పాలేకర్‌ బాటలో విజయరామ్‌

రసాయనిక వ్యవసాయం వలన సంభవించిన, సంభవిస్తున్న అనర్ధాల నుండి బయటపడడానికి అనేకమంది నిపుణులు, శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు, కొన్ని సంస్థలు రసాయనాలు అవసరం లేని వివిధ రకాల సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరవేస్తున్నారు. వీటిలో ఫుకుఓక ప్రకృతి వ్యవసాయ పద్ధతి, భాస్కరసావే పద్ధతి, చౌహాన్‌క్యూ పద్ధతి, నమ్మళ్వార్‌ పద్ధతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతి, సుభాష్‌పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి లాంటి వాటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటన్నింటిలో సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి చాలా వేగంగా రైతులోగిళ్ళకు చేరింది. ఇంకా చేరుతూనే ఉంది అని చెప్పవచ్చు. సుభాష్‌ పాలేకర్‌ వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ఈ పద్ధతి గురించి ప్రచారం చేయడంతోపాటు, కొన్ని ప్రభుత్వాలు ఈ పద్ధతిని ప్రోత్సహించడం మరియు రైతులు అమలుపరచటానికి అనుకూలంగా ఉండడం, ఈ పద్ధతిలో మన దేశీయ జాతి గోవు ప్రముఖ పాత్రను పోషించటం లాంటి వివిధ రకాల కారణాల వలన మిగతా పద్ధతులతో పోల్చుకుంటూ సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి చాలా వేగంగా రైతు లోగిళ్ళకి చేరిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే సుభాష్‌పాలేకర్‌ వలననే రసాయన వ్యవసాయం వలన జరిగిన, జరిగే నష్టాలు వేగంగా రైతులు తెలుసుకుంటున్నారు. రసాయన రహిత వ్యవసాయం ఇంత వేగంగా రైతులకు తెలియడంలో సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి ప్రధాన పాత్ర పోషించింది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ పద్ధతిని సుభాష్‌ పాలేకర్‌ ప్రచారం చేయకుండా ఉండి ఉంటే రసాయన రహిత వ్యవసాయం రైతులోగిళ్ళకు చేరటానికి చాలా సమయం పట్టేది కావచ్చు. పాలేకర్‌ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవడం, వారి పుస్తకాలు చదివిన వారు, వారి సభలకు హాజరయ్యి ఈ పద్ధతుల గురించి తెలుసుకున్న చాలామంది రైతులు తమ రసాయనిక సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ బాట పట్టించారు. ఇంకా పట్టిస్తున్నారు. వ్యవసాయేతర ఉద్యోగ, వ్యాపారం లాంటి వేరే రంగాలలో ఉన్న వారు కూడా సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతుల గురించి తెలుసుకుని ఈ బాట పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ కోవకే చెందుతారు కృష్ణాజిల్లా, తరకటూరులో, వికారాబాద్‌ సమీపములో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకృతి సాగు చేస్తున్న విజయరామ్‌.

వాస్తవానికి విజయరామ్‌ ఆర్టిస్ట్‌ (బొమ్మలు గీస్తుంటారు). ఆర్టిస్ట్‌గా తన వృత్తిని కొనసాగిస్తూ హైదరాబాదు నగరంలో ఇందిరాపార్కు సమీపంలో ఒక మిఠాయి దుకాణాన్ని నడుపుతూ వస్తున్న సమయంలో నీటి యొక్క విలువను తెలుసుకుని నీటి సంరక్షణకు సంబంధించిన సమాచారాన్ని మిఠాయి దుకాణంకి వచ్చిన వినియోగదారులకు తెలియచేస్తూ ఉండేవారు. అందుకు సంబంధించి చార్టులను తయారు చేయించి అవసరమైన వారికి ఆ చార్టులను ఉచితంగా అందిస్తూ ఉండేవారు. ఆవిధంగా తన ఆలోచనలని సామాజిక రంగాలవైపు కూడా మళ్లించి కొనసాగుతున్న క్రమంలో 2010వ సంవత్సరంలో సుభాష్‌పాలేకర్‌ గారి జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి గురించి తెలుసుకొని తాను కూడా గో-ఆధారిత వ్యవసాయం చేయాలనే తలంపుతో అటువైపు అడుగులు వేసి ప్రకృతి వ్యవసాయంలో అడుగు పెట్టారు. ఈ పద్ధతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే తలంపుతో సుభాష్‌పాలేకర్‌ గారి ద్వారా సదస్సులు ఏర్పాటు చేయడంలో తనవంతు పాత్రను పోషించారు…. పోషిస్తూన్నారు.

