ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైనది తృప్తి. తృప్తి లేని జీవితం వ్యర్థం. ఎంత సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని అవార్డులు, రివార్డులు సాధించినా తృప్తి లేకుంటే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అనే విషయం అక్షర సత్యం. కాని ఈ సత్యాన్ని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు అంటే ప్రశ్నార్థకమే? అతి తక్కువమంది మాత్రమే తృప్తి యొక్క విలువను తెలుసుకొని అందుకు అనుగుణంగా తమ జీవితాలను మలచుకుంటున్నారు. కాని చాలామంది తృప్తి అనే దానిని పక్కకు నెట్టి ఇంకా, ఇంకా ఏదో సాధించాలనే తపనతో తమ జీవిత గమ్యం ఏమిటో గుర్తించలేకుండా గుడ్డిగా పరిగెడుతూ ఎంతో విలువైన కుటుంబాన్ని, సమయాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని కోల్పోతున్నారు అనే విషయం ప్రస్తుత సమజాన్ని గమనిస్తే అర్థం అవుతుంది. ప్రస్తుత సమాజంలో ఎక్కువ శాతం మంది ఇదేబాటలో నడుస్తున్నా కూడా అతికొద్దిమంది మాత్రము తృప్తి యొక్క విలువను గుర్తించి జీవితంలో తృప్తి అతిముఖ్యమైనదని గ్రహించి తృప్తి లభించే రంగాలవైపు అడుగులు వేస్తున్నారు. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలో తృప్తి లభిస్తుందని గ్రహించిన చాలామంది ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్న వారు వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలవైపు అడుగులు వేస్తున్నారు. ఈ కోవకు చెందుతాడు ప్రకాశం జిల్లా చందలూరుకు చెందిన నరేంద్రబాబు.
నరేంద్రబాబుది వ్యవసాయ నేపథ్యం. ఎం.బి.ఎ. వరకు చదివి కొన్ని రోజులు మార్కెటింగ్‌కి సంబంధించిన ఉద్యోగం చేసి అందులో తృప్తి లభించకపోవడంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదలి, వ్యవసాయ రంగంలోనే తృప్తి ఉంటుందని గ్రహించి వ్యవసాయరంగంలో అడుగుపెట్టాడు. 2018వ సంవత్సరం నుండి సేంద్రియ పద్ధతులను తన పంటలసాగులో పాటిస్తున్నాడు. ప్రస్తుతం శనగ, గోధుమ, వేరుశనగ, శనగలో అంతరపంటగా ప్రొద్దుతిరుగుడు, వివిధ రకాల కూరగాయల పంటలు సాగు చేస్తున్నాడు.
శనగ: 28 ఎకరాలలో శనగ పంట సాగులో ఉంది. దుక్కిలో ఎకరానికి 3 ట్రక్కుల చొప్పున పశువుల ఎరువు మరియు 40 కిలోల వేపపిండిని అందించాడు. పచ్చిరొట్ట పైర్లు కూడా వేసి భూమిలో కలియదున్నాడు. సాధారణంగా ఈ ప్రాంతంలో అక్టోబరు మరియు నవంబరు మాసాలలో శనగ పంటను విత్తుకుంటారు. కాని ఈ సంవత్సరం అధిక వర్షాల వలన శనగ పంట విత్తుకోవడం ఆలస్యం అయ్యింది. కాబట్టి నరేంద్రకుమార్ డిసెంబర్ మాసంలో శనగ పంటను వేశాడు. ఇందుకుగాను ఎకరానికి 30 నుంచి 40 కిలోల విత్తనం ఉపయోగించాడు. 28 ఎకరాల శనగకుగాను 10 ఎకరాలలో మిశ్రమ పంటగా ప్రొద్దుతిరుగుడు కూడా వేశాడు. ఇందుకుగాను 10 ఎకరాలకు గాను 2 కిలోల సూటిరకం ప్రొద్దుతిరుగుడు విత్తనాలను శనగ విత్తనాలతో కలిపి ఎదబెట్టించాడు. శనగ పంటకు ఎదుగుదలకు, పూత ఎక్కువగా రావడానికి, కాయ బరువు పెరగటానికి అవసరమయిన కషాయాలు మరియు ద్రావణాలు సమయానుకూలంగా అందిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతానికి పంట ఆరోగ్యంగా ఉంది. పంటకాలం 80 నుంచి 100 రోజులు ఉంటుంది. పంటను గమనించినట్లయితే ఎకరానికి 9 క్వింటాళ్లు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. శనగలో మిశ్రమ పంటగా వేసిన ప్రొద్దుతిరుగుడు వలన తేనెటీగల సంచారం పెరిగింది. ఈ విధానాలను అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరం ఎక్కువ ప్రాంతంలో ప్రొద్దుతిరుగుడు పంటను సాగు చేసే ఆలోచనలో ఉన్నాడు. ఎర పంటగా శనగలో ఆవాలు కూడా వేశాడు.

