లావణ్యా రమణారెడ్డి
పెరుగుతున్న ప్రజల ఆహార అవసరాలను తీర్చే ధ్యేయంతో వ్యవసాయంలో రసాయనాలు ప్రవేశపెట్టబడినవి. రసాయనాలు వచ్చిన కొత్తలో రైతులు తమ పంటల సాగులో రసాయనాలు వినియోగించటానికి విముఖత చూపగా శాస్త్రవేత్తలు బలవంతంగా కొంతప్రాంతంలో తగు మోతాదులో రసాయనాలు వినియోగించడము జరిగింది. రసాయనాలు వినియోగించిన ప్రాంతంలో పంటలు ఆశాజనకంగా కనిపించటముతో రైతులు రసాయనాలు వినియోగిస్తూ పంటలు సాగు చేయడం మొదలయ్యింది. అప్పట్లో శాస్త్రవేత్తల సలహాల మేరకు ఎక్కువ మొత్తంలో సేంద్రియ పదార్థాలను మరియు కొద్ది మొత్తంలో రసాయనాలను వినియోగిస్తూ పంటల సాగు కొనసాగిస్తూ వస్తున్న కాలంలో వివిధ రకాల కారణాల వలన కొంత మంది రైతులు సేంద్రియ పదార్థాలను ప్రక్కన పెట్టి పూర్తిగా రసాయనాలనే ఉపయోగిస్తూ పంటలు పండించడము మొదలు పెట్టారు. సేంద్రియ పదార్థాలను అసలు వినియోగించకుండా విచక్షణా రహితంగా రసాయనాలు వినియోగిస్తూ పంటల సాగు కొనసాగిస్తూండడము వలన మొక్కలలో రోగనిరోధక శక్తి తగ్గడము, చీడపీడల ప్రభావం పెరగటం, కొన్ని రకాల చీడపీడలు రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ రసాయనిక పురుగుమందులకు నివారణకాకపోవడంతో రైతులు చీడపీడల నివారణకు ఎక్కువగా ఖర్చుపెట్టవలసి వస్తుంది. అయినా చీడపీడలు నివారించలేక పంటను నష్టపోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ సంవత్సరం మిరప రైతుల పరిస్థితి పరిశీలిస్తే విచక్షణా రహిత రసాయనాల వినియోగం వలన జరిగే ప్రమాదం అర్థం అవుతుంది. మిగతా పంటలతో పోల్చుకుంటే మిరప పంటకు చీడపీడల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ చీడపీడలను నివారించటానికి రైతులు యేయేటికాయేడు కొత్త మందులను వినియోగిస్తూ వస్తున్నారు. విచక్షణా రహిత రసాయనాలకు అలవాటు పడిన చీడపీడలు రోగనిరోధక శక్తిని పెంచుకొని నివారణ కాలేని పరిస్థితులు ఈ సంవత్సరం మిరప రైతులకు ఎదురయ్యింది. కొత్త రకం తామర పురుగులు మరియు నల్లి లాంటి పురుగులు మిరప రైతులను ఇబ్బందికి గురి చేసినవి. చేస్తున్నవి. ఎన్ని రకాల రసాయనిక మందులు ఉపయోగించినా కూడా ఈ చీడపీడలను నివారించలేక కొంతమంది మిరప రైతులు తమ పంటను పీకివేసి జొన్న, సోయా, మినుము, నువ్వు లాంటి పంటలు వేసుకుంటున్నారు. కొంతమంది వచ్చినకాడికి దిగుబడి వస్తుందనే ఆశతో మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన అన్ని నివారణా మార్గాలవైపు పరుగులు తీస్తున్నారు. మొత్తానికి ఈ సంవత్సరం మిరప రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులలో సేంద్రియ పద్ధతిలో మిరపను సాగు చేస్తే ఫలితాలు ఉంటవి అని నిరూపిస్తూ పంటల సాగుకు సేంద్రియ పద్ధతులే శరణ్యం అని అంటున్నారు నాగర్‌కర్నూలు జిల్లా, కారువంగ గ్రామానికి చెందిన సేంద్రియ రైతు దంపతులు లావణ్యా రమణారెడ్డి.
