మనది వ్యవసాయక దేశం అయినప్పటికీ వివిధ రకాల కారణాల వలన ఉన్నత చదువులు చదివిన రైతుల సంతానం వ్యవసాయరంగానికి దూరంగా ఉద్యోగ, వ్యాపార రంగాలలోకి వలసలు పోయి అందులో కొంతకాలం గడిచిన తరువాత కొంతమంది తిరిగి వ్యవసాయరంగంవైపు అడుగులు వేస్తున్నారు. వ్యాపార రంగంతో పోల్చుకుంటే ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఎక్కువగా తిరిగి వ్యవసాయ రంగంవైపు చూస్తున్నారు. కారణాలు ఏమయినా కాని మన వ్యవసాయ రంగానికి, మనదేశానికి ఇది శుభపరిణామం అని చెప్పవచ్చు. సాధారణంగా మన దేశంలోని ఎక్కువమంది యువతీయువకులు ప్రధాన ధ్యేయం ఉన్నత చుదువులు చదివి ఉన్నత ఉద్యోగాలలో చేరడం పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా వరకు అదేదారిలో నడుస్తున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలలో రాణిస్తూ వివిధ రకాల కారణాల వలన తిరిగి వ్యవసాయ రంగంలో అడుగుపెట్టడం వలన ఎప్పటి నుంచో వ్యవసాయంలో ఉంటూ అసంతృప్తితో కాలం వెల్లతీస్తున్న రైతులకు మనోధైర్యం పెరుగుతుందనడంలో సందేహం లేదు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం, పెద్దకూర్మపల్లికి చెందిన మల్లిఖార్జున రెడ్డి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వ్యవసాయరంగంలో అడుగుపెట్టి రాణిస్తున్నారు.
మల్లిఖార్జున రెడ్డిది వ్యవసాయ నేపథ్యం. వరి సాగులో మల్లిఖార్జున రెడ్డి నాన్నగారు అధిక దిగుబడులు సాధించారు. అందరిలాగానే ఉన్నత చదువులు చదివిన మల్లిఖార్జున రెడ్డి ఉద్యోగ రంగంలో కొనసాగుతున్నారు. ఆ సమయంలో మార్కెట్లో దొరికే పప్పులు, నూనెలు అన్నీ కూడా కల్తీలు కావడం, తన స్నేహితులు కొందరు క్యాన్సరుతో ఇబ్బందులు ఎదుర్కోవడం దగ్గర నుంచి చూడడం జరిగింది. వీటన్నింటికి పరిష్కారం ఆలోచించసాగారు. వాటికి మరియు తమ ఆరోగ్యాలకు పరిష్కారం సేంద్రియ వ్యవసాయం అని నమ్మి 9 సంవత్సరాలు చేసిన ఉద్యోగాన్ని వదలి స్వగ్రామంలోని తండ్రి చేస్తున్న పంటల సాగులో అడుగుపెట్టారు వ్యవసాయంలో అడుగుపెట్టగానే సరిపోదు, వస్తున్న సంపాదనని వదలుకొని వచ్చాడు కాబట్టి ఒక వైపు సంపాదన గురించి ఆలోచించాలి, రెండోవైపు మన భవిష్యత్ తరాలకు కలుషితం కాని నేలను, వాతావరణాన్ని, ప్రస్తుత తరాలకు అవశేషాలు లేని ఆహారాన్ని అందించాలి. వీటన్నింటికి సరైనదారి అదీను ఇప్పటి వరకు నేలలు రసాయనాలకు అలవాటు పడి ఉన్నాయి కాబట్టి ఒకేసారి మార్పుకు సహకరించకపోవచ్చు కాబట్టి మెల్లమెల్లగా రసాయనాలను తగ్గించుకుంటూ సేంద్రియ పదార్థాలు పెంచుకుంటూ వస్తే 5 సంవత్సరాలకి రసాయనాలను మానివేసి పూర్తి సేంద్రియ సాగుకి మరలడం జరిగింది. అంటే 2017 వ సంవత్సరం నుండి ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా పూర్తి సేంద్రియ పద్ధతులతో వరి, వస, పెసలు, మినుము, నూనెగింజల పంటలు పండించుకుంటూ వస్తున్నారు. పంటల సాగుతో పాటు సేంద్రియ సాగుకు అవసరమైన మనదేశీయ జాతి గోవులను పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటల సాగులో వినియోగిస్తున్నారు. వీటన్నింటితో పాటు రైతుకు అదనపు ఆదాయం కావాలంటే పంటల సాగు మరియు పశుపోషణతో ఆగకుండా సమీకృత సేద్యం తప్పనిసరి అని తెలుసుకుని గొర్రెలు, మేకలు, చేపలు, కోళ్ళు మొదలగు వాటిని పెంచుతూ తన సాగును లాభాల బాటలో నడిపిస్తున్నారు. 2021 ఖరీఫ్ మరియు రబీలలో 18 ఎకరాలలో వివిధ రకాల వడ్లను వెద పద్ధతిలో సాగు చేశారు. ఇందుకుగాను దుక్కిలో ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం అందించారు. ఆరుతడి పద్ధతిలో వరి పంటను సాగు చేశారు. ఆరుతడి పద్ధతిలో అయితే వేరువ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మొక్క రోగనిరోధక శక్తిని పెంచుకుని పెరుగుతుంది కాబట్టి చీడపీడల ప్రభావం తగ్గడంతోపాటు దిగుబడులు పెరుగుతున్నవి కాబట్టి ఈ పద్ధతిని పాటిస్తున్నారు. కలుపు నివారణకు తాను సొంతంగా పైపు మరియు ఇనుప చైన్లతో తయారు చేసుకున్న పరికరాన్ని ఉపయోగించి కొంత వరకు నివారించుకోవడంతో పాటు మిగిలిన కలుపును మనుషుల సహాయంతో నివారించుకున్నారు. వరి పంటకు అవసరాన్ని బట్టి జీవామృతం, మట్టిద్రావణం, వేస్ట్‌డికంపోజర్, నీమాస్త్రం, ఇంగువ ద్రావణం, మారేడు కషాయం లాంటివి ఉపయోగిస్తూ వచ్చారు. పంటలో నీటి అవసరం తెలుసుకునేందుకు 6 అంగుళాల పివిసి పైపుకు రంధ్రాలు చేసి ఆ పైపును వరి పంటలో భూమిలో పెట్టి అందులో ఊరిన ఊట నీటిని పరిశీలిస్తూ ఆరుతడి పద్ధతిలో నీటిని అందిస్తూ వచ్చారు. ఖరీఫ్‌లో ఎకరానికి 2500 కిలోలు, రబీలో ఎకరానికి 3500 కిలోలు వడ్ల దిగుబడి సాధించి సంవత్సరానికి రెండు పంటలకు కలిపి ఎకరానికి 6000 కిలోల వడ్ల దిగుబడి పూర్తి సేంద్రియ పద్ధతిలో సాధించారు. వడ్లను అదేవిధంగా అమ్మకుండా విలువజోడించి అనగా వడ్లను మరపట్టించి బియ్యాన్ని అమ్మకం చేస్తున్నారు. వీటితో పాటు కొంత ప్రాంతంలో మన ప్రాచీన వరి రకాలను కూడా సాగు చేసి మంచి దిగుబడి తీసి ఆ వరిగడ్డిని (ఉప్పుద్రావణం కోటింగు ఇచ్చి) పశువులకు మేతగా అందిస్తూ వస్తున్నారు.
