కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, ప్రాంతీయ భాషలలో వివరాలు తెలియచేసి, అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. అందుకు సంబంధించి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అందించిన వివరాలు…
- వ్యవసాయ విద్యను బలోపేతం చేసేందుకు రూ. 2,291 కోట్లతో భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తారు. వ్యవసాయ విద్యలో ప్రకృతిసాగు, వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే వంగడాలను రూపొందించే విధానాలకు చేయూతనిస్తారు.
- ఆహారం, పశువుల దాణాలకు పనికొచ్చే పంటల జన్యు మూలాలను మెరుగుపరుస్తారు. పప్పుదినుసులు, నూనెగింజల పంటలు మరింత దిగుబడినిచ్చేలా మెరుగుపరుస్తారు. పురుగులు, చీడపీడల నివారణపై పరిశోధనలు నిర్వహిస్తారు.
- పాడి పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, వాటి ఉత్పాదకత పెంచేందుకు వీలుగా పశువుల ఆరోగ్య నిర్వహణ, పశువైద్య విద్యకి ప్రాధాన్యమిస్తారు.
- ఉద్యాన పంటల సాగును సుస్థిరంగా మార్చేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వాతావరణానికి తట్టుకొని నిలబడగలిగే పంటలను ప్రోత్సహిస్తారు. కూరగాయలు, పూలు, పండ్లు, పుట్టగొడుగుల సాగుకు చేయూతనిస్తారు.
- కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేయడం ద్వారా స్థానిక భాషల్లో రైతులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తారు. వీటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను అందుబాటులో ఉంచుతారు.
- దేశవ్యాప్తంగా ఉన్న సహజ వ్యవసాయ వనరులను పరిరక్షిస్తారు. దాని కింద రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, భూగర్భ జలాలను సంరక్షిస్తారు.
- డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పథకం కింద రైతుల వివరాలు నమోదు చేస్తారు. భూముల పట్టాల రిజిస్ట్రీని నిర్వహిస్తారు. సాగు చేసిన పంటల వివరాలు, జియో స్పేషియల్ డేటా, కరవులు, వరదల పర్యవేక్షణ, వాతావరణ/శాటిలైట్ డేటా, భూగర్భ జలాలు, ఉపరితల జలాల లభ్యత సమాచారాన్ని సేకరించి రైతులకు అందుబాటులో ఉంచుతారు. పంట భూముల స్థితిగతులు, దిగుబడుల అంచనాలు, పంట రుణాలు, ఏఐ, బిగ్‌డేటా లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కొనుగోలుదారులతో రైతులను అనుసంధానం చేయడం, మొబైల్ ఫోన్ల ద్వారా రైతులకు అవసరమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. ఆధార్ తరహాలో 11 కోట్ల మంది రైతులకి డిజిటల్ గుర్తింపునిస్తారు.