సుస్థిర అభివృద్ధి, సాంకేతిక ముందంజ, వినియోగదారుల ప్రాముఖ్యతలే సూచికలుగా నేడు పాడిపరిశ్రమ అనేక సవాళ్ళు ఎదుర్కొంటూ ముందడుగు వేస్తోంది.
ప్రపంచ ఆహార వ్యవస్థలోనే తనదైన ప్రత్యేక ముద్ర వేస్తున్న పాడిపరిశ్రమ అటు వినియోగదారుల మారుతున్న అవసరాలు, పర్యావరణ సంరక్షణలే ప్రాతిపదికగా సాంకేతికత జోడిస్తూ, సుస్థిర అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. సుమారు 55 సం|| క్రితం హైదరాబాద్‌లోని లాలాపేటలో నిర్మించిన విజయ పాల ఉత్పత్తుల కర్మాగారం కాకుండా, ఇటీవల రావిర్యాలలో రూ. 450 కోట్లతో నిర్మించిన మెగా డెయిరీ ఇందుకు నిదర్శనం. అయితే పాల ఉత్పత్తి, ఉత్పాదకతలపరంగానూ, పాడి పశువుల పరంగానూ ఎన్నో సవాళ్ళు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాశిలో ఎక్కువగా ఉన్న పశువుల ఉద్గారాలు, మీథేన్ వలన, పర్యావరణ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దానికై సమతుల ఆహారం అందిస్తూ, ఇట్టి ఉద్గారాలను తగ్గించవచ్చని గుజరాత్‌లో ఎన్‌డిడిబి క్షేత్ర స్థాయిలో నిరూపించింది. సమతుల ఆహారం పశువులకు అందించడం వలన 15-21% మీథేన్ వాయువులను నియంత్రించవచ్చు.
అలాగే, పశువుల పేడ విషయంలోనూ సరియైన నిర్వహణా పద్థతులు అవసరం. బయోగ్యాస్ ఉత్పత్తికై పేడ వినియోగం, మిగిలిన ‘స్లర్రీ’తో భూసారం పెంపొందించడం తప్పక చేపట్టాలి.
నానాటికీ తరిగిపోతున్న పశుగ్రాస భూములను సద్వినియోగం చేసుకోవాలి. ఉన్న భూమిలో పశుగ్రాసాల పెంపకం ప్రణాళికా బద్ధంగా చేపట్టాలి.
డెయిరీ ఫార్మ్ వ్యర్థాలతో సేంద్రియ శక్తి ఉత్పత్తి, ‘బ్రికెట్స్’ లాంటి ఇంధనాల ఉత్పత్తి చేయడం విలువ జోడింపుకు సహకరిస్తాయి.
నీటి సద్వినియోగం, నీటి నాణ్యత పరిరక్షణ ముఖ్యంగా వాననీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం, నీటిని పరిమితంగా వాడుకోగల యంత్రాల వినియోగం, పశువులు కడగగా విడుదలయ్యే నీటిని పశుగ్రాసాల పెంపకానికి వినియోగించడం అవలంబించాలి.
పెద్ద డెయిరీలలో పాల పొడి తయారీ ప్రక్రియలో ఆవిరి ఏర్పడుతుంది. దీనిని తిరిగి నీరుగా మార్చి, వివిధ అవసరాలకు వాడడం చేపట్టాలి.
ముఖ్యంగా డెయిరీలలో నీటి దుబారాని అరికట్టాలి. నీటి మీటర్ల వినియోగం, ప్రతి షిఫ్ట్‌లో నీటి వాడకం పరిశీలించడం, నీటి వినియోగ నియంత్రణకు సహకరిస్తుంది.
పాల ఉత్పత్తి పెంపుదలకు అజొల్లా వినియోగం, అవిసె ఆకులను మేపడం, చెట్ల మధ్య పశుగ్రాసాల పెంపకం నేడు చాలా అవసరం.
పెద్ద డెయిరీ ఫారాల్లో రోబోటిక్ మిల్కింగ్ పార్లర్ల వినియోగం, పశువుల్లో పలు వ్యాధులను తట్టుకొనే జన్యువుల గుర్తింపు, అభివృద్ధి, సెక్స్‌డ్ సెమెన్ పరిజ్ఞానం, పిండమార్పిడి ప్రక్రియ లాంటి ఎన్నో సాంకేతికతలను ఎప్పటికప్పుడు ‘అప్‌డేట్’ చేసుకోవాలి.
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా బాదాం, పసుపు, సోయా, ఓట్స్ పాల తయారీ మార్కెటింగ్ చేయాలి. తక్కువ చక్కెర పానీయాలు, విటమిన్లతో పుష్టీకరించడం, క్లీన్ లేబెల్స్‌తో పాల ఉత్పత్తుల అమ్మకాలు, సాంప్రదాయ ఉత్పత్తులతో ఆధునిక ఉత్పత్తుల మేళవింపు, కొత్త రుచుల కోసం పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, డెయిరీలు ఉత్పత్తులను తాజా, నాణ్యతతో, సరసమైన ధరలో అందించగలగాలి.
సాంకేతికతను ఆహ్వానించని ఏ డెయిరీ మనగలదు. వినియోగదారుని అభిరుచి మేరకు అడుగు వేసినపుడే పాడి పరిఢవిల్లుతుంది. రైతు కష్టం నిజం అవుతుంది.
– మధుసూదనరావు, ఉప సంచాలకులు, విజయ డెయిరీ, ఆదిలాబాద్, 9121160553