వస: ఒకటిన్నర ఎకరాలలో ఔషధ పంట అయిన వస పంటను సాగు చేశారు. ఇందుకు అవసరమయిన విత్తన మొక్కలను తెలిసినవారి నుండి తెప్పించుకుని నాటారు. ఎకరానికి 40000 మొక్కల చొప్పున ఎకరంన్నరకు 60,000 మొక్కలు అవసరం అయినవి. వస మొక్కలను వరి నారు మాదిరిగానే ‘శ్రీ’ పద్ధతిలో నాటించారు. వస పంటలో 3 నెలల వరకు కలుపు సమస్య ఉంటుంది కాబట్టి కోనోవీడరు తిప్పటానికి వీలుగా మొక్కలను 2021 సంవత్సరం జులై నెలలో నాటించారు. వస సాగుకు గాను ఔషధ మొక్కల బోర్డు నుంచి ఎకరానికి 14000/- ప్రోత్సాహాన్ని కూడా మల్లిఖార్జున రెడ్డి పొందారు. ఇది 9 నెలల పంట. 2022లో దిగుబడి వచ్చింది. ఎకరంన్నరకు గాను 30 క్వింటాళ్ళ దిగుబడి పొంది క్వింటా 8000/-లకు అమ్మకం చేశారు. ఎకరంన్నరకు గాను పెట్టుబడి 1,10,000 వరకు అయ్యింది. పెట్టుబడి పోను ఎకరంన్నరకు సుమారు 1,30,000 వరకు ఆదాయం వచ్చింది.
అజొల్లా: అడుగు లోతు 10 అడుగుల వెడల్పు మరియు పొడవులతో ఒక తొట్టెను నిర్మించుకుని అందులో అజొల్లాను పెంచుతున్నారు. తొట్టిలో అడుగున 2 అంగుళాల మందంలో మట్టి, సుమారు 20 కిలోల ఆవుపేడ, అగ్గిపెట్టె పరిమాణంలో మినరల్ మిక్చర్ వేసి నీటిని నింపి అజొల్లా కల్చర్‌ని తెచ్చివేశారు. ఈ తొట్టెను నీడలో ఏర్పాటు చేసుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే 10 నుంచి 15 రోజులలో తొట్టి మొత్తం అజొల్లా అభివృద్ధి చెందింది. ప్రతిరోజు కొంత అజొల్లాను పశువులకు, కోళ్ళకు దాణాగా అందిస్తూ వస్తున్నారు. ప్రతివారం తప్పనిసరిగా అజొల్లా తొట్టిలోని నీటిని మార్చాలి. 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సుమారు 20 కిలోల పేడను అందించాలి. 6 నెలలకు ఒకసారి మట్టిని మారుస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటే 365 రోజులు అజొల్లాని పొందవచ్చు. అజొల్లాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కనుక పశువులు, కోళ్ళు లాంటి వాటికి దాణాగా అందిస్తే ఖర్చు తగ్గడంతో పాటు వాటి ఆరోగ్యం బాగా ఉంటుందని మల్లిఖార్జునరెడ్డి వివరించారు. వివిధ రకాల పంటల సాగుతో పాటు మన దేశీయ గోవులు మూడింటిని పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటల సాగులో వినియోగిస్తూ వాటి పాల ద్వారా వచ్చిన వెన్నతో నెయ్యి తయారు చేయించి నెయ్యిని అమ్ముతూ ఆదాయం పొందుతున్నారు. వాటితో పాటు 10 గొర్రెలు, 50 మేకలు (పిల్లలతో కలిపి) 50 కోళ్ళు, సుమారు 300 వరకు చేపలను కూడా పెంచుతూ రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే సమీకృత వ్యవసాయమే సరైన దారి అని నిరూపిస్తున్నారు. మల్లిఖార్జున రెడ్డి చేస్తున్న సమీకృత వ్యవసాయం ద్వారా అన్నీ కలిపి సంవత్సరానికి 10 లక్షలకు తగ్గకుండా ఆదాయాన్ని పొందుతూ కుటుంబ సభ్యుల సహకారంతో ఆనందంగా సేద్యాన్ని కొనసాగిస్తూ ఆరోగ్యంగా జీవితాన్ని గడుపుతున్నారు.
మరిన్ని వివరాలు 9704090613 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
