‘నేషనల్‌ లైవ్‌స్టాక్‌ మిషన్‌’ కింద రూ. కోటి రుణం
రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తం అందుకున్న తొలి రైతు!
మారుమూల పల్లెలోని ఓ రైతు ఇంట జాతీయ పథకం సిరులజల్లు కురిపించింది. చిన్న పరిశ్రమల ఏర్పాటులో రైతులకు ప్రోత్సాహకాన్ని అందిస్తున్న ‘నేషనల్‌ లైవ్‌స్టాక్‌ మిషన్‌’ను సద్వినియోగం చేసుకోవడంతో రూ. కోటి రుణం మంజూరైంది. ఇందులో 50 శాతం రాయితీ కాగా… రూ. 50 లక్షలను ఆయన తిరిగి చెల్లించాలి. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని అరికెల గ్రామ పంచాయతీ, గోసువారిపల్లెకు చెందిన రైతు చిన్నరెడ్డెప్పరెడ్డి… గొర్రెల పెంపకం యూనిట్‌ ఏర్పాటు నిమిత్తం ఈ మొత్తం అందుకున్నారు. ఈ చెక్కును మదనపల్లె సబ్‌కలెక్టర్‌ మేఘనస్వరూప్‌ రైతుకు గురువారం అందజేశారు. ‘రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని ఓ మారుమూల ప్రాంత రైతు సద్వినియోగం చేసుకోవడం ఆహ్వానించదగినది. ఏ పథకం కిందనైనా ఓ రైతు ఇంత మొత్తంలో రుణం అందుకోవడం రాష్ట్రంలో ఇదే తొలిసారి’ అని కలెక్టర్‌ పేర్కొన్నారు. అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మదనపల్లె పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సత్యనారాయణ, ఏడీఏ రోహిణి, పశువైద్యాధికారి లారెన్స్‌ తదితరులు పాల్గొన్నారు.