అంటువ్యాధులు ఒక జీవి నుండి మరొక జీవికి సోకి, వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. ముఖ్యంగా బాక్టీరియా వలన మరియు వైరస్ వలన ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధులు
చిటుకురోగం: చిటుక వేసేంతలోనే గొర్రెలు క్రిందపడి చనిపోతాయి. అందుకని ఈ వ్యాధిని చిటుక వ్యాధి అని లేక నెత్తిపిడుగు వ్యాధి అని లేదా గడ్డిరోగం అని పిలుస్తారు.
కారణాలు: బ్యాక్టీరియా వల్ల మరియు తొలకరి వర్షాలు తరువాత పెరిగిన గడ్డి తినడం వలన ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా జూన్ నుండి జులై నెలలలో ఎక్కువగా సంక్రమిస్తుంది.
లక్షణాలు: * ఎటువంటి లక్షణాలు కనపడకుండానే జీవాలు ముఖ్యంగా గొర్రెలు మరణిస్తాయి. * నీరసంగా ఉండి, గిలగిలా కొట్టుకుని, గాలిలోకి ఎగిరి క్రిందపడి చనిపోతాయి.
చికిత్స, నివారణ: * వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి.* వ్యాధి సోకిన మందను, ఇతర మందల నుండి దూరంగా ఉంచి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. * స్థానిక పశువైద్యని వెంటనే సంప్రదించాలి.
కాలిపుండువ్యాధి: మేత సమయంలో మందలోని కొన్ని గొర్రెలు నడవలేక కుంటుతూ కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో తడిచిన నేలలో తిరిగినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి.
కారణాలు: బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి సోకుతుంది.
లక్షణాలు:
* మందలోని ఒకటి, రెండు గొర్రెలు సరిగా నడవలేకపోవడం
* గిట్టల మధ్యభాగం ఎర్రగా మారి, నొప్పిని కలుగచేస్తుంది.
* వ్యాధి సోకిన గొర్రె మూడు కాళ్ళ మీద గెంతుతుంది.
* ఎర్రగా కందిన భాగం ఉబ్బి, చీము పట్టి నల్లగా కమిలిపోతాయి.
* ఆ భాగం చెడు వాసన వస్తుంది.
* వ్యాధి తీవ్రంగా సోకిన థలో గిట్టలు వూడిపోతాయి.
చికిత్స, నివారణ: * మందలో వ్యాధి లక్షణాలను గమనించిన వెంటనే దగ్గరలోని పశువైద్యుని పర్యవేక్షణలో పెన్సిలిన్ మరియు నొప్పి నివారణ మందులు వాడాలి. * వ్యాధి సోకిన గిట్టలను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి పశువైద్యుని సలహాలు పాటించాలి.
వైరస్ వలన వచ్చే వ్యాధులు
గాలికుంటు వ్యాధి: ఈ వ్యాధి గాలి ద్వారా సోకుతుంది. కనుక గాలికుంటువ్యాధి అని పిలుస్తారు. ఈ వ్యాధి సోకిన జీవాలలో నోరు మరియు గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి.
కారణాలు: ఈ వ్యాధి ఫుట్ అండ్ మౌత్ వైరస్ వలన సోకుతుంది.
లక్షణాలు:
* తీవ్రమైన జ్వరం (104-106 డిగ్రీ ఫారెన్‌హీట్) ఉంటుంది.
* నోటిలో, నాలిక మీద, గిట్టల మధ్య భాగంలో పుండ్లు ఏర్పడతాయి.
* నోటి నుండి చొంగ కారుతుంది.
* నోటిలోని పుండ్ల వలన జీవాలు, సరిగా మేత మేయవు. కాలిపుండ్లు వలన కుంటుతూ నడుస్తాయి.
* వ్యాధి సోకిన గొర్రె పిల్లలు ఎక్కువగా చనిపోతాయి.
చికిత్స, నివారణ: * నోటిలో పుండ్లను మరియు కాలిలోని పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి బోరిక్ గ్లిసరిన్ ఆయింట్‌మెంటును పెట్టాలి. జి నోటి పుండ్ల వలన గొర్రెలు మేత మేయవు కనుక జీవాలకు గంజి లేక అంబలిని గ్లూకోజ్‌తో కలిపి త్రాగించాలి. * వ్యాధి సోకిన జీవాలను మంద నుండి వేరు చేయాలి. జి వ్యాధి నిరోధక టీకాలను ఇప్పించాలి.
నీలినాలుక వ్యాధి (బ్లూటంగ్)
ఈ వ్యాధిని మూతివాపు, మూతి పుండ్లువ్యాధి అని పిలుస్తారు.
కారణాలు: * ఈ వ్యాధి వైరస్ వలన కలుగుతుంది. * దోమ కాటు వలన ఈ క్రిములు గొర్రెలోని శరీరంలోనికి ప్రవేశించి వ్యాధిని కలుగచేస్తాయి.
లక్షణాలు: * అధిక జ్వరం, గొర్రెలలో చొంగకారుతూ, పెదవులు మరియు చిగుళ్ళు వాచి, పెదవుల లోపల భాగం ఎర్రబడి, చిన్న చిన్న గుల్లలుగా ఏర్పడతాయి. * గిట్టల మధ్య భాగం ఎర్రగా ఉంటుంది. సరిగా నడవలేక మేత సరిగా మేయకుండా, నీరసించి పోతాయి. * నాలుక నీలి రంగులో మారుతుంది.
చికిత్స, నివారణ: వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. * తగు నొప్పి నివారణ మందులు, యాంటిబయోటిక్ మందులు వాడాలి. * నోటిలోని పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో కడిగి జింక్ పౌడర్ నీటితో రుద్దాలి.
పుర్రురోగం (పి.పి.ఆర్):
ఈ వ్యాధిని ముసర వ్యాధి లేక పెద్ద రోగమును పోలి ఉంటుంది. ఈ వ్యాధి ముఖ్యంగా ఫిబ్రవరి నుండి మే సమయంలో ఎక్కువగా వస్తుంది. మేక పిల్లలకు తీవ్రంగా సోకుతుంది.
కారణాలు: ఈ వ్యాధి వైరస్ వలన సంక్రమిస్తుంది. కొత్తగా కొనుగోలు చేసిన మేకలను మందలో చేర్చిన తరువాత ఈ వ్యాధి ప్రబలుతుంది.
లక్షణాలు:
* వ్యాధి సోకిన మేకలలో జ్వరం తీవ్రంగా ఉంటుంది.
* జీవాలు సరిగా మేయకపోవడం, పలుచగా పారుతూ ఉంటాయి.
* నోటిలో, పెదవులు, నాలుక వాచి పొక్కులు ఏర్పడతాయి.
* చూడితో ఉన్న జీవాలు ఈసుకుని పోతాయి.
* డీహ్రైడ్రేషన్ సంభవించి, జీవాలు మరణిస్తాయి.
చికిత్స నివారణ: * వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే దగ్గరలోని పశువైద్యుని సంప్రదించి, వారి పర్యవేక్షణలో సరైన చికిత్స అందించాలి. * గ్లూకోజు మరియు ఎలక్ట్రోలైట్స్ కలిపిన నీటిని ఞ గంజిని త్రాగించాలి.
డా. కె. లక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్, పశువైద్య విభాగం, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్ ఫోన్: 8978154747