెక్కలు వేరుగా ఉంటాయి. గుడ్ల నుండి ఎంత శాతం పిల్లలు పోదిగాయి? పెంకును పగలగోట్టి రాలేనివి (ఆరిచీచీరిదీవీ) ఎన్ని? 3 రోజుల మరణాల శాతం ఎంత? పిల్లల మధ్య వ్యత్యాసం అధికంగా ఉందా? అనే దానిపై లెక్కలు కట్టి కోడి పిల్లల ఉత్పత్తిలో మెరుగులు దిద్దుకుంటారు. కాని వాణిజ్య పద్దతులలో మనం పెంచే కోళ్ళ ఫారంలో పరిస్థితులు వేరు. వేసవిలో వేడి, వర్షాకాలంలో తేమ, తడి, శీతాకాలంలో చల్లదనం, ప్రయాణంలో ఆటంకాలు, ప్రయాణ సమయంలో ఒత్తిడి ప్రతీసారి ఒకే విధంగా ఉండవు. తడవ తడవకు మారుతూ ఉంటాయి. అదే వాహనం రెండు మూడు ఫారాల్లో వేరు వేరు చోట్ల పిల్లలను దించి రావడం వలన మనకు దిగుమతి ఆలస్యం కావచ్చును. లేదా మనకే ముందు దిగవచ్చును. అందువలన పిల్లలు అనుకున్న సమయానికి మన ఫారంలో అడుగు పెట్టడం యల్లకాలం సాధ్యంకాదు.
మంచి కోడిపిల్ల లక్షణాలు ఏమిటి?
ఏడు రోజులకు కోడిపిల్ల బరువా! కొద్ది రోజులలో తక్కువ మేత తిని ఎక్కువ బరువు రావడమా! అతి తక్కువ మరణ శాతమా! గుడ్ల ఉత్పత్తి అధికమా! ఇవన్నీ మన పెంపకం, పాలన, మేత, పారిశుద్ధ్యం, రోగనిరోధక శక్తి పై ఆధారపడి ఉంటాయి. మరి రోజు వయసు కోడిపిల్ల బాగుండడం, బాగాలేకపోవడం అంటే ఏమిటి? మంచిరకం పిల్లలకు నాసి రకం పిల్లలకు తేడా ఏమిటి? మంచివాటినుండి చెడ్డవాటిని గుర్తించడం ఎలా? మంచివని, నాసివని, బాగాలేవని కంటి చూపు తో అంచనా వేస్తున్నాము. చెడు రకాలను నిర్నయిస్తున్నాము. ఒక్కొక్కసారి కంటి చూపు మంచి చెడులను నిర్ణయించడములో విఫలమవ్వచ్చును. నాణ్యతను కంటిచూపుతో నిర్ణయించలేము. ఖచ్చితంగా చెప్పలేము గనుక కొన్ని పరీక్షల ద్వారా అనుబంధ ప్రమాణాలను (ఆబిజీబిళీలిశిలిజీరీ) గుర్తించడం జరుగుతుంది. అవి ఏమంటే…
1. చురుకుదనం (Activity): కోడిపిల్లలు అట్టపెట్టె నుండి తీయగానే పరుగులు పెడతాయి. కలివిడిగా ఉంటాయి. నీరు ఆహారం కొరకు వెతుకుతాయి. బంతుల్లా గలగలా తిరుగుతూ ఉత్తేజంగా ఉంటాయి. వాతావరణం చల్లగా ఉంటే బ్రూడర్లో వేసిన వెంటనే వేడి కొరకు వెతుక్కుంటాయి. ఒకదానికొకటి హత్తుకుంటాయి. వేడిగా ఉంటే దూరంగా జరుగుతాయి. అరచేతిలో లేదా నేలపై వెల్లకిలా పండ బెడితే మూడు సెకన్లలో తిరగబడి కాళ్ళపై నిలబడతాయి.
2. అగుపడడం: శుభ్రంగా, పొడిగా ఉండాలి. ఎక్కడా తడిగా ఉండరాదు. శరీరానికి పెంకులు, పొరలు అంటుకుని ఉండరాదు. మెడ వెనుక భాగం ముదర రంగు ఉండరాదు.