గోఆధారిత వ్యవసాయంలో ప్రధానమయినవి మన దేశీయ జాతి గోవులు, మన పురాతన నాటు విత్తనాలు కాబట్టి తన సాగులో ఈ పద్ధతులను అమలుపరచడంతో పాటు అంతరించి పోతున్న మన పురాతన విత్తనాలను అభివృద్ధి చేసి వాటి లభ్యత పెంచాలనే తలంపుతో మన పురాతన విత్తనాల సేకరణకు నడుంబిగించి వాటిని సేకరిస్తూ అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. వీటన్నింటికిగాను కృష్ణాజిల్లా తరకటూరులో, వికారాబాద్‌ సమీపంలో పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వివిధ రకాల పంటలు పండిస్తూ వస్తున్నారు. ఇందుకుగాను మన దేశీయ జాతులు ఒంగోలు, గిర్‌ లాంటి ఆవులను మరియు ఎద్దులను పోషిస్తూ వాటి వ్యర్థాలను తన పంటలసాగులో వినియోగిస్తున్నారు. ఆవు పాల ద్వారా మన తాత, ముత్తాతలు పాటించిన పద్ధతులతో నాణ్యమైన ఆవు నెయ్యిని తయారు చేసి అవసరమైన వారికి అమ్ముతూ వస్తున్నారు.

వరి, చెరకు, ఉల్లి, పసుపు, అల్లం, వివిధ రకాల కూరగాయలు అరటి మొదలగు పంటలతో పాటు 5 అంచెల పద్ధతిలో వివిధ రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. దుక్కిలో ఘనజీవామృతం అందించడంతో పాటు జీవామృతాన్ని భూమికి అందిస్తుంటారు. అవసరాన్ని బట్టి జీవామృతం, నీమాస్త్రం, పుల్లటి మజ్జిగ లాంటి వాటిని పంటలపై పిచికారి చేస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతుంటారు. పంట దిగుబడిలో నాణ్యతకు, పోషకాలకు ప్రాముఖ్యతని ఇస్తూ ఎంత దిగుబడి వచ్చిందనే దానిని పట్టించుకోకుండా వచ్చిన దిగుబడి నాణ్యమైనదా కాదా అనే కోణంలో ఆలోచిస్తూ పంటల సాగు కొనసాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నాటు విత్తనాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కాబట్టి తాను సాగు చేసే పంటలన్నింటికీ నాటు విత్తనాలనే ఉపయోగిస్తున్నారు. నాటు విత్తనాలను తన పంటల సాగులో వినియోగించడంతోపాటు తోటి రైతులకు కూడా అందచేస్తుంటారు. మన పురాతన విత్తనాలు అంతరించి పోతున్నవి కాబట్టి అందుబాటులో ఉన్న పురాతన విత్తనాలను ప్రత్యేకించి వడ్లను ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి సేకరించి వాటిని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అభివృద్ధిపరచి తోటి రైతులకు అందచేసి మన పురాతన విత్తన నిధిని కాపాడుటలో విజయరాం ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. పురాతన వడ్లలో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటే జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు అని తెలుసుకొని పురాతన విత్తనాల అభివృద్ధి మరియు పంపిణీని ఒక ఉద్యమంగా చేస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయంలో అడుగుపెట్టి, దేశీయ జాతి గోసంతతిని, మన పురాతన విత్తనాలను అభివృద్ధిపరుస్తూ తోటి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తూ పంట దిగుబడులు ముఖ్యం కాదు, నాణ్యమైన దిగుబడులు ముఖ్యం అంటూ విజయరాం ముందుకు నడుస్తున్నారు. మరిన్ని వివరాలు 83746 62262 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