రసాయనిక వ్యవసాయం చేస్తూ నష్టాలపాలై వ్యవసాయాన్ని వదలి వేరే రంగంలో అడుగుపెట్టాలనే యోచనలో ఉన్నప్పుడు సేంద్రియ సాగు గురించి తెలుసుకుని తమ సాగులో సేంద్రియ పద్ధతులను ఆచరించడం మొదలు పెట్టారు. అప్పటినుంచి పెట్టుబడులు తగ్గడముతో పాటు మొదటలో దిగుబడులు కూడా తగ్గుతూ ఉన్నా కూడా ఏ మాత్రం వెనుకంజ వేయకుండా తమ సేంద్రియ సాగుని కొనసాగిస్తూ వస్తున్నారు. క్రమంగా దిగుబడులు పెరగడము మొదలయ్యింది. వచ్చిన దిగుబడులను సొంతంగా వినియోగదారులకు అమ్మడం మొదలుపెట్టారు. ఈ పరిణామాల వలన తమ పంటలసాగు లాభాల బాటలో పయనించడం మొదలయ్యింది. ఇంక వెనుకడుగు వేయకుండా తమ సేంద్రియ సాగును కొనసాగిస్తూ వివిధ రకాల పంటలలో అంటే మిరప, ప్రత్తి, కంది, వరి, జొన్న, సజ్జ, నువ్వులు, ఆవాలు, మెంతులు, జీలకర్ర లాంటి చాలా రకాల పంటలు పూర్తి సేంద్రియ పద్ధతులలో పండిస్తూ అత్యధిక దిగుబుడలు అంటే రసాయనసాగు చేసే రైతులతో సమానంగా, కొన్ని పంటలలో రసాయనిక సాగు చేసే రైతుల కంటే ఎక్కువ దిగుబడులు సాధిస్తూ లాభసాటి సాగును కొనసాగిస్తున్నారు. మిగతా పంటలు ప్రక్కన పెడితే మిరప పంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
గత 20 సంవత్సరాల నుంచి పూర్తి సేంద్రియ పద్ధతులతో మిరప పంటను పండిస్తూ వస్తున్నారు. మిగతా పంటలతో పోలిస్తే మిరప పంటకు చాలా ప్రత్యేకత ఉంది. మిరప పంటకు పెట్టుబడులు ఎక్కువ. మిరప పంటకు చీడపీడల ప్రభావం ఎక్కువ. చీడపీడల నివారణకు రసాయనిక పద్ధతులు పాటించే రైతులు విపరీతంగా రసాయనాలు పిచికారి చేస్తుంటారు. కొంతమంది రైతులు నెలకు 6 సార్లకు తగ్గకుండా రసాయన కీటకనాశనులను పిచికారి చేయడంతోపాటు ఎకరానికి 30 బస్తాలకు పైగా రసాయన ఎరువులు అందిస్తూ మిరప పంటను సాగు చేసే రైతులు ఉన్నారు అంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. అందువలన మిరప రైతులకు పెట్టుబడులు ఎక్కువగా అవుతుంటాయి. ఈ సంవత్సరం చీడపీడలను నివారించలేక రసాయన పద్ధతులు పాటించిన రైతులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులో కూడా పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తున్న లావణ్యారమణారెడ్డి గారి మిరప తోట ఆరోగ్యంగా ఉంది. పంటను గమనించినట్లయితే ఎకరానికి 20 క్వింటాళ్ళ ఎండుమిరప దిగుబడి వచ్చేలా ఉంది.
సొంత పంట నుంచి నాటు విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తనాలను బీజామృతంతో విత్తనశుద్ధి చేసుకుని నారుపోసుకున్నారు. 35-40 రోజుల వయస్సు గల నారుని బీజామృతంలో ముంచి నారు నాటించారు. దుక్కిలో ఎకరానికి 300 కిలోల ఘనజీవామృతం అందించారు. పంటకాలం మొత్తం ఎకరానికి 500 లీటర్ల వరకు ద్రవజీవామృతం భూమికి అందించారు. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, థపర్ణి కషాయం, విషముష్టి కషాయం, పుల్లటి మజ్జిగలను అవసరాన్ని బట్టి పిచికారి చేసుకుంటూ వచ్చారు. పంటలో అంతర సేద్యం ఆపి వేసిన తరువాత ధనియాలు, ఉల్లి, వెల్లుల్లి, సోంపు, మెంతి, జీలకర్ర, ఆవాలు మొదలగు అంతర పంటలు నాటించారు. పంటలో అక్కడక్కడా ఎర పంటలుగా ఆముదాలు, బంతి మొక్కలు నాటించడంతో పాటు పచ్చ పురుగు మరియు లద్దె పురుగుకు సంబంధించి లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేశారు. ఎకరానికి 30 చొప్పున బులుగు రంగు మరియు పసుపు రంగు జిగురు అట్టలను అమర్చారు. అంతకుమించి ఎలాంటి రసాయనాలు వినియోగించలేదు. అయినాకాని రసాయనాలు వినియోగించిన పంటలతో పోలిస్తే వీరి మిరప పంట ఆరోగ్యంగా, ఆకర్షణగా ఉంది. 4 ఎకరాల మిరపలో ఒక్క మొక్క కూడా బొబ్బర మొక్క ఇప్పటి వరకు అంటే జనవరి 26 వ తారీఖు వరకు కనిపించలేదు. మొక్క ఎదుగుదల కూడా బాగా ఉంది. కొన్ని చోట్ల 5 అడుగుల వరకు మిరప పంట పెరిగింది. వాస్తవంగా పంట ఎదుగుదలను చూస్తే ఎకరానికి 40 క్వింటాళ్ళ దిగుబడి దాటవచ్చు అనిపిస్తుంది. కాని పంటను గమనించినట్లయితే ఎకరానికి 20 క్వింటాళ్ళకు తగ్గదు అనేలా ఉంది. వీరి పంటలో తాలు కాని, మచ్చ ఉన్న కాయలు కాని ఎక్కువగా లేవు. 10 శాతం కన్నా తక్కువే తాలు లేదా మచ్చ కాయలు ఉన్నాయి. మరిన్ని వివరాలు 7730061819 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
– డి. ప్రసాద్, రైతునేస్తం ప్రత్యేక ప్రతినిధి