3. ఉదరము: కడుపు సమానంగా ఉండాలి. ఉబ్బరంగా, నిండుగా, పెద్దగా ఉంటే పచ్చసొన అధికంగా ఉన్నట్లు గ్రహించాలి. పచ్చసొన అధికంగా ఉంటే అనారోగ్యానికి దారి తీస్తుంది. కోడిపిల్ల మనదగ్గరకు పొదిగిన వెంటనే రాదు. కొన్ని గంటల సమయం పడుతుంది. అన్ని పిల్లలూ ఒకేసారి గుడ్డునుండి బయటపడవు. బలంగా పెద్దగా ఉన్నవి పెంకు పగలకొట్టి ముందు బయట పడతాయి. చిన్నవి బలహీనంగా ఉన్నవి తరువాత బయటకొస్తాయి. వాటిని హేచరిలో పెద్దపిల్లలను చిన్న పిల్లలను వేరు వేరు గుంపులుగా వర్గీకరిస్తారు. పిల్లలను వేరు చేయడం అంటే పరిమాణాలను గుర్తించి పెద్దవాటినుండి చిన్నపిల్లలను బుల్లి పిల్లలను విడివిడిగా ఉంచడం. గుడ్లపెట్టె కోడిపిల్లలు అయితే పుంజు పిల్లలను వేరు చేసి పెట్టపిల్లలను మాత్రమే పంపుతారు. ఇలాచేయడం చాలా సమయం తీసుకుంటుంది. అదీగాక టీకా మందులు వేయడం ఉంటుంది. ప్రతీ పిల్లను చేతిలోకి తీసుకుని టీకా వేయడం సమయంతో కూడుకొన్న పని. అన్నిటికీ టీకా వేయడానికి 6 నుండి 8 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే వేలసంఖ్యలో పిల్లలు పొదిగి బయటకు వస్తాయి. కొన్ని హేచరీలలో టీకాలను కోడి పిల్లలపై పిచకారి చేస్తారు. ఈ పనులన్నీ జరిగిన పిదప అట్ట పెట్టెలలో ఉంచి మోటారు వాహనంలో ఉంచుతారు. అది కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి మనదగ్గరకు రావడానికి కనీసం 10 నుండి 20 గంటలు సమయం పడుతుంది. మధ్యలో రెండు మూడు ఫారాల్లో కోడిపిల్లలను దింపడం కూడా జరగవచ్చు. ఈ సమయంలో పచ్చసొనలో ఉన్న పోషక పదార్ధములే కోడిపిల్లకు ఆహారం. ఈ ప్రక్రియలో పచ్చసొన నెమ్మదిగ కరిగిపోవడంతో ఉదరం సమంగా ఉంటుంది. ఉదరం పొంగి గట్టిగ బిరుసుగా అగుపిస్తే ఆ కోడిపిల్ల పొట్టలో పచ్చసొన ఇంకా మిగిలిఉందని పూర్తిగా వినియోగం కాలేదని తెలియచేస్తుంది. ఎక్కువగా ఉంటే పచ్చసొన కరగలేదని అర్ధం. పచ్చసొన కరగలేదంటే కోడిపిల్ల అనారోగ్యంగా ఉన్నట్లు గుర్తించాలి.
4. కళ్ళు: విప్పారి స్పష్టంగా మెలుకువగా వెలుగులు పంచే కళ్ళు ఆరోగ్యాన్ని సూచిస్తాయి. మూసుకుపోతున్న కళ్ళు అలిసిన డస్సిపోయిన నీరసించిన పరిస్థితిని తెలియచేస్తాయి. మూతపడిన కళ్ళలో జీవం ఉండదు. అటువంటి కోడిపిల్లలు బ్రతకడం కష్టం. ఒకవేళ బ్రతికినా పుంజుకుని ఇతర పిల్లలతో సమానంగా వృద్ధి చెందడం వీలు పడదు.
5. కాళ్ళు : మోకాళ్ళు ఎర్రగా ఉండడం మంచిదికాదు. కోడిపిల్ల రవాణాలోగాని, హేచింగ్ లో గాని ఇబ్బందులకు గురి అయినదని తెలియచేస్తాయి. మోకాళ్ళు వాచి ఉండరాదు. గాయాలుంటే నడవడం యిబ్బంది అవుతుంది. నేల మీద నిలవగలుగుతున్నదా, నడవగలుగుతున్నదా గమనించాలి. కాలి వేళ్ళు బాగున్నవా లేదా చూడాలి. ఒక్కొకసారి మూడు కాళ్ల పిల్లలు, ఒంకర కాళ్ల పిల్లలు, కుంటివి రావచ్చును.
6. బొడ్డు : బొడ్డు రంధ్రము పూర్తిగా మూయబడి ఉండాలి. చర్మము శరీరం రంగుతో కలిసి పోయుండాలి. నల్లటి మచ్చ, వేలాడుతున్నతీగ, మూతపడని బొడ్డు ఉన్న పిల్లలు వస్తాయి. అటువంటి వాటిని వేరు చేయడం మంచిది. అలా ఉంటే మంచిదికాదు.
