మామిడిని సాగు చేసే రైతులు పూత ప్రారంభమైనప్పటినుండి పురుగులు తెగుళ్ల యాజమాన్యం మరియు పోషకాల యాజమాన్యంను  సరైన సమయంలో చేస్తూ  అధిక దిగుబడి  మరియు నాణ్యమైన దిగుబడిని  పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాని కోత అనంతరం తగిన శ్రద్ధ తీసుకోకపోవడం వలన తర్వాత సంవత్సరం దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మామిడి కోత తర్వాత  నిర్లక్ష్యం చేయకుండా రైతులందరూ సరైన యాజమాన్యం చేపట్టాలి.

మామిడి తోటల్లో కోత అనతరం తీసుకోవలసిన చర్యలు

1. కొమ్మ కత్తిరింపులు

మామిడిలో పూత రావటం అనేది వాతావరణంతో పాటు కొమ్మల వయస్సుపై కూడా ఆధారపడి ఉంటుంది. పూత వచ్చే సమయానికి కొమ్మలవయస్సు దాదాపు 4-5 నెలలు ఉండాలి. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న కొమ్మలపై పూత రాదు. కాబట్టి కాయ కోత వెంటనే  కత్తిరింపులు చేస్తే కొత్త చిగుర్లు పెరిగి పూత వచ్చేటప్పటికి కొమ్మల వయస్సు పూత రావటానికి అనువుగా ఉంటుంది. 

కొమ్మ కత్తిరింపులను కాయ కోత చేపట్టిన నెల రోజుల తర్వాత మొదలు పెట్టాలి. కాయలు పెరిగిన పూత  కాడలను తొలగించి అక్కడనుండి కొమ్మలను కనీసం 10-15 సెం. మీ. వెనక్కి కత్తిరించాలి. అలాగే బాగా కిందకు వేలాడిన కొమ్మలను తీసేయాలి. చెట్టు లోపలి భాగంలో అడ్డదిడ్డంగా ఒకదానిపై ఒకటిగా పెరిగిన కొమ్మలను తీసివేస్తే చెట్టు లోపల భాగాలలో గాలి, వెలుతురు ప్రసరణకు అనువుగా ఉంటుంది. అదేవిధంగా చెట్టు లోపల భాగంలో నిటారుగా పెరిగే 2-3 కొమ్మలను (గొడుగు కొమ్మలు) కత్తిరించాలి. కత్తిరింపులు చేసినపుడు కొమ్మలు చీలిపోకుండా జాగ్రత్తగా కత్తిరించాలి. అయితే కాపుకు వచ్చిన చెట్లలో 25% కన్నా ఎక్కువ కొమ్మలు కత్తిరిస్తే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తెగులు సోకిన కొమ్మలు, ఎండిన కొమ్మలు ఉంటే తీసివేయాలి. కత్తిరించిన కొమ్మలకు శిలీంద్రాలు, బాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు సోకకుండా తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి.

కత్తిరింపుల వలన లాభాలు

  •   చెట్టుకు గాలి, వెలుతురు బాగా సోకి దిగుబడి పెరుగుతుంది.
  •   తోటలో అంతర కృషి పనులు చేయటానికి అనువుగా వుంటుంది
  •   నాణ్యమైన పండ్ల ఉత్పాదకత పెరుగుతుంది
  •   చెట్టు ఎత్తును అదుపులో ఉంచుకోవచ్చు
  •   ప్రతి సంవత్సరం నిలకడగా కాపు కాస్తుంది.
  •   చీడ పీడల బెడద తగ్గుతుంది.