కూరగాయలు: 20 సెంట్లలో వంగ, బెండ, గోరుచిక్కుడు, బ్రకోలి, బచ్చలి, బుట్ట చిక్కుడు, టమాట, ఉల్లి, క్యాబేజి, ఎర్ర క్యాబేజి మరియు వివిధ రకాల ఆకుకూరలను ఇంటి అవసరాలకు సాగు చేస్తున్నాడు. పొలాన్ని రెండు భాగాలు చేసి మొదటి భాగంలో కూరగాయల దిగుబడి మొదలైన వెంటనే రెండో భాగంలో విత్తుకుంటాడు. ఈ విధంగా చేయడం వలన సంవత్సరం పొడవునా కూరగాయల దిగుబడి పొందవచ్చు. సీజను బట్టి ఆయా సీజన్లలో పండే కూరగాయలను సాగు చేస్తూ సొంత అవసరాలకు ఉపయోగించుకుంటూ మిగిలినవి బయటికి అమ్ముతున్నారు. వచ్చే సంవత్సరం ఈ కూరగాయల సాగు విస్తీర్ణం పెంచే ఆలోచనలో ఉన్నాడు.
వేరుశనగ: 70 సెంట్లలో వేరుశనగను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నాడు. ఇందుకు గాను కదిరి లేపాక్షి 1812 రకం వేరుశనగ విత్తనాలను కడప నుంచి కొనుగోలు చేసి ఉపయోగించాడు. పంట ఆరోగ్యంగా ఉంది.

మిరప: 70 సెంట్లలో మిరప పంట సాగులో ఉంది. పచ్చిమిరప మరియు ఎండు మిరపకు రెండింటికి అనువైన 341 రకం విత్తనాన్ని ఎంపిక చేసుకున్నాడు. 70 సెంట్లకు గాను దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువు, 300 కిలోల వేపపిండిని అందించడంతోపాటు ఇప్పటి వరకు 1000 లీటర్ల జీవామృతం భూమికి అందించాడు. నీమాస్త్రం, వేస్ట్‌డికంపోజరు, ఇంగువద్రావణం, పుల్లటి మజ్జిగ మరియు వివిధ రకాల కషాయాలను పంటపై పిచికారి చేయించాడు. వాస్తవంగా ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాల వలన మిరప పంట ఎదుగుదల సక్రమంగా లేదు. కొన్ని రోజులపాటు మిరప పంటలో నీరు నిలబడింది. ఆ సమయంలో మిరప మీద నేను ఆశలు వదులుకున్నాను. కానీ వర్షాలు తగ్గగానే మిరప పంట మరలా ఆశాజనకంగా కనిపించింది. తన పంటలో తామర పురుగు బెడద తక్కువగా ఉంది. పంటను గమనించినట్లయితే 70 సెంట్లకు గాను 5 క్వింటాళ్ళ దిగుబడి సాధించవచ్చు అని నరేంద్రబాబు అంటున్నాడు.
ఈ పంటలతో పాటు కొద్ది ప్రాంతంలో జొన్న, గోధుమ, ధనియాలు సాగు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా విత్తనాలను అభివృద్ధి చేసి నాటు విత్తనాలను తాను ఉపయోగించు కోవడంతో పాటు తోటి రైతులకు అందించే లక్ష్యంతో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నాడు. సూటి రకం విత్తనాలను గురించి చాలా దూరం వెళ్ళి ఖరీదు గురించి ఏ మాత్రం ఆలోచించకుండా కొనుగోలు చేసి సాగు చేస్తున్నాడు. మరిన్ని వివరాలు 7671827692 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
కుటుంబ సభ్యుల సహకారంతోనే వ్యవసాయంలో కొనసాగుతున్నాను

ఏరంగంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయరంగంలో ప్రస్తుత సమాజంలో కుటుంబ సభ్యుల సహకారం అందడం లేదు కాబట్టి చాలామంది వ్యవసాయరంగంలో అడుగు బెట్టలేకపోతున్నారు. కాని నరేంద్రబాబుకు అలాంటి ఇబ్బంది లేదు. ఉన్నత చదువులు చదివి వ్యవసాయ రంగంలో కొనసాగాలన్న తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు ప్రోత్సహించడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయంలో కొనసాగగలుగుతున్నాను అని, తనకు సహకారం అందిస్తున్న కుటుంబ సభ్యులకు నరేంద్రబాబు కృతజ్ఞతలు తెలియచేశారు.
