టన్ను ధర రూ. 3,576/-
కేసీపీ చక్కెర కర్మాగారం 2024-2025 సీజన్‌కు చెరకు ధర టన్నుకు రూ. 3,576/-గా ప్రకటించింది. కర్మాగార ఆవరణలో శుక్రవారం యూనిట్‌ హెడ్‌ యలమంచిలి సీతారామదాస్‌ అధ్యక్షతన చెరకు రైతు సంఘం నేతలతో జరిగిన సమావేశంలో చెరకు గానుగాడు ప్రస్తుత సీజన్‌కు ధర సబ్సిడీతో కలిసి రూ. 3,576/-గా ప్రకటించారు. యాంత్రీకరణకు అనువుగా సాగు చేసిన రైతులకు టన్నుకు రూ. 3,676/- సబ్సిడీతో కలిపి చెల్లించనున్నట్లు సీతారామదాస్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబరులో అకాల వర్షాలు, వరదలకు నష్టపోయిన రైతులకు సంఘం విన్నపం మేరకు రూ. 40.89 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. రానున్న సీజన్‌కు ఈ సంవత్సరం నవంబరు నుంచి 2025 ఫిబ్రవరి వరకు నాటే చెరకు తోటలకు ఎకరానికి రూ. 10,000/- సబ్సిడీ ఇవ్వనున్నట్టు తెలిపారు. సబ్సిడీతో పాటు సంప్రదాయ పద్ధతుల్లో నాటిన తోటలకు టన్నుకు రూ. 400/- లేదా యాంత్రీకరణ అనువుగా వేసిన తోటలకు టన్నుకు రూ. 500/- సబ్సిడీగా ప్రకటించారు. రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని విరివిగా చెరకు సాగు చేసి తోడ్పడాలని కోరారు.