2. ఎరువుల యాజమాన్యం

కోత తర్వాత చెట్టు తన ఆహార నిల్వలను కోల్పోతుంది కాబట్టి కోత అనతరం తప్పనిసరిగా చెట్టుకు పోషకాలు అందించాలి. కొమ్మ కత్తిరింపులు చేపట్టిన వెంటనే ప్రతి చెట్టుకు వయస్సును బట్టి సిఫార్సు చేసిన ఎరువులను వేసుకోవాలి. కాపుకు వచ్చిన తోటల్లో కత్తిరింపులు తర్వాత తొలకరి వర్షాల సమయంలో ఎరువులు వేసుకొంటే మొక్కకి పోషకాలు అందుతాయి ఒక వేళ వర్షాలు లేనట్లయితే నీటి తడులు ఇచ్చుకోవాలి. ఎరువులను తొలకరిలో అంటే జులై – ఆగష్టు నెలల్లో చెట్లు పాదుల్లో సమంగా చల్లి నేలలో కలిసేలా తిరగబెట్టాలి.  వర్షపాతం ఎక్కువగా ఉన్న  ప్రాంతాల్లో ఎరువులను వర్షాకాలం మొదట్లో ఒకసారి మరలా వర్షాకాలం చివర్లో రెండవసారి వెయ్యాలి.  వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో వర్షాకాలం చివర్లో ఒకేసారి వేసుకోవాలి. 

పది సంవత్సరాలు వయస్సు దాటిన ప్రతి చెట్టుకు 1 కిలో నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్‌ ను ఇచ్చే ఎరువులను వేయాలి. సేంద్రియ ఎరువులు మరియు జీవన ఎరువులను ఎక్కువగా వేసుకొంటే మంచిది. సేంద్రియ ఎరువులు చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు లేదా వర్మీ కంపోష్టు 20 కిలోలు తో పాటు 1 కిలో వేపపిండి, 250 గ్రా. చొప్పున  అజిటోబాక్టర్‌ లేదా అజోస్పైరిల్లం ను 25 0 గ్రా. ఫాస్ఫోబాక్టర్‌, 100 గ్రా. ట్రైకోడేర్మావిరిడిని కూడా వేసుకోవాలి.

మామిడిలో సూక్ష్మపోషకాల లోప లక్షణాలు కనిపిస్తే కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత 5 గ్రా. జింక్‌ సల్ఫేట్‌, 2 గ్రా. బోరాన్‌, 2 గ్రా. ఫెర్రస్‌ సల్ఫేట్‌, 2 గ్రా. కాల్షియం సల్ఫేట్‌ను 1 లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. మొక్కలకు అందించే పోషకాలను సేంద్రియ ఎరువుల రూపంలో అందిస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. 

3. కలుపు యాజమాన్యం

మామిడిలో కోత తర్వాత వర్షాలు పడి కలుపు సమస్య ఎక్కువుగా వుంటుంది. కలుపును ఎప్పటికప్పుడు నివారిచుకోవాలి. లేకపోతే మామిడిని ఆశించే చాలా పురుగులు కలుపు మొక్కలపై నివాసం ఏర్పరుచుకొని వాటి జీవిత చక్రాలు  పూర్తి చేసుకొని మామిడిపై ఆసిస్తాయి. కలుపును సమర్ధవంతంగా నివారిచాలంటే తొలకరి వర్షాలు పడిన తర్వాత నేలను 2 సార్లు దున్నుకొని పచ్చిరొట్ట పైర్లు వేసుకోవాలి. జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద, నవధాన్యాలు వంటి పంటలను తోటల్లో చల్లుకొంటే వర్షాలకు అవి పెరిగి కలుపు మొక్కలు రాకుండా చేస్తాయి. ఈ పచ్చి రొట్ట పైర్లు పూత థకు రాగానే వాటిని మళ్ళీ నేలలో కలియ దున్నాలి. ఈ విధంగా చేయటం వలన మల్చింగ్‌గా పనిచేసి కలుపు రాకుండా చేయటమే కాకుండా అవి కుళ్ల్లి సేంద్రియ ఎరువుగా మారి నేల సారవంతం పెరుగుతుంది. అంతే కాకుండా కలుపు నివారణకు చేసే ఖర్చు తగ్గుతుంది. ఈ విధంగా తక్కువ ఖర్చుతో కలుపు నివారించుకోవాలి.