7. పొరలు: గుడ్డునుండి పిల్ల బయటకు వచ్చిన తరువాత కొద్దిసేపటకి శరీరం గాలికి ఆరి విప్పారుతుంది. బొచ్చు సున్నితంగా మెత్తగా దూదిలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పిల్లను చుట్టి ఉండే పొరలు సైతం విడిపోతాయి. ఫారంలో ప్రవేశించిన పిల్ల శరీరం పై ఏ విధమైన పొరలు, గుడ్డు తాలూకు పెంకులు లేకుండా ఉండాలి.
8. పచ్చసొన: ఎండిపోయిన పచ్చసొన దాని ఆవశేషాలు కాళ్ళపై ఇతర భాగాలపై కనిపించకూడదు. కోడిపిల్ల ఎలా ఉంది అని అడిగితే నలుగురు నాలుగు రకాలుగా చెబుతారు. గనుక కోళ్ళఫారంలో పనిచేసే అందరికి ఎంతోకొంత అవగాహన ఉండడం మంచిది. యజమాని దూరంగా ఉన్నపుడు ఫారంలో పనిచేసేవారు రోజు వయసున్న కోడిపిల్లలను దించుకోవలసి వస్తుంది. వారి విచక్షణా జ్ఞానం యజమానికి మేలు చేస్తుంది. పిల్లలు వచ్చే సమయం తెలియదు. చాలా కోళ్ళఫారాలలో సాధారణంగా పనివారే పిల్లలను స్వీకరించి బ్రూడింగ్ చేస్తుంటారు. కోడిపిల్ల ఆరోగ్యంగా ఉత్తేజంగా ఉంటే వీపుపై పడుకోబెట్టిన 3 సెకన్లలో తన కాళ్ళపై నిలబడి పరుగులు పెడుతుంది. చివరి రెండుమూడు రోజులందు పెంకును పగలగొట్టి పిల్ల బయటపడుతుంది. ఆ సమయంలో హేచర్నందు ఎక్కువ వేడి, గాలిలో తేమ ఉంటే జీవక్రియల సంయమనం కుదరక ఉదరం పెద్దగా మందంగా ఉండడం నీరు నిలిచి ఉండే అవకాశాలుంటాయి. బొడ్డు పూర్తిగా మూసి, మానుపట్టి ఉంటే కోడిపిల్ల ఆరోగ్యంగా ఉన్నట్లే. గుదికాలు ఎరుపు రంగు ఉంటే పొదుగుతున్నపుడు వేడి ఎక్కువగా ఉందని అర్ధం. వేడి ఎక్కువగా ఉంటే ముక్కుపై ఎరుపు, రక్తం కారడం, రక్తపు చుక్కలు ఏర్పడతాయి. ఇంకా చిలకముక్కుపిల్లలు, వంకర ముక్కులు, వంకర కాళ్ళు, మూడు కాళ్ల పిల్లలు, గుడ్డివి అపుడపుడు వస్తూనే ఉంటాయి. వెంటనే గుర్తించకపోయినా రెండుమూడు రోజుల తరువాత అవే బయట పడతాయి.తల్లికోడి ఆరోగ్యం, ఆహారం, నివాసం, గుడ్ల సేకరణ, గుడ్లు శుభ్రం చేసే తీరు, గుడ్లు నిలవ ఉంచేవిధానం, పొదుగించే పధ్ధతి, పిల్లలను పరీక్షించి వేరుచేసే విధానం, టీకాలు, రవాణా, దూరం, సమయం మొదలగు విషయాలపై కోడిపిల్ల నాణ్యత ఆధారపడి ఉంటుంది. కోడిపిల్ల బాగుంటే మంచి ఫలితాలు పొందే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. తల్లికోళ్ళు ఒకే వయసులో ఉంటే వాటి గుడ్లు దాదాపుగా ఒకే బరువులో ఉండి వాటిపిల్లల బరువు సమానంగా ఉంటుంది. కాని వేలకొలది గుడ్లు పొదగవలసి వచ్చినపుడు వివిధ వయసున్న తల్లుల గుడ్లు కలిపి పొదిగించడం తప్పనిసరిగా జరుగుతుంది. అటువంటి పరిస్థితులలో గుడ్ల బరువు వేరుగా ఉంటుంది. గుడ్డు పెంకును పగలగొట్టి కొన్ని పిల్లలు ముందు కొన్ని వెనుక గంటల తేడాలో బయటకు రావడం వలన పిల్లల బరువులో వ్యత్యాసాలు, ఆకారంలో తారతమ్యాలు సాధారణం. ముందు పిల్లకు ఆఖరు పిల్లకు 20 నుండి 30 గంటల వ్యత్యాసం ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకనే పొదిగిన పిల్లలను బరువును బట్టి, పరిమాణాన్ని బట్టి వర్గీకరిస్తారు. ముందుగా పొదగిన పిల్లలు తరువాత పొదిగిన పిల్లలు ఒకేసారి మన ఫారానికి సరఫరా కావచ్చును. రెక్కలపై ఈకలను గమనిస్తే ముందు పొదగిన పిల్లల ఈకలు పెరిగినట్లు గుర్తించవచ్చు. పొదిగే గుడ్ల సంఖ్యను బట్టి, తల్లుల వయసును బట్టి కోడిపిల్లల బరువు పరిమాణంలో తేడాలుంటాయి. కోడిపిల్లల నాణ్యతను నిర్దేశించడానికి పాస్గర్ స్కోరులో అసంకల్పిత చర్యలు, పూడుకుపోయిన బొడ్డు, కాళ్ళు, ముక్కు, పచ్చసొన అవశేషాలు చూస్తారు. టోన (ఊళిదీబి) స్కోరు కూడా కోడిపిల్ల మంచి చెడులను నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. మన ఫారంలో కోడిపిల్ల అడుగుపెట్టిన వెంటనే బరువు తెలుసుకోవాలి. అన్ని బుట్టలనుండి చేతికి అందిన 10 పిల్లల చొప్పున 100 పిల్లలను తూయవచ్చును. తూయడానికి ప్రత్యేకంగా కోడిపిల్లలను ఏరకూడదు. లేదా నాలుగు ఐదు బుట్టల బరువులను కాటా వేసి కోడిపిల్ల సగటు బరువును తెలుసుకోవచ్చును. పిల్ల బరువు గుడ్డు బరువులో 66-67 శాతం ఉంటుంది. పొదగబడిన గుడ్డు బరువు తెలియనప్పటికీ మనకొచ్చిన పిల్లల బరువు తెలుసుకోవలసిన భాధ్యత మనకుంది. ఈ తూకాలవలన పిల్లలు అన్నీ సమానంగా ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. బరువు తక్కువగా ఉన్న వాటిని వేరుగా పెంచడం వలన వేగంగా వృద్ధి వృద్ధి చెందుతాయి. చిన్నాపెద్ద కలిసివుంటే చిన్న పిల్లలు వెనుకబడి ఉత్పత్తి సామర్ధ్యం కుంటుపడుతుంది. చిన్న పిల్లలు మేతకోసం పెద్దవాటితో పోటి పడాల్సి వస్తుంది. ఇంకా కొన్ని హేచరీలలో కోడిపిల్ల పొడవును కొలుస్తారు. తల దగ్గరనుండి గోరుచివర వరకు కొలతలను తీసుకుంటారు. దాని ప్రకారం ఎక్కువ పొడవు ఉన్న కోడిపిల్ల ఎక్కువ ఉత్పత్తులను ఇస్తుందని వారి అంచనా. ఏమైనా నవజాత కోడిపిల్ల బరువు, చురుకుదనం, కళ్ళు, కాళ్ళు, కడుపు మొదలగువన్నీ చక్కగా ఉండాలి. ఎన్ని పిల్లలు వచ్చాయో లెక్కపెట్టి తెలుకోవడం కూడా అవసరమే. పిల్లల సంఖ్యను బట్టి మేత, టీకాలు, మందులు వాడకం ఉంటుంది. ఎన్ని మరణించాయో తెలుస్తుంది. ఎన్నింటిని అమ్మేమో తెలుస్తుంది. ఎన్ని గుడ్లు పెట్టాయో తెలుస్తుంది. ఓ్పుష్ట్ర ఏమిటో కనుగొనవచ్చు. ఆర్ధిక వనరులను తదనుగుణంగా ఏర్పాటు చేసుకోవచ్చు. లాభాలను పెంచుకోడానికి, పాలనా పద్ధతులను మెరుగుపరచుకోవడానికి తోడ్పడుతుంది. తడవ తడవకు వచ్చిన పిల్లల వివరములు, ఉత్పత్తి చేసినవారి వివరములు, పంపిణి పద్ధతులు, సమయం, వాతావరణం ఎప్పటికప్పుడు పుస్తకములో నమోదు చేసుకోవాలి. ఈ విధంగా రాసిఉంచుకోవడం వలన తేడాలుంటే గ్రహించగలుగుతాము. తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు.
డా. నాగేశ్వరరావు, ఫోన్: 96521 05405