ఐదు అంచెల సాగు విధానం

ఐదు అంచెల సాగు విధానాన్ని సుభాష్‌ పాలేకర్‌ బాగా ప్రచారం చేశారు. ఈ విధానంలో 36 అడుగుల దూరంలో మామిడి, నేరేడు లాంటి పెద్దగా ఎదిగే మొక్కలు పెంచుకొంటూ వాటి మధ్యలో వివిధ రకాల మొక్కలను, కూరగాయలు, ఆకుకూరలను 4 అంచలుగా సాగు చేయడం దాని ప్రధాన ఉద్దేశ్యం. ఈ విధానం 36 * 36 అని కూడా ప్రసిద్ధి చెందింది. ఈ 36 * 36 విధానం ప్రచారంలోకి వచ్చిందేకాని క్షేత్రస్థాయిలో విజయం సాధించిన వారు పెద్దగా లేరు. కారణం ఈ విధానంలో దిగుబడులు సక్రమంగా రావడం లేదు అని తెలుసుకుని విజయరాం ఈ విధానానికి వేరే రూపం ఇచ్చారు. అంటే 36 కి బదులుగా 50 అడుగుల దూరం పాటిస్తే అన్ని అనుకూలంగా ఉంటాయని అనుభవ పూర్వకంగా తెలుసుకుని 50 * 50 అడుగుల దూరంలో 5 అంచెలుగా వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 50 అడుగుల దూరంలో మొదటి అంచెలో నేరేడు, మామిడి, పనస, బాదం లాంటి పెద్దగా ఎదిగే వృక్షాలు 50 అడుగులలో సగం అంటే 25 అడుగుల దూరంలో రెండో అంచెగా బత్తాయి, నిమ్మ, నారింజ లాంటి మొక్కలు, 25 అడుగులలో సగం అంటే 12 1/2 అడుగుల దూరంలో 3వ అంచెగా బొప్పాయి, అరటి లాంటి మొక్కలు, 12 1/2 లో సగం 6 1/4  లో 4వ అంచగా మునగ, అవిశ లాంటి మొక్కలు 61/4 అడుగులకు మధ్యలో సొర, బీర, కాకర, బెండ లాంటి కూరగాయలతోపాటు తోటకూర, గోంగూర, చుక్కకూర లాంటి ఆకుకూరలు, పసుపు, అల్లం, చేమ దుంపలాంటి పంటలు పండిస్తున్నారు. వీటన్నింటిని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతోనే పండిస్తున్నారు. 5 అంచెల విధానంలో లైనుకి లైనుకి 6 1/4 అడుగుల దూరం ఉంటుంది. లైనుకి లైనుకి మధ్య ఒక కాలువ చేసుకుని ఆ వచ్చిన మట్టి లైనులో ఎత్తుగా వేసుకోవడం వలన కలుపు సమస్య తగ్గడంతో పాటు లైనులో ఉన్న మొక్కలకు పోషకాలు బాగా అంది అవి ఆరోగ్యంగా పెరుగుతూ ఎలాంటి కషాయాలు, ద్రావణాలు అవసరం పడటంలేదు. తప్పనిసరి పరిస్థితులలో నీమాస్త్రం, పుల్లటిమజ్జిగ, జీవామృతం లాంటివి పంటపై పిచికారి చేస్తుంటారు. విజయరాం పండించే అన్ని పంటలకు నీటిని అందించటానికి ఎలాంటి డ్రిప్పు, స్ప్రింక్లర్‌ లాంటి విధానాలను ఉపయోగించకుండా కాలువల ద్వారానే నీటిని అందిస్తుంటారు. 5 అంచెల విధానంలో కాలువ ద్వారా నీటిని అందిస్తూ ఆ కాలువలలో అరటి, బొప్పాయి లాంటి ఆకులు మల్చింగ్‌గా ఉపయోగిస్తుంటారు.