4. పురుగులు, తెగుళ్ల యాజమాన్యం

  •   కాయ కోత అనతరం లోతు దుక్కులు దున్నుకొంటే నేలలో ఉండే పురుగుల గుడ్లు మరియు నిద్రావస్థ థలు బయటపడి నాశనమౌతాయి.
  •  తేనెమంచు పురుగు ఉదృతి కొత్త చిగుర్లు వచ్చే సమయం నుండి ప్రారంభమవుతుంది. వీటి ఉధృతిని అరికట్టాలంటే చెట్ల కొమ్మలను పలచన చేయాలి. అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు కత్తిరించి చెట్టుకు గాలి, వెలుతురు బాగా సోకేలా చేయాలి. ఎండిన కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించాలి. తోటలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
  •   అక్టోబర్‌లో వర్షాలు లేనట్లైతే ఒకసారి చెట్ల పాదుల్లో నీటితడులు ఇవ్వటం వలన కూడా భూమిలో ఉండే గుడ్లు బయట పడతాయి.
  •  తోటలో రాలిన కాయలను ఏరి నాశనం చేయాలి.
  •  ప్రతి 2 నెలలకు ఒకసారి వేప నూనె 3000 పిపియం 3 మిల్లీ లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపిన ద్రావణాన్ని చెట్ల కొమ్మలు, మొదలు బాగా తడిచేలా పిచికారి చేయాలి. దీనివలన  కొమ్మల పగుళ్ళలో దాక్కొని ఉన్న పురుగు కోశస్థ థలు నాశనమై వాటి ఉధృతి తగ్గుతుంది. 
  •   పిండి పురుగులు నివారణకు చెట్ల మొదలు నుండి 1 అడుగు ఎత్తులో 25 సెం.మీ. వెడల్పు ఉన్న 400 గేజు మందం ఉన్న పాలీథీన్‌ షీటుతో చుట్టాలి. ఇలా చేయటం వలన నేలలో ఉండే పిల్ల పురుగుల థలు చెట్టుపైకి పాకకుండా ఉంటాయి. చెట్ల పాదుల్లో వేపపిండి వేయటం వలన కూడా వీటిని నివారించుకోవచ్చు.
  •   పండు ఈగ ఆశించిన కాయలు రాలి ఉంటే వాటిని వెంటనే ఎరివేసి నేలలో లోతుగా కప్పటమో లేదా కాల్చివేయటం చేయాలి.
  •  ఆకు ముడత పురుగులు అల్లిన గూళ్ళను తొలగించి వాటిని కాల్చేస్తే ఆ గూడులో ఉండే గుడ్లు, పిల్ల పురుగు థలు నాశనం అయ్యి తోటలో వాటి ఉధృతి తగ్గుతుంది.
  •  తోటలో మిత్ర పురుగులను రక్షించటం వలన హానికర పురుగుల ఉధృతి అదుపులో ఉండి పంట నష్టం తగ్గుతుంది.
  •   సాధ్యమైనంత వరకు రసాయన మందుల పిచికారీ తగ్గించుకోవాలి. వీటికి బదులు పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని  జీవ సంబంధిత మందులు అయినటువంటి వేపనూనె, కానుగ నూనె, బవేరియా బాసియానా, మెటారైజియం వంటి   సురక్షితమైనవి వాడుకొని నివారించుకోవాలి. 

డా. కె. రాధారాణి, ప్రధాన శాస్త్రవేత్త (హార్టీకల్చర్‌), డా. బి. కనక మహాలక్ష్మి, ప్రధాన శాస్త్రవేత్త (ప్లాంట్‌ పాథాలజీ) జి. శాలిరాజు, శాస్త్రవేత్త, (ఎంటమాలజీ), మామిడి పరిశోధనా స్థానం, నూజివీడు. ఫోన్‌: 9